అజారుద్దీన్, కోదండరాం ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాల ఆమోదం
ABN , Publish Date - Apr 26 , 2026 | 04:24 AM
గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై లోక్‌భవన్‌లో 9నెలలుగా పెండింగ్‌లో ఉన్న ఫైల్‌ను గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఆమోదించారు. మాజీ క్రికెటర్ అజారుద్దీన్..
హైదరాబాద్, ఏప్రిల్ 25(ఆంధ్రజ్యోతి): గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై లోక్‌భవన్‌లో 9నెలలుగా పెండింగ్‌లో ఉన్న ఫైల్‌ను గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఆమోదించారు. మాజీ క్రికెటర్ అజారుద్దీన్, ప్రొఫెసర్ కోదండరాం అభ్యర్ధిత్వాలను ఆమోదిస్తూ గవర్నర్ సంతకం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది ఆగస్టు 30న గవర్నర్ పరిశీలన నిమిత్తం ఈ ఫైల్ పంపించింది. నాటి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ లీగల్ ఒపీనియన్ తీసుకున్నప్పటికీ ఫైలును పెండింగ్‌లోనే ఉంచారు. ఈ క్రమంలో అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అజారుద్దీన్ 6నెలల లోపు అంటే ఈ నెలాఖరులోపే ఎంపిక కావాల్సి ఉండటంతో సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలే గవర్నర్ శుక్లాను కలిసి ఎమ్మెల్సీల పెండింగ్ ఫైలు గురించి గుర్తు చేశారు. దీంతో గవర్నర్ న్యాయపరమైన సలహా తీసుకున్న తర్వాత ఫైల్ క్లియర్ చేశారని సమాచారం. రేవంత్ దౌత్యం ఫలించి గవర్నర్ అనుమతి లభించడంతో ప్రభుత్వం గెజిట్ ద్వారా ఉత్తర్వులు జారీ చేయవచ్చని తెలుస్తోంది.