Share News

585 ఆరోగ్య ఉప కేంద్రాల నిర్మాణం వేగవంతం!

ABN , Publish Date - Mar 16 , 2026 | 04:26 AM

రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న 653 ఆరోగ్య ఉప కేంద్రాల నిర్మాణ పనులు పూర్తి చేయడంపై వైద్య ఆరోగ్య శాఖ దృష్టి సారించింది. వాటికి 15వ ఆర్థిక సంఘం నిధులను ఉపయోగించుకునేందుకు .....

585 ఆరోగ్య ఉప కేంద్రాల నిర్మాణం వేగవంతం!

  • 15వ ఆర్థిక సంఘం నిధులు 129 కోట్లు వినియోగించేందుకు ప్రభుత్వం అనుమతి

  • 48 కేంద్రాల పెండింగ్‌ బిల్లులూ మంజూరు

హైదరాబాద్‌, మార్చి 15(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న 653 ఆరోగ్య ఉప కేంద్రాల నిర్మాణ పనులు పూర్తి చేయడంపై వైద్య ఆరోగ్య శాఖ దృష్టి సారించింది. వాటికి 15వ ఆర్థిక సంఘం నిధులను ఉపయోగించుకునేందుకు ఆ శాఖ ప్రతిపాదనలు పంపగా ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. గ్రామీణ ఆరోగ్య సేవలను బలోపేతం చేసే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రాష్ట్రంలో 2,239 హెల్త్‌ సబ్‌ సెంటర్లను నిర్మించాలని తలపెట్టాయి. దీనికి రూ.447.80 కోట్లు అంచనా వ్యయంగా నిర్ణయించారు. ఇందులో 60 శాతం కేంద్రం, 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. 1,375 ఉప కేంద్రాల నిర్మాణ పనులు మొదలుపెట్టగా 786 పూర్తయ్యాయి. వాటిలో 738 కేంద్రాల బిల్లులు చెల్లించారు. మరో 48 కేంద్రాల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఆ మొత్తం సుమారు రూ.9.89 కోట్లు ఉంది. మరో 864 కేంద్రాల నిర్మాణ పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. కాగా, 2025-26 ఆర్థిక సంవత్సరానికి మరో 585 ఉప కేంద్రాల నిర్మాణానికి అనుమతులు వచ్చాయి. ఈ పనులు కొనసాగుతుండగా వాటికి సుమారు రూ.119.98 కోట్లు అవసరమవుతాయి. ఈ నిధులతో పాటు నిర్మాణం పూర్తయిన 48 కేంద్రాల బిల్లుల చెల్లింపునకు రూ.129.87 కోట్లు కావాలి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 15వ ఆర్థిక సంఘ నిధులను వినియోగించేందుకు అనుమతి ఇవ్వాలని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్‌ డాక్టర్‌ సంగీతా సత్యనారాయణ ప్రభుత్వాన్ని కోరారు. దీనికి ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. దీంతో నిర్మాణ పనులు వేగవంతమవుతాయని చెబుతున్నాయి. ఇప్పటిదాకా తాత్కాలిక, అద్దె భవనాల్లో కొనసాగుతున్న ఆరోగ్య ఉప కేంద్రాలు శాశ్వత భవనాల్లోకి మారతాయని, గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక వైద్య సేవలు మరింత మెరుగుపడతాయని భావిస్తున్నాయి.

Updated Date - Mar 16 , 2026 | 04:26 AM