HAM Roads: హ్యామ్ రోడ్లకు మూడు మార్గాల్లో నిధులు
ABN , Publish Date - Jan 03 , 2026 | 03:04 AM
హైబ్రిడ్ యాన్యూనిటీ మోడ్(హ్యామ్)లో రోడ్లను అభివృద్ధి చేసేందుకు అవసరమయ్యే నిధులను తిరిగి చెల్లించే విషయమై పూర్తి స్థాయి స్పష్టత ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది..
కార్యాచరణ సిద్ధం చేస్తున్న ప్రభుత్వం
పనుల కోసం త్వరలో మళ్లీ టెండర్లు
హైదరాబాద్, జనవరి 2(ఆంధ్రజ్యోతి): హైబ్రిడ్ యాన్యూనిటీ మోడ్(హ్యామ్)లో రోడ్లను అభివృద్ధి చేసేందుకు అవసరమయ్యే నిధులను తిరిగి చెల్లించే విషయమై పూర్తి స్థాయి స్పష్టత ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. హ్యామ్ విధానంలో పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు 3 మార్గాల్లో బిల్లులు చెల్లించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇదే విషయాన్ని ఆర్‌ఆండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసెంబ్లీలోనూ వివరించారు. హ్యామ్ రోడ్ల పనులు చేపట్టే కాంట్రాక్టర్లకు పీఎం-ఈబస్ స్కీమ్ మాదిరిగా మూడు మార్గాల్లో చెల్లింపులు చేసే వ్యవస్థను అధికారులు రూపొందించారు. వీటిలో మొదటిది సాధారణ విధానం. ఇందులో ఒప్పందం ప్రకారం పనులు పూర్తయ్యాక ట్రెజరీ ద్వారా బిల్లులను ఎస్ర్కూ అకౌంట్‌కు జమ చేసి చెల్లింపులు చేస్తారు. ఇందుకు అవసరమైన నిధులను ఆర్థిక శాఖ కేటాయిస్తుంది. రెండో విధానం పేమెంట్ సెక్యూరిటీ ఫండ్(పీఎ్‌సఎఫ్). చెల్లింపుల్లో ఆలస్యం జరిగినప్పుడు దీనిని ఉపయోగిస్తారు. ఆ సమయంలో లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్‌ఓసీ)/ముందుగా పేమెంట్ సెక్యూరిటీ ఫండ్‌లో ఉంచిన నిధుల నుంచి ఎస్ర్కూ అకౌంట్‌కు నిధులను జమ చేసి చెల్లింపులు చేస్తారు. మూడోది.. ఆర్‌బీఐ ద్వారా డెడికేటెడ్ డెబిట్ మెకానిజం(డీడీఎం). ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్‌బీఐకి స్టాండింగ్ మాండేట్ ఇవ్వనుంది. ఫలితంగా హ్యామ్ బిల్లుల చెల్లింపులకు ఇబ్బంది ఉండదని, పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు సైతం ముందుకు వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. బిల్లుల చెల్లింపు వ్యవహారం కొలిక్కి రావడంతో హ్యామ్ పనుల కోసం మరోసారి టెండర్లను పిలవనున్నట్టు తెలిసింది.