రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు ఉండదు
ABN , Publish Date - Jun 03 , 2026 | 05:45 AM
రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో మంత్రులమంతా ఒక టీంగా పరిపాలన సాగిస్తున్నామని, ఐక్యంగా రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్నామని ఉపముఖ్యమంత్రి...
సీఎం రేవంత్ నేతృత్వంలో బృందంగా పనిచేస్తున్నాం
ఐక్యంగా రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నాం: భట్టి విక్రమార్క
ఖమ్మం, జూన్ 2 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో మంత్రులమంతా ఒక టీంగా పరిపాలన సాగిస్తున్నామని, ఐక్యంగా రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్నామని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. మంగళవారం మధ్యాహ్నం ఖమ్మంలోని కాంగ్రెస్ జిల్లా కార్యాలయానికి వచ్చిన ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు జరిగినట్టుగా తెలంగాణలో ఉంటుందా? అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. ఇక్కడ అలాంటిదేమి లేదని, సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో మంత్రులమంతా టీంగా పనిచేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లు సమర్థవంతంగా నిర్వహించామని, దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా తమ ప్రభుత్వం పంటలను కొనుగోలు చేసిందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం ధాన్యం కొనుగోలులో ఆంక్షలు పెడుతోందన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలు తప్పుడు ప్రచారాలు సాగిస్తున్నారని, కేంద్రం ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనకపోతే కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండిసంజయ్, బీజేపీ నేతల ఇళ్ల ముందు ధాన్యం పోసి నిరసన తెలుపుతామని హెచ్చరించారు. బీఆర్‌ఎస్ నేత హరీశ్ రావు నిత్యం వార్తల్లో ఉండాలన్న తాపత్రయంతో ఇష్టానుసారంగా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇంటిగ్రేటెడ్ విద్యను తెలంగాణ ప్రభుత్వం అందిస్తోందని చెప్పారు. రాష్ట్రంలో ప్రజాప్రతినిధులు, జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు ఇచ్చే ప్రక్రియపై ఒక ఉన్నతాధికారుల కమిటీ ఏర్పాటు చేసి కసరత్తు చేయనున్నట్టు ఆయన తెలిపారు.