అనాథ యువతకు ఉజ్వల భవిత
ABN , Publish Date - Feb 24 , 2026 | 05:16 AM
అనాథ పిల్లలకు కేవలం ఆశ్రయం కల్పించడమే కాకుండా వారికి ఉజ్వల భవిష్యత్తును అందించే లక్ష్యంతో రాష్ట్రప్రభుత్వం కీలక ముందడుగువేసింది.
జీఎంఆర్, ఫిక్కీ, ప్రేమ్‌జీ వర్సిటీలతో ప్రభుత్వం ఒప్పందం
విమానయాన రంగంలో శిక్షణ ఇవ్వనున్న జీఎంఆర్ అకాడమీ
హైదరాబాద్, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): అనాథ పిల్లలకు కేవలం ఆశ్రయం కల్పించడమే కాకుండా వారికి ఉజ్వల భవిష్యత్తును అందించే లక్ష్యంతో రాష్ట్రప్రభుత్వం కీలక ముందడుగువేసింది. సచివాలయంలో సోమవారం మంత్రి సీతక్క సమక్షంలో జీఎంఆర్ ఏరో అకాడమీ, ఫిక్కీ, అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీలతో ప్రభుత్వం పలు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. ప్రభుత్వ సంరక్షణలో ఉన్న అనాథ యువతకు విమానయాన రంగంలో నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు జీఎంఆర్ ఏరో అకాడమీ ముందుకొచ్చింది. మార్చి నుంచి శంషాబాద్‌లో ప్రారంభమయ్యే ఈ శిక్షణలో ఎయిర్‌పోర్ట్ ఆపరేషన్స్, గ్రౌండ్ హ్యాండ్లింగ్ వంటి కోర్సులను బోధించి అంతర్జాతీయస్థాయిలో ఉద్యోగాలకు వారిని సిద్థం చేస్తారు. మొదటి విడతలో 20 మందికి అవకాశం కల్పిస్తారు. పాలిటెక్నిక్ చదువుతున్న అనాథ బాలికలకు ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), సాఫ్ట్ స్కిల్స్, ఇంటర్వ్యూ స్కిల్స్‌లో శిక్షణ ఇస్తారు. క్లాస్ రూమ్ టూ కార్పొరేట్ జాబ్ లక్ష్యంగా 300 మందికి ఈ శిక్షణ అందుతుంది. అంగన్‌వాడీ టీచర్ల నైపుణ్యాన్ని పెంచేందుకు అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీ ద్వారా 6 నెలల ఫ్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కోర్సును ప్రవేశపెట్టారు. ఆన్‌లైన్, ప్రత్యక్ష శిక్షణ తర్వాత టీచర్లకు సర్టిఫికేషన్ అందజేస్తారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ.. అనాథ పిల్లలు స్వశక్తితో ఎదిగేలా తీర్చిదిద్దడం ప్రభుత్వ లక్ష్యమన్నారు. అంగన్‌వాడీలను బలోపేతం చేయడంతో పాటు మూడేళ్లలోపు చిన్నారుల కోసం త్వరలో క్రష్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.