Share News

1 నుంచి ఎల్‌ఆర్‌ఎస్‌పై 25 శాతం రాయితీ

ABN , Publish Date - Apr 30 , 2026 | 05:13 AM

అనుమతి లేని లేఅవుట్ల క్రమబద్ధీకరణను ప్రొత్సహించేందుకు ప్రభుత్వం మరోసారి ఎల్‌ఆర్‌ఎస్‌ రాయితీ ఇస్తూ ఉత్తర్వులు జారీచేసింది

1 నుంచి ఎల్‌ఆర్‌ఎస్‌పై 25 శాతం రాయితీ

  • జూలై 31 వరకు మూడు నెలలు కొనసాగింపు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 29 (ఆంధ్ర జ్యోతి): అనుమతి లేని లేఅవుట్ల క్రమబద్ధీకరణను ప్రొత్సహించేందుకు ప్రభుత్వం మరోసారి ఎల్‌ఆర్‌ఎస్‌ రాయితీ ఇస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజు చెల్లింపులపై 25 శాతం రాయితీని మే 1 నుంచి అమలు చేస్తూ బుధవారం జీవో 131 విడుదల చేసింది. ఈ రాయితీ అవకాశం జూలై 31 వరకు మూడు నెలలపాటు ఉంటుందని పేర్కొంది. దీనివల్ల పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు వేగంగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. అన్ని మున్సిపాలిటీలు, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, పంచాయతీరాజ్‌ శాఖలు ఈ ఉత్తర్వులను అమలు చేయాలని ఆదేశించింది. గత ఏడాది ఫిబ్రవరి 20న ఎల్‌ఆర్‌ఎస్‌ రాయితీ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం 26 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. జలాశయాలు, ప్రభుత్వ భూముల్లో ఉన్న వెంచర్లకు సంబంధించి సుమారు 6 లక్షల దరఖాస్తులను మినహాయించి.. 20 లక్షల దరఖాస్తుదారులకు ఫీజు చెల్లించాలని నోటీసులు పంపింది. అయితే, నాలుగు నెలల పాటు అవకాశం ఇచ్చినా 6 లక్షల మందే ఫీజు చెల్లించారు. గతంలో ఫీజు చెల్లించిన వారిలో 70 శాతం మందికి ప్రొసీడింగ్స్‌ ఇచ్చారు. ఇంకా మిగిలిపోయిన 14 లక్షల మంది దరఖాస్తుదారులు ఫీజు రాయితీ కావాలని కోరడంతో, ప్రభుత్వం రెండోసారి ఫీజు మినహాయింపు ఉత్తర్వులు ఇచ్చింది.

Updated Date - Apr 30 , 2026 | 05:13 AM