Share News

వర్సిటీలు డిగ్రీలు ఇచ్చే సంస్థలుగా మారొద్దు

ABN , Publish Date - Apr 24 , 2026 | 04:00 AM

రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు ఉపాధి ఆధారిత విద్య, నైపుణ్యాభివృద్ధి, నూతన విద్యా విధానం అమలుకు ప్రాధాన్యం ఇవ్వాలని గవర్నర్‌ శివప్రతాప్‌...

వర్సిటీలు డిగ్రీలు ఇచ్చే సంస్థలుగా మారొద్దు

  • ఉపాధి ఆధారిత విద్యాభివృద్ధికి సంకల్పించాలి

  • వీసీల సమావేశంలో గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 23(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు ఉపాధి ఆధారిత విద్య, నైపుణ్యాభివృద్ధి, నూతన విద్యా విధానం అమలుకు ప్రాధాన్యం ఇవ్వాలని గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా దిశానిర్దేశం చేశారు. కేవలం డిగ్రీలు ప్రదానం చేయడానికే పరిమితం కావొద్దని సూచించారు. వివిధ వర్సిటీల వీసీలు, ఉన్నత విద్యాశాఖ అధికారులతో గురువారం లోక్‌భవన్‌లో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రంలోని పరిశ్రమలతో సమన్వయం చేసుకుంటూ పరిశోధన, ఆవిష్కరణలను.. ఆచరణాత్మక పరిష్కారాలను ప్రోత్సహించాలన్నారు. తెలంగాణ వర్సిటీలు దేశంలోనే ఉత్తమంగా నిలవాలని ఆకాంక్షించారు. ప్రధాని మోదీ చేపట్టిన ‘స్టార్టప్‌ ఇండియా’, ‘స్కిల్‌ ఇండియా’, ‘డిజిటల్‌ ఇండియా’ వంటి కార్యక్రమాలు యువత సాధికారతకు దోహదం చేస్తున్నాయన్నారు. మన వర్సిటీలు కూడా విదేశీ వర్సిటీలకేమీ తీసిపోవని.. మన దేశ వర్సిటీల్లో చదువుకుని డాక్టర్లు, ఇంజనీర్లు అయిన వారు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారన్నారు. వీసీలు విద్యార్థుల భవితను తీర్చిదిద్దే దార్శనిక నేతలు కావాలన్నారు. కాగా.. ఉన్నత విద్యలో గత ఏడాదిగా అమలు చేస్తున్న కొత్త కోర్సులు, సంస్కరణలు, నైపుణ్యాభివృద్ధి, పరిశోధన కార్యక్రమాలను గవర్నర్‌కు ఉన్నత విద్యామండలి చైర్మన్‌ బాలకృష్ణారెడ్డి వివరించారు. ఈ కార్యక్రమంలో ఓయూ, కాకతీయ, మహాత్మాగాంఽధీ, పాలమూరు, శాతవాహన తదితర విశ్వవిద్యాలయాల వీసీలు పాల్గొన్నారు.

Updated Date - Apr 24 , 2026 | 04:00 AM