Share News

వైద్యులు మానవీయతను మరువకూడదు: గవర్నర్‌ శుక్లా

ABN , Publish Date - May 03 , 2026 | 05:11 AM

ఆరోగ్య రంగంలో వేగంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా వైద్యవృత్తిలో ఉన్నవారు సాంకేతికత, పరిశోధనలకు ప్రాధాన్యం ఇస్తూనే మానవీయతను మరువకూడదని తెలంగాణ గవర్నర్‌ శివప్రతాప్‌...

వైద్యులు మానవీయతను మరువకూడదు: గవర్నర్‌ శుక్లా

  • 2027 నాటికి నయా ఉస్మానియా ఆస్పత్రి: మంత్రి దామోదర

  • ఘనంగా ఉస్మానియా వైద్య కళాశాల 175వ స్నాతకోత్సవం

హైదరాబాద్‌ సిటీ, మే 2 (ఆంధ్రజ్యోతి): ఆరోగ్య రంగంలో వేగంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా వైద్యవృత్తిలో ఉన్నవారు సాంకేతికత, పరిశోధనలకు ప్రాధాన్యం ఇస్తూనే మానవీయతను మరువకూడదని తెలంగాణ గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా అన్నారు. ఉస్మానియా వైద్య కళాశాలలో 175వ స్నాతకోత్సవం శనివారం సాయంత్రం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి గవర్నర్‌ శుక్లా, మంత్రి దామోదర రాజనర్సింహ ముఖ్య అతిథులుగా హాజరై వైద్యవిద్య పూర్తి చేసుకున్న విద్యార్థులకు పట్టాలను అందించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ.. వైద్యవృత్తి కేవలం ఉపాధి మార్గం మాత్రమే కాదని, అది మానవాళికి సేవ చేయడానికి తీసుకునే పవిత్ర ప్రతిజ్ఞ అని అన్నారు. వైద్యుడిపై రోగికి ఉన్న నమ్మకమే వారికి అతిపెద్ద ఆస్తి అన్నారు. వైద్యులు జ్ఞానం, సాంకేతిక నైపుణ్యంతో పాటు కరుణ, సానుభూతి వంటి మానవీయ విలువలను అలవరచుకోవాలని సూచించారు. ఉస్మానియా వైద్య కళాశాల గొప్పతనాన్ని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలని, పట్టభద్రులందరికీ ఉజ్వల భవిష్యత్తు కలగాలని గవర్నర్‌ ఆకాంక్షించారు.

వేగంగా ఆస్పత్రి భవన నిర్మాణ పనులు: మంత్రి

గోషామహల్‌లో ఉస్మానియా ఆస్పత్రి నూతన భవన నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని, 2027 కల్లా ఆస్పత్రిని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే లక్ష్యంతో పనిచేస్తున్నామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. అత్యాధునిక సాంకేతికత, అన్ని రకాల సౌకర్యాలతో కొత్త ఉస్మానియా ఆస్పత్రి ఉండబోతుందని పేర్కొన్నారు. దశాబ్దాలుగా ఉన్న ఉస్మానియా నూతన ఆస్పత్రి కలను తమ ప్రభుత్వం నెరవేరుస్తోందన్నారు. కొత్త భవనం అందుబాటులోకి వస్తే అత్యాధునిక వైద్య సదుపాయాలు, సూపర్‌ స్పెషాలిటీ సేవలు, అత్యవసర చికిత్సలు మరింత విస్తృతంగా అందించగలమని మంత్రి పేర్కొన్నారు. వైద్యవిద్యను బలోపేతం చేసే దిశగా విద్యార్థుల కోసం గాంధీ, ఉస్మానియా మెడికల్‌ కాలేజీల్లో అత్యాధునిక వసతులతో హాస్టల్‌ భవనాల నిర్మాణం కూడా చేపట్టామని మంత్రి గుర్తుచేశారు. ప్రజలకు అందుబాటులో, నాణ్యమైన వైద్యసేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఉస్మానియా ఆస్పత్రి నూతన భవన నిర్మాణం రాష్ట్ర వైద్య రంగంలో కీలక మైలురాయిగా నిలుస్తుందని మంత్రి తెలిపారు.

Updated Date - May 03 , 2026 | 05:11 AM