kumaram bheem asifabad-ప్రభుత్వ బడి..అవకాశాల ఒడి
ABN , Publish Date - Jun 14 , 2026 | 10:40 PM
విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంటే చాలు ప్రైవేటు పాఠశాలలు విద్యార్థుల సంఖ్యను పెంచుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తాయి. గ్రామాల్లో కరపత్రాల పంపిణీ, ఫ్లెక్సీల ఏర్పాటు, ఇంటింటికి పాఠశాలల సిబ్బంది వెళ్లి ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుత రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలు సైతం అప్‌డేట్ అయ్యాయి. బడిబాట కార్యక్రమంతో విద్యార్థుల ఇళ్లకు వెళ్లి ప్రైవేటుకు దీటుగా ప్రచారాలు చేస్తున్నారు. ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు, అనుభ వజ్ఞులైన ఉపాధ్యాయులచే విద్యా, పదవతరగతిలో ఫలితాలను వివరిస్తూప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చేరేలా ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతున్నారు.
- ఇంగ్లీష్ మీడియం విద్య, మెరుగైన సౌకర్యాలు
- బడిబాట కార్యక్రమంతో గ్రామాల్లో ఉపాధ్యాయుల ప్రచారం
వాంకిడి, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంటే చాలు ప్రైవేటు పాఠశాలలు విద్యార్థుల సంఖ్యను పెంచుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తాయి. గ్రామాల్లో కరపత్రాల పంపిణీ, ఫ్లెక్సీల ఏర్పాటు, ఇంటింటికి పాఠశాలల సిబ్బంది వెళ్లి ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుత రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలు సైతం అప్‌డేట్ అయ్యాయి. బడిబాట కార్యక్రమంతో విద్యార్థుల ఇళ్లకు వెళ్లి ప్రైవేటుకు దీటుగా ప్రచారాలు చేస్తున్నారు. ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు, అనుభ వజ్ఞులైన ఉపాధ్యాయులచే విద్యా, పదవతరగతిలో ఫలితాలను వివరిస్తూప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చేరేలా ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతున్నారు. ప్రచారానికి సామాజిక మాద్యమాలను సైతం ఉపయోగించుకుంటున్నారు. మొత్తంగా ప్రైవేటుకు ధీటుగా విద్యార్థుల సంఖ్య పెంచడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. సోమవారం నుంచి పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది గతేడది కంటే మరింత విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
- పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు..
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పదో తరగతిలో గతంలో కంటే మెరుగైన ఫలితాలు సాధిం చారు. విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ద, చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించడంతో ఉత్తమ ఫలితాలు సాధించారు. బట్టీ చదువులు కాకుండా అనుభమజ్ఞులైన ఉపాధ్యాయుల సమక్షంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా పాఠాలు బోధించడంతో ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో మొత్తం 833 ప్రాథమిక పాఠశాలలు, 106 ప్రాథమికోన్నత పాఠశాలలు, 103 ఉన్నత పాఠశాలలు, దాదాపు 62,315 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ బోధన, బాలబాలికలకు వేర్వేరుగా మరుగుదొడ్లు, సైన్స్ ఫెయిర్స్ నిర్వహణ, క్రీడల పట్ల ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు ఉచిత విద్య, నాణ్యమైన మధ్యాహ్న బోజనం, ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్కులు, యూనిఫాంల పంపిణీ, విహార యాత్రలకు, క్షేత్ర పర్యటనలకు తీసుకెళ్లడంతో పాటు ఉపకారవేతనాల అందజేత, ప్రతిభ పరీక్షల ఏర్పాటు, సైన్స్, మ్యాథ్స్ ల్యాబ్‌లు, ఎన్‌సీసీ, ఆడ పిల్లలకు హెల్త్ కిట్స్ ఇస్తున్నారు.
- పెరిగిన అసక్తి..
ప్రస్తుత పరిస్థితుల్లో చాలామంది తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రైవేటుకు కాకుండా ప్రభుత్వ బడులు, ప్రభుత్వ గురుకులాల్లో చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్న పరిస్థితి. గతంలో ఇంగ్లీష్ మీడియం చదువులు కేవలం ప్రైవేటులోనే ఉంటాయని రూ. వేల ఫీజులు కట్టి పిల్లలను తల్లిదండ్రులు ప్రైవేటుకు పంపించేవారు. కానీ నేటి రోజుల్లో ప్రభుత్వ పాఠశాల్లో సైతం ఇంగ్లీష్ మీడియం చదువు అనుభవం ఉన్న ఉపాధ్యాయులు బోధించడం, ప్రభుత్వ పాఠశాలల్లో, గురుకులాల్లో మెరుగైన వసతులు కల్పించడంతో విద్యార్థులు, మొగ్గు చూపుతున్నారు.
విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది..
- శివచరన్‌కుమార్- ఎంఈవో వాంకిడి
సర్కార్ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో విద్యార్థులకు అర్థమయ్యే పద్ధతిలో బోధనతో పాటు ఉచిత విద్య, నాణ్యమైన భోజనం, ఉచిత పాఠ్యపుస్తకాలు, షూ, దుస్తులు ప్రభుత్వం అందిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్చేందుకు బడిబాట కార్యక్రమంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సౌకర్యాలను విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు వివరిస్తున్నాం. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారు.