గవర్నర్ ప్రసంగం ప్రభుత్వ పనితీరుకు అద్దం: ఆది శ్రీనివాస్
ABN , Publish Date - Mar 17 , 2026 | 04:11 AM
మ ప్రభుత్వ పనితీరుకు గవర్నర్ ప్రసంగం అద్దం పడుతోందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. దీన్ని చూసి జీర్ణించుకోలేని బీఆర్‌ఎస్ సభ్యులు నిరసనలు చేశారని....
బీఆర్‌ఎస్ అంటే బోగస్ రాష్ట్ర సమితి: అద్దంకి
హైదరాబాద్, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): తమ ప్రభుత్వ పనితీరుకు గవర్నర్ ప్రసంగం అద్దం పడుతోందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. దీన్ని చూసి జీర్ణించుకోలేని బీఆర్‌ఎస్ సభ్యులు నిరసనలు చేశారని విమర్శించారు. వారికి గవర్నర్ అన్నా.. చట్ట సభలన్నా గౌరవం లేదని.. అందుకే ఆరు గ్యారెంటీల విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు అసెంబ్లీ ప్రాంగణంలోని మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్ అంటే బోగస్ రాష్ట్ర సమితి అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ దుయ్యబట్టారు. గవర్నర్ ప్రసంగిస్తుంటే లేచి నిల్చుని బీఆర్‌ఎస్ సభ్యులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపడం రాజ్యాంగ వ్యవస్థను అపహాస్యం చేయడమేనన్నారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంలోని అంశాలన్నీ అక్షర సత్యాలన్నారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వ పాలన దక్షతను చూసే రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందాలు చేసుకున్నారని తెలిపారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం పేదలకు ఏం ఇవ్వకుండా అరాచక పాలన సాగిస్తే.. తమ ప్రభుత్వమొచ్చాక పేదలను ఆదుకునే పథకాలన్నింటినీ అమలు చేస్తోందన్నారు. కాగా, రాష్ట్రంలో విచ్చలవిడిగా వినియోగిస్తున్న గడ్డి, కలుపు మందులను నిషేధించాలంటూ సీఎం రేవంత్‌రెడ్డికి అసెంబ్లీ ఆవరణలో రాష్ట్ర వ్యవసాయ కమిషన్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి వినతిపత్రం అందజేశారు.
గాంధీభవన్‌లో సిలిండర్లతో ఎన్‌ఎస్‌యూఐ నిరసన
రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న వంట గ్యాస్ కొరత, ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా తెలంగాణ ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో గాంధీభవన్‌లో వినూత్న నిరసన చేపట్టారు. ఎన్‌ఎ్‌సయూఐ రాష్ట్ర అధ్యక్షుడు యడవల్లి వెంకటస్వామి నేతృత్వంలో గ్యాస్ సిలిండర్లను ప్రదర్శిస్తూ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. గ్యాస్ సంక్షోభం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వెంకటస్వామి ఆవేదన వ్యక్తం చేశారు.