Share News

చుక్క రక్తం.. ఒక జీవితానికి వెలుగు: గవర్నర్‌

ABN , Publish Date - Jun 15 , 2026 | 04:49 AM

రక్తదానం వైద్య సాయం మాత్రమే కాదని, మానవత్వానికి, సామాజిక బాధ్యతకు ప్రతీక అని గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా పేర్కొన్నారు. మనం దానం చేసే రక్తంలోని ప్రతిచుక్క ఒక రోగికి...

చుక్క రక్తం.. ఒక జీవితానికి వెలుగు: గవర్నర్‌

  • జూపల్లి ఓఎస్డీకి హయ్యెస్ట్‌ బ్లడ్‌ డోనర్‌ మోటివేటర్‌ అవార్డు

హైదరాబాద్‌, హైదరాబాద్‌ సిటీ, జూన్‌14 (ఆంధ్రజ్యోతి): రక్తదానం వైద్య సాయం మాత్రమే కాదని, మానవత్వానికి, సామాజిక బాధ్యతకు ప్రతీక అని గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా పేర్కొన్నారు. మనం దానం చేసే రక్తంలోని ప్రతిచుక్క ఒక రోగికి జీవితంపై కొత్త ఆశను, జీవించే అవకాశాన్ని అందిస్తుందన్నారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఎన్టీఆర్‌ మార్గ్‌లోని అంబేడ్కర్‌ విగ్రహం నుంచి రెడ్‌క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీని గవర్నర్‌ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం లోక్‌భవన్‌లో స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడుతూ అపరిచితుల ప్రాణాలను కాపాడేందుకు ముందుకొచ్చే స్వచ్ఛంద రక్తదాతలు నిజమైన హీరోలని కీర్తించారు. ఈ సందర్భంగా స్వచ్ఛంద రక్తదానాన్ని ప్రోత్సహిస్తూ విశిష్ట సేవలందించిన మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా రెడ్‌క్రాస్‌ శాఖ చైర్మన్‌, మంత్రి జూపల్లి కృష్ణారావు ఓఎస్డీ రాజేశ్వర్‌రావుకు గవర్నర్‌ హయ్యెస్ట్‌ బ్లడ్‌ డోనర్‌ మోటివేటర్‌ 2026 అవార్డును అందజేశారు.రక్తదాన ఉద్యమాన్ని యువత పల్లెల వరకు తీసుకెళ్లాలని గవర్నర్‌ పిలుపునిచ్చారు. రక్తదానాన్ని ప్రోత్సహించేందుకు చేపట్టిన ర్యాలీలో, రక్తదాన శిబిరంలో 2,500 మంది ఎన్‌సీసీ క్యాడెట్లు, స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Jun 15 , 2026 | 04:49 AM