Share News

సర్కారు మెట్రో రైలు

ABN , Publish Date - Feb 26 , 2026 | 02:54 AM

ఆధునిక రవాణాకు ప్రతీకగా నిలిచిన హైదరాబాద్‌ మెట్రో రైలు పగ్గాలు ఇక ప్రభుత్వం చేతికి వెళ్లనున్నాయి. వచ్చే ఏప్రిల్‌ నుంచి మెట్రో ఆపరేషన్స్‌ను ప్రభుత్వమే స్వయంగా నిర్వహించనుంది.

సర్కారు మెట్రో రైలు

  • హైదరాబాద్‌ మెట్రో పగ్గాలు ప్రభుత్వం చేతికి

  • 15 వేల కోట్ల లావాదేవీ..ఏప్రిల్‌ నుంచి నిర్వహణ

  • దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ స్వాధీన ప్రక్రియలో ఒకటి

  • తక్కువ వడ్డీకి లభించేలా అప్పుల పునర్‌వ్యవస్థీకరణ

హైదరాబాద్‌, ఫిబ్రవరి 25 (ఆంధ్ర జ్యోతి): ఆధునిక రవాణాకు ప్రతీకగా నిలిచిన హైదరాబాద్‌ మెట్రో రైలు పగ్గాలు ఇక ప్రభుత్వం చేతికి వెళ్లనున్నాయి. వచ్చే ఏప్రిల్‌ నుంచి మెట్రో ఆపరేషన్స్‌ను ప్రభుత్వమే స్వయంగా నిర్వహించనుంది. ఇందుకోసం ముందుగా.. మెట్రోలో ప్రైవేటు భాగస్వామిగా ఉన్న ఎల్‌అండ్‌టీ సంస్థ నుంచి తొలి దశ ప్రాజెక్టును ప్రభుత్వం కొనుగోలు చేసి, మెట్రోపై ఇప్పటికే ఉన్న అప్పుల పునర్‌వ్యవస్థీకరణ, ఆస్తులు, విధుల పంపిణీ చేపట్టనుంది. దీనికి సంబంధించి కీలక చర్చలు జరుగుతున్నాయి. తొలిదశ మెట్రో మూడు కారిడార్ల పరిధిలో 69 కిలోమీటర్ల మేటర్ల నడుస్తుండగా.. దీనిని రూ.15 వేల కోట్లతో ప్రభుత్వం స్వాధీనం చేసుకోనుంది. ఇందులో రూ.13 వేల కోట్ల అప్పులు, రూ.2 వేల కోట్ల ఈక్విటీ భాగస్వామ్యం ఉంది. ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో మెట్రో కొనుగోలుకు ఆమోదం లభించడంతో తదుపరి చర్యలకు సర్కారు సన్నద్ధమవుతోంది. అయితే ఈ క్రమంలో మెట్రోపై ఉన్న అప్పులే ప్రభుత్వానికి అతిపెద్ద సవాలు కానున్నాయి. ప్రస్తుతం ఉన్న అప్పులకు వడ్డీ రేటు అధికంగా ఉంది. ఇది సర్కారుకు అదనపు భారం కానుండడంతో.. దీనిని తగ్గించుకునేందుకు రుణాల పునర్‌వ్యవస్థీకరణకు సిద్ధమవుతోంది. సుమారు 20 ఏళ్ల కాలపరిమితితో తక్కువ వడ్డీ రేట్లకు రుణాలు సేకరించేందుకు ఆర్థిక సంస్థలతో అధికారులు చర్చలు జరుపుతున్నారు. ఇందులో భాగంగా ఇండియన్‌ రైల్వే ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (ఐఆర్‌ఎ్‌ఫసీ)తోనూ సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. ఈ సంస్థ ఇచ్చే రుణాలకు 8 శాతం వడ్డీ ఉంటుంది. దీంతోపాటు ఇంతకంటే తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చే అవకాశాలపైనా అధ్యయనం చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కేవలం ఆర్థికపరమైన సవరణ మాత్రమే కాదని, మెట్రో ప్రాజెక్టు భవిష్యత్తును నిర్దేశించే చర్య అని అధికారులు భావిస్తున్నారు.


అప్పుల భారం తగ్గించుకొని..

తొలిదశ మెట్రో నిర్మాణ పనులను పబ్లిక్‌-ప్రైవేట్‌ భాగస్వామ్యంతో చేపట్టారు. ప్రాజెక్టు వ్యయం రూ.15 వేల కోట్లు కాగా,అందులో సుమారు రూ.13 వేల కోట్లు రుణాలు సేకరించారు. వీటికి వడ్డీరేటు 8 శాతం ఉండటంతో.. ఏటా వందల కోట్లు వడ్డీలకే సరిపోతున్నాయనే వాదనలున్నాయి. కొవిడ్‌ సమయంలో ప్రయాణికుల నుంచి ఆదాయం తగ్గినా.. అప్పుల భారం మాత్రం తగ్గలేదు. దీంతో రుణాలు చెల్లించడం నిర్వహణ సంస్థకు భారంగా మారింది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మెట్రో నిర్వహణ నుంచి ప్రైవేటు సంస్థ తప్పుకోవడంతో.. ప్రభుత్వమే బాధ్యత తీసుకునేందుకు ముందుకొచ్చింది. అప్పులను పునర్‌ వ్యవస్థీకరించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 8 శాతం వడ్డీని 6 నుంచి 6.5 శాతం వరకు తగ్గించే ప్రయత్నం, రీ ఫైనాన్సింగ్‌ ద్వారా ఎక్కువ వడ్డీ ఉన్న రుణాలను తక్కువ వడ్డీతో తీసుకున్న రుణాల ద్వారా చెల్లించడం, బకాయిల కాలపరిమితిని 20 ఏళ్ల నుంచి 25-30 ఏళ్లకు పెంచడం వంటి చర్యల ద్వారా వార్షిక రుణ చెల్లింపుల భారాన్ని కొంత మేర తగ్గించుకునేందుకు కసరత్తు చేస్తోందని అధికారులు చెబుతున్నారు. పైగా, ప్రభుత్వమే అప్పుల చెల్లింపునకు నేరుగా బాధ్యత వహిస్తున్నందున తక్కువ వడ్డీ రేటుకు రుణాలు పొందే అవకాశం ఉందని అంటున్నారు. వడ్డీ భారాన్ని తగ్గించుకుంటే ఆర్థికంగా మెట్రో నిలదొక్కుకునే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ప్రయాణికుల చార్జీలతోపాటు వాణిజ్య ప్రకటనలు, స్థలాల అద్దెలు, మెట్రో పరిధిలో ఉన్న 260 ఎకరాల భూముల లీజు, వేలం పాట ద్వారా ఎక్కువ మొత్తం నిధులు సమీకరించుకునే అవకాశం ఉందంటున్నారు.

కీలక దశలో మెట్రో ఫేజ్‌-2..

మెట్రో విస్తరణకు సంబంధించి రెండో దశ ప్రణాళిక కీలక దశలో ఉంది. మొత్తం 5 కారిడార్లతో సుమారు 76 కిలోమీటర్ల మేర మెట్రో సేవలు విస్తరించాలని ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇందుకోసం సుమారు రూ.24 వేల కోట్ల ఖర్చు అవుతుందని అంచనా వేసింది. దీంతోపాటు అదనంగా మరో 86 కిలోమీటర్ల మెట్రో విస్తరణ ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. రెండో దశ పనులకు కేంద్ర ప్రభుత్వ సహకారం కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరగా.. నిర్వహణ మొత్తం ఒకే సంస్థ ఆధ్వర్యంలో ఉండాలనే నిబంధన పెట్టింది. దీంతో తొలి దశ మెట్రో ప్రాజెక్టును ప్రభుత్వం స్వాధీనం చేసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. కేంద్రం సహకరిస్తే రెండో దశ మెట్రో పనులు వేగంగా పూర్తయ్యే అవకాశం ఉంటుందని అధికారుల సమాచారం.


మెట్రో మాల్స్‌పై ప్రత్యేక సమీక్ష

తొలి దశ మెట్రో ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ప్రాజెక్టుకు బదిలీ అయిన భూములపైనా కీలక చర్చ జరుగుతోంది. ఒప్పందం ప్రకారం కేటాయించిన భూముల్లో కొంత మెట్రో ట్రాక్‌లకు, ట్రాన్సిట్‌ ఓరియంటెడ్‌ డెవల్‌పమెంట్‌(టీవోడీ) ప్రాజెక్టులకు, మాల్స్‌ అభివృద్ధికి కేటాయించారు. ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న తరువాత వినియోగంలో లేని భూములు ప్రభుత్వానికి వచ్చినా.. ఇప్పటికే మాల్స్‌ నిర్మాణం చేసిన భూములు, ఇతర ప్రైవేటు ఏజెన్సీల చేతిలో ఉన్న భూములపై ప్రభుత్వం సమీక్షించే అవకాశం ఉంది. వాణిజ్య ఆస్తులపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే చర్చ జరుగుతోంది.

నిర్వహణలో అంతరాయం రాకుండా..

ప్రస్తుతం మెట్రో నిర్వహణ నిక్కచ్చిగా జరుగుతోంది. 99ు సమయపాలన పాటిస్తోంది. రోజూ లక్షలాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తోంది. దీనిని స్వాధీనం చేసుకున్న తరువాత కూడా సేవలకు అంతరాయం లేకుండా అనుభవజ్ఞులైన సాంకేతిక నిపుణులను కొనసాగించాలనే దిశగానే ప్రభుత్వం ఆలోచన చేస్తుందని అధికారులు చెబుతున్నారు. ఆపరేషన్లు, నిర్వహణలో నైపుణ్యం ఉన్న సంస్థతో మరో ఏడాదిపాటు ఒప్పందం కొనసాగించే అవకాశం ఉందని అధికార వర్గాల సమాచారం. ఆటోమేటెడ్‌ ట్రైన్‌ కంట్రోల్‌, కమ్యూనికేషన్‌ ఆధారిత వ్యవస్థల నిర్వహణకు ప్రభుత్వం వద్ద సాంకేతిక నిపుణులు లేనందున.. ఇప్పుడు ఉన్న బృందాలనే కొనసాగించనున్నట్లు తెలిసింది. పీపీపీ పద్ధతిలో నిర్మితమైన మెట్రోను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే దేశంలోనే అతిపెద్ద లావాదేవీల్లో ఒకటిగా ఇది నిలుస్తుందని అధికారులు చెబుతున్నారు. ఆర్థిక సవాళ్లను సమర్థంగా ఎదుర్కొని, విస్తరణ ప్రణాళికలను వేగవంతంగా పూర్తి చేస్తే.. మెట్రో రవాణా రంగంలో దేశానికే తెలంగాణ మార్గదర్శకంగా నిలిచే అవకాశం లేకపోలేదని అంటున్నారు.

Updated Date - Feb 26 , 2026 | 02:54 AM