Share News

Long Staying Employees in Health Department: వైద్యశాఖలో ముదురు బ్యాచ్‌పై దృష్టి

ABN , Publish Date - Jan 09 , 2026 | 04:48 AM

వైద్య ఆరోగ్య శాఖలో ఏళ్లుగా ఒకే స్థానంలో పాతుకుపోయిన ఉద్యోగులపై ప్రభుత్వం దృష్టి సారించింది. వారికి స్థానచలనాలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది.

Long Staying Employees in Health Department: వైద్యశాఖలో ముదురు బ్యాచ్‌పై దృష్టి

  • ఏళ్లుగా ఒకే స్థానంలో తిష్ట వేసిన ఉద్యోగులకు స్థానచలనాలు

  • విభాగాధిపతులకు ప్రభుత్వం అత్యవసర ఆదేశాలు

  • హెచ్‌వోడీ కార్యాలయంలో నాలుగేళ్ల సర్వీసు నిండిన వారితోపాటు డిప్యుటేషన్లపై ఉన్నవారి వివరాల సేకరణ

హైదరాబాద్‌, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): వైద్య ఆరోగ్య శాఖలో ఏళ్లుగా ఒకే స్థానంలో పాతుకుపోయిన ఉద్యోగులపై ప్రభుత్వం దృష్టి సారించింది. వారికి స్థానచలనాలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. వైద్య, ఆరోగ్య శాఖలోని కుటుంబ సంక్షేమ కమిషనరేట్‌, డీపీహెచ్‌, డీఎంఈ తదితర హెచ్‌ఓడీ కార్యాలయాల్లో కొందరు ఉద్యోగులు ఏళ్లుగా తిష్ట వేశారు. వీరితోపాటు యూనియన్ల లీడర్లమని చెప్పుకునే మరికొందరు కూడా ఆరోగ్య శాఖపై పట్టు పెంచుకున్నారు. బదిలీల సీజన్‌ వచ్చిందంటే చాలు.. మంత్రులు, ఎమ్మెల్యేల లేఖలు తెచ్చుకుని బదిలీలు జరగకుండా చూసుకుంటున్నారు. ఒకవేళ ఏ అధికారైనా గడువు పూర్తయింది, వేరే చోటుకు బదిలీ చేసుకోవాలని చెబితే... ‘మా వెనుక ఎవరున్నారో తెలుసా? బదిలీ చేస్తే ఊరుకోం’ అంటూ ఏకంగా హెచ్‌వోడీలనే బెదిరిస్తున్నారు. ఫైళ్లు కదలాలన్నా, కొత్తగా మంజూరు కావాలన్నా అన్నీ వీళ్ల కనుసన్నల్లోనే నడవాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటి ముదురు బ్యాచ్‌లకు చెక్‌ పెట్టడంపై ప్రభుత్వం దృష్టి సారించినట్టు తెలుస్తోంది. హెచ్‌వోడీ కార్యాలయాల్లో ఏళ్ల తరబడి కదలకుండా ఉంటున్న లాంగ్‌ స్టాండింగ్‌ ఉద్యోగులతోపాటు పైరవీలతో డిప్యుటేషన్లపై వచ్చి ఉండిపోయిన ఉద్యోగులను మాతృ శాఖలకు పంపాలని నిర్ణయించింది. ఇటీవలే వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి జారీ చేసిన అత్యవసర ఆదేశాలు ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి. దీంతో దీర్ఘకాలికంగా తిష్ట వేసిన ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది.

నాలుగేళ్లు నిండితే ప్యాకప్‌...

ప్రభుత్వం ఇటీవల పంపిన ప్రొఫార్మాలో హెచ్‌ఓడీ కార్యాలయాల్లో నాలుగేళ్లు నిండిందా? లేదా? అనే కాలమ్‌ పెట్టడం ఏళ్లుగా ఒకే స్థానంలో ఉన్నవారిలో కలకలం రేపుతోంది. నిబంధనల ప్రకారం మూడేళ్లు దాటితే బదిలీ చేయాలి. కానీ కొందరు పదేళ్లయినా కదలడం లేదు. ఇప్పుడు ప్రభుత్వం ప్రత్యేకంగా నాలుగేళ్ల కాలం అని పేర్కొనడంతో... ఆ గడువు నిండిన వారిని పక్కాగా బదిలీ చేస్తారని, అవసరమైతే లూప్‌లైన్‌ పోస్టులకు పంపుతారనే చర్చ సాగుతోంది. ఇక జిల్లాల్లో, ఏజెన్సీ ఏరియాల్లో పని చేయాల్సిన వారు హైదరాబాద్‌లోని హెడ్‌ ఆఫీసుల్లో డిప్యుటేషన్ల పేరిట ఉండిపోతున్నారు. ఈ నేపథ్యంలో డిప్యుటేషన్‌పై ఎంతమంది ఉన్నారు? అనే వివరాలను కూడా సేకరిస్తున్నారు. దీంతో డిప్యుటేషన్లను రద్దు చేసి ఎవరి ప్రదేశానికి వారిని పంపించే అవకాశముంది.

Updated Date - Jan 09 , 2026 | 04:48 AM