Share News

జనగణనలో అందరూ పాల్గొనాలి

ABN , Publish Date - Apr 27 , 2026 | 05:08 AM

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జనగణన-2027 కార్యక్రమంలో రాష్ట్ర ప్రజలందరూ భాగస్వాములు కావాలని గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా సూచించారు...

జనగణనలో అందరూ పాల్గొనాలి

  • తమ వివరాలను నమోదు చేసుకోవాలి

  • జనగణనతో అభివృద్ధి ఫలాలు అందరికీ చేరే అవకాశం: గవర్నర్‌ శుక్లా

  • స్వీయ నమోదుతో ప్రారంభించిన గవర్నర్‌

  • సీఎం రేవంత్‌రెడ్డి స్వీయ జనగణన

  • అందరూ భాగస్వాములు కావాలని పిలుపు

హైదరాబాద్‌/హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జనగణన-2027 కార్యక్రమంలో రాష్ట్ర ప్రజలందరూ భాగస్వాములు కావాలని గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా సూచించారు. ఆదివారం ఆన్‌లైన్‌లో స్వీయ నమోదు ద్వారా తన వివరాలను నమోదు చేసి రాష్ట్రంలో జనగణన కార్యక్రమాన్ని గవర్నర్‌ అధికారికంగా ప్రారంభించారు. స్వీయ గణన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనాభా గణన అనేది ఒక కీలకమైన జాతీయ కార్యక్రమం అని, మన జనాభా, వారి సామాజిక ఆర్థిక స్థితిపై సమగ్రమైన చిత్రాన్ని అందిస్తుందని అన్నారు. అంతేకాకుండా జనగణన.. ప్రణాళిక, సుపరిపాలన, వనరుల సమాన పంపిణీకి పునాది అని, దీని ద్వారా అభివృద్ధి ఫలాలు సమాజంలోని ప్రతి వర్గానికీ చేరుతాయని పేర్కొన్నారు. విద్య, ఆరోగ్యం, ఉపాధి, గృహనిర్మాణం, మౌలిక సదుపాయాలకు సంబంధించిన విధి విధానాలను రూపొందించడంలో జనాభా గణన కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. కచ్చితమైన సమాచారంతో లక్షిత సంక్షేమ పథకాలను రూపొందించడానికి, జాతీయ పురోగతిని సమర్థంగా అంచనా వేయడానికి జనాభా గణన ప్రభుత్వానికి వీలు కల్పిస్తుందని తెలిపారు. తాను స్వయంగా తన వివరాలను నమోదు చేసుకున్నానని, ఈ ప్రక్రియ అత్యంత సరళంగా ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా స్వీయ జనగణనలో పాల్గొన్నారు. సెల్ఫ్‌ ఎన్యుమరేషన్‌కు సంబంధించిన అంశాలను ముఖ్యమంత్రికి జనగణన అధికారులు వివరించగా.. వెబ్‌సైట్‌ ద్వారా ఆయన తన వివరాలను నమోదు చేసుకున్నారు. ఈ ప్రక్రియలో రాష్ట్ర ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సెన్సస్‌ ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ భారతి హోళికేరి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌వీ కర్ణన్‌, జాయింట్‌ ప్రిన్సిపల్‌ సెన్సస్‌ ఆఫీసర్‌ ప్రియాంక ఆల, ఐ అండ్‌ పీఆర్‌ కమిషనర్‌ సీహెచ్‌.ప్రియాంక ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Updated Date - Apr 27 , 2026 | 05:08 AM