జిల్లా ఆస్పత్రుల్లోనూ ఏఐ వినియోగం
ABN , Publish Date - Jun 15 , 2026 | 04:07 AM
రాబోయే రోజుల్లో జిల్లా ఆస్పత్రుల్లో కూడా కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వ్యాధి నిర్ధారణ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని, నిపుణులు అందుబాటులో లేని ప్రాంతాల్లో...
సెప్సిస్, ఫ్యాటీ లివర్ వంటి వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించే సాంకేతికత
అత్యాధునిక శిక్షణతో వైద్యులను ఏఐ యుగానికి సిద్ధం చేస్తున్నాం
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజనర్సింహ
హైదరాబాద్ సిటీ, జూన్ 14(ఆంధ్రజ్యోతి): రాబోయే రోజుల్లో జిల్లా ఆస్పత్రుల్లో కూడా కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వ్యాధి నిర్ధారణ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని, నిపుణులు అందుబాటులో లేని ప్రాంతాల్లో కూడా అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని వైద్య అరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ప్రభుత్వ వైద్య రంగంలో ఇప్పటికే ఏఐ ఆధారిత కార్యక్రమాలు అమలులో ఉన్నాయని, సెప్సిస్, ఫ్యాటీ లివర్ వంటి వ్యాధులను ముందుగానే గుర్తించడం, ఏఐ సాయంతో ఎక్స్‌రే చిత్రాలను విశ్లేషించడం వంటి సాంకేతికతలను ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రవేశపెడుతున్నామని చెప్పారు. హైటెక్ సిటీలోని యశోద ఆస్పత్రిలో ఆదివారం నిర్వహించిన ‘ఆరోగ్య రంగంలో ఏఐ’ సదస్సు ముగింపు కార్యక్రమానికి మంత్రి రాజనర్సింహ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో డిజిటల్ తరగతి గదులు, సిమ్యులేషన్ ల్యాబ్స్ వంటి అత్యాధునిక శిక్షణ సదుపాయాలు కల్పిస్తూ భవిష్యత్ వైద్యులను ఏఐ యుగానికి సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స అందించడంపైనే వైద్య వ్యవస్థ దృష్టి కేంద్రీకృతమై ఉండేదని, ప్రస్తుతం ఏఐ, జీనోమిక్స్, అత్యాధునిక సాంకేతికతలతో వ్యాధులను ముందుగానే గుర్తించడం సాధ్యమవుతోందని పేర్కొన్నారు. ఏఐ, జీనోమిక్స్, ప్రిసిషన్ మెడిసిన్ ద్వారా ప్రతి రోగికి వారి ఆరోగ్య పరిస్థితికి అనుగుణమైన వ్యక్తిగత వైద్య సేవలు అందించే దిశగా ప్రపంచం ముందుకు సాగుతోందని, తెలంగాణ కూడా అదే దిశగా వేగంగా అడుగులు వేస్తోందన్నారు. విజన్-2047 లక్ష్యాల దిశగా తెలంగాణ ఆరోగ్య రంగాన్ని మరింత బలోపేతం చేస్తూ, చికిత్స ఆధారిత వ్యవస్థ నుంచి నివారణ ఆధారిత ప్రజారోగ్య వ్యవస్థగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ప్రతి ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రతి పేద కుటుంబానికి అత్యాధునిక వైద్య సేవలు అందాలన్నదే తమ సంకల్పమని చెప్పారు. ఆర్థిక సామర్థ్యం తో సంబంధం లేకుండా ప్రతి పౌరునికి అందుబాటు ధరల్లో నాణ్యమైన వైద్య సేవలు పొందేందుకు ఉపయోగపడితేనే ఏ సాంకేతిక లక్ష్యమైనా నెరవేరినట్లవుతుందన్నారు. ప్రజల ప్రయోజనాలను కాపాడే బాధ్యతాయుతమైన ఏఐ వినియోగానికి అవసరమైన విధానాలు రూపొందిస్తామని తెలిపారు. ఏఐ ఎంత శక్తివంతమైనదైనా మానవీయ విలువలు, వైద్యుల అనుభవం, రోగుల పట్ల కరుణ, సేవాభావానికి ఎప్పటికీ ప్రత్యామ్నాయం కాదన్నారు. వైద్యులను ఏఐ భర్తీ చేయదని, అయితే వారి సామర్థ్యాన్ని మరింత పెంచుతుందన్నారు. ఈ కార్యక్రమంలో యశోద ఆస్పత్రుల ఎండీ డాక్టర్ జీఎస్ రావు, డాక్టర్ పవన్ గోరుగంటి, డాక్టర్ చినబాబు సుంకవల్లితో పాటు దేశ విదేశాలకు చెందిన వైద్య నిపుణులు, పరిశోధకులు, సాంకేతిక రంగ ప్రతినిధులు, అధ్యాపకులు, వైద్య విద్యార్థులు, ఆరోగ్య రంగ ప్రముఖులు పాల్గొన్నారు.