HAM Roads: ఆర్ అండ్ బీలో 1,600 కోట్ల అదనపు పనులు!
ABN , Publish Date - Jan 08 , 2026 | 04:07 AM
హైబ్రిడ్ యాన్యునిటీ మోడ్ (హ్యామ్)లో అభివృద్ధి చేసే రోడ్లకు అవసరమయ్యే నిధులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నుంచి తీసుకోవాలని నిర్ణయించిన గ్యారెంటీలకు....
హ్యామ్ రోడ్ల కోసం ఆర్బీఐ గ్యారెంటీలకు ఆర్థికశాఖ ఓకే.. సీఎ్‌సకు చేరిన ఫైలు.. 17 లేదా 18న క్యాబినెట్ భేటీ!
హైదరాబాద్, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): హైబ్రిడ్ యాన్యునిటీ మోడ్ (హ్యామ్)లో అభివృద్ధి చేసే రోడ్లకు అవసరమయ్యే నిధులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నుంచి తీసుకోవాలని నిర్ణయించిన గ్యారెంటీలకు ఆర్థిక శాఖ పచ్చజెండా ఊపింది. సంబంధిత ఫైలు ఆర్థిక శాఖలో ఆమోదం పొంది తాజాగా సీఎస్ రామకృష్ణారావు దగ్గరకు చేరింది. నిధుల చెల్లింపు కోసం ఎస్ర్కో అకౌంట్‌ను ఓపెన్ చేసి వాటి ద్వారా ప్రత్యేక విధానంలో చెల్లింపులు జరపనున్నారు. హ్యామ్ విధానంలో చేపట్టే రోడ్లకు చెల్లించే నిధుల విషయంలో ప్రభుత్వం స్పష్టతనివ్వకపోవడంతో టెండర్లలో కాంట్రాక్టర్లు పాల్గొనలేదు. ఈ క్రమంలోనే నిధుల చెల్లింపునకు ఆర్బీఐ నుంచి గ్యారెంటీలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అవసరమైన అనుమతులు ఆర్థిక శాఖ మంజూరు చేసినట్టు తెలిసింది. మరోవైపు హ్యామ్ రోడ్ల పనులు మొదట నిర్ణయించిన వాటి కంటే కొంత పెరగనున్నాయి. ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ శాఖల్లో కలిపి తొలి విడతలో రూ.17,693 కోట్లతో 13,273 కిలోమీటర్లను అభివృద్ధి చేయాలని పనులను గుర్తించారు. తాజాగా ఆర్ అండ్ బీ పరిధిలో మరో రూ.1,600 కోట్ల విలువ చేసే పనులను కొత్తగా ప్రతిపాదించినట్టు తెలిసింది. దీంతో ఆర్ అండ్ బీలో మొదట అనుకున్న రూ.11,399 కోట్లకు అదనంగా మరో రూ.1,600 కోట్ల పనులు చేరాయి. దీంతో ఒక్క ఆర్ అండ్ బీ పరిధిలోనే హ్యామ్ కింద రూ.12,999 కోట్ల పనులను చేపట్టనున్నారు.
త్వరలో క్యాబినెట్ భేటీ..
ఈ నెల 17 లేదా 18వ తేదీలో మంత్రివర్గ సమావేశం జరగనుందని తెలిసింది. మునిసిపల్ ఎన్నికలతో పాటు పలు అంశాలపై క్యాబినెట్‌లో చర్చించనున్నట్టు సమాచారం. 2026-27 బడ్జెట్ కసరత్తు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులను రాబట్టుకోవడంపై చర్చించి, అధికారులకు దిశానిర్దేశం చేయనున్నట్టు తెలిసింది. అలాగే రాష్ట్రంలో ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ శాఖల్లో హ్యామ్ విధానంలో అభివృద్ధి చేయాలని నిర్ణయించిన పనులకు అవసరమయ్యే నిధులను ఆర్బీఐ నుంచి గ్యారెంటీలను తీసుకునే అంశంపై కీలకంగా చర్చించనున్నారు. ఆర్బీఐ గ్యారెంటీల కోసం ఆర్థిక శాఖ అనుమతినిచ్చిన నేపథ్యంలో ఈ ఫైలు క్యాబినెట్ ముందుకెళ్లనుంది. అలాగే జిల్లాల నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థలకు ఎక్కడెక్కడ సొంత భవనాలు లేవు, భవనాల నిర్మాణం కోసం గుర్తించిన స్థలాల అంశం కూడా క్యాబినెట్‌కు ముందుకు రావచ్చని అధికారుల ద్వారా తెలిసింది. దీనిపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు. ఇటు.. రాష్ట్రంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల విషయం ఇటీవల చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. పనిచేయకుండా కొంతమంది జీతాలు తీసుకుంటుంటే, మరికొంతమంది పనిచేస్తున్నా జీతాలు సక్రమంగా ఇవ్వడం లేదు. దీనిపై చర్చించడంతో పాటు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల నియామకాలకు సంబంధించి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకునే అవకాశముందని తెలిసింది.