వ్యవసాయ పంపుసెట్లు సోలార్‌వే ఉండాలి
ABN , Publish Date - Jan 22 , 2026 | 05:02 AM
వ్యవసాయ ఫీడర్లన్నీ కూడా సోలార్‌వి ఏర్పాటు చేయాలని, ఆ తర్వాత బ్యాటరీ స్టోరేజీ విధానం అనుసరించాలని కేంద్ర విద్యుత్ శాఖ పేర్కొంది.
ఉచిత విద్యుత్ కింద ఉన్న వ్యవసాయ కనెక్షన్లను సౌరశక్తి ఆధారితంగా మార్చాలి.. ఫీడర్లు కూడా సోలార్‌వే
బ్యాటరీ స్టోరేజీ విధానం అమలుచేయాలి
ఉచిత విద్యుత్ రద్దు లేదా ఖాతాలో ముందే సబ్సిడీ జమ
విద్యుత్ కొనుగోలు అదనపు వ్యయం ఏ నెలకు ఆ నెలే వసూలు
జాతీయ విద్యుత్ విధానం ముసాయిదా విడుదల
హైదరాబాద్, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయ ఫీడర్లన్నీ కూడా సోలార్‌వి ఏర్పాటు చేయాలని, ఆ తర్వాత బ్యాటరీ స్టోరేజీ విధానం అనుసరించాలని కేంద్ర విద్యుత్ శాఖ పేర్కొంది. ఉచిత విద్యుత్ అందుతున్న వ్యవసాయ పంపుసెట్లను కూడా సోలార్ ఆధారితంగా మార్చాలని సూచించింది. ఈ మేరకు జాతీయ విద్యుత్ విధానం-2026 ముసాయిదాను విడుదల చేసింది. దీనిపై 30 రోజుల్లో సూచనలు/సలహాలను వర్డ్ రూపంలో టట1ఝౌఞఃజౌఠి.జీుఽ కు పంపించాలని పేర్కొంది. పాలసీలోని కొన్ని కీలకాంశాలు ఇలా ఉన్నాయి.. ఉచిత విద్యుత్‌ను వెనక్కి తీసుకోవాలి. ఒకవేళ ఇవ్వదలుచుకుంటే సెక్షన్-65 ప్రకారం ముందస్తు సబ్సిడీని ఖాతాల్లో జమ చేయాలి. విద్యుత్ కొనుగోలుకు ఏ నెలలో అయ్యే అధిక వ్యయాన్ని అదే నెలలో వినియోగదారుల నుంచి రాబట్టుకోవాలి. ఒకే ప్రాంతంలో ఒకటి కన్నా ఎక్కువ డిస్కమ్‌లను ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలి. 2026-27 కల్లా విద్యుత్ సరఫరాకు పూర్తి వ్యయాన్ని వినియోగదారుల నుంచి వసూలు చేసుకునేలా విద్యుత్ నియంత్రణ మండళ్లు ఉత్తర్వులు ఇవ్వాలి. విద్యుత్ బిల్లులు, వినియోగం సమాచారం వినియోగదారులకు మొబైల్ ఫోన్లకు పంపించాలి. ఒక మెగావాట్ అంతకంటే ఎక్కువ విద్యుత్ వినియోగించే వినియోగదారులు నేరుగా ఓపెన్ యాక్సెస్ పొందే అవకాశం ఇవ్వాలి. వీరిపై క్రాస్ సబ్సిడీ, అదనపు సర్ చార్జిలు క్రమంగా తగ్గించాలి. కొత్తగా అనుమతినిచ్చే థర్మల్ కేంద్రాలు విధిగా బొగ్గు బ్లాకుల ఉదర భాగం (పిట్‌హెడ్)లో పెట్టాలి.