రూ.30 కోట్ల ప్రభుత్వ భూమి స్వాధీనం
ABN , Publish Date - May 08 , 2026 | 01:11 AM
యాభై ఏళ్ల క్రితం సాగు కోసం తాత్కాలికంగా అనుమతులు తీసుకొని దానిని ఆసరా జేసుకున్న వారసులు అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయించుకుని మరి కొందరికి విక్రయించిన భూవివాదం బయటపడింది. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 72 ఎకరాల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం
\(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
యాభై ఏళ్ల క్రితం సాగు కోసం తాత్కాలికంగా అనుమతులు తీసుకొని దానిని ఆసరా జేసుకున్న వారసులు అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయించుకుని మరి కొందరికి విక్రయించిన భూవివాదం బయటపడింది. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 72 ఎకరాల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కావడం గమనార్హం. ఆ భూమిని గురువారం రెవెన్యూ అధికారులు చదును చేయించి స్వాధీనం చేసుకుని బోర్డులు ఏర్పాటు చేశారు. దీని విలువ బహిరంగ మార్కెట్లో సుమారు 30 కోట్ల రూపాయల పైచిలుకు ఉంటుందని అంచనా. వివరాలు ఇలా ఉన్నాయి.
ధర్మారం మండలంలోని బొమ్మరెడ్డిపల్లి గ్రామ శివారులో సర్వే నెంబర్ 679 లో 670.22ఎకరాల భూమి ఉంది. ఇందులో 72.03 ఎకరాల ప్రభుత్వ భూమి అన్యా క్రాంతం అయినట్లుగా, దీనిపై సమగ్ర విచారణ జరి పించాలని గతేడాది మే 16వ తేదీన రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ జగిత్యాలలో జరిగిన ఒక సమావేశంలో అక్కడికి వచ్చిన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆ వెంటనే మంత్రి విచారణకు ఆదే శించారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లి ఆర్డీవోకు విచారణకు ఆదేశించారు. దీంతో ఆయన పూర్తిస్థాయిలో విచారణ జరిపి కలెక్టర్‌కు నివేదిక సమర్పించారు. ఈ నివేదిక ప్రకారం బొమ్మరెడ్డిపల్లిలో నీరడిగా పనిచేస్తున్న దేవి పెద్ద లచ్చిగ అలియాస్ లచ్చయ్యకు నంబర్ డీవో 10/ఆఫ్ 1347 ప్రకారం బొమ్మరెడ్డిపల్లి గ్రామ రెవెన్యూ శివారులోని 72.03 ఎకరాల భూమిని తాత్కాలిక సాగు కోసం అనుమతులు ఇచ్చారు. కానీ అసైన్మెంట్ చేయ లేదు. ఈ భూమి రాళ్లు రప్పలతో కూడుకున్నది కావ డం, సాగుకు యోగ్యంగా కూడా లేదు. ఈ భూమి క్రమంగా అతని వారసులు అక్రమంగా రెవెన్యూ రికా ర్డుల్లో పేర్లు నమోదు చేయించుకున్నట్లు గుర్తించారు. అదే విధంగా ఆ భూములను 11 మందికి రిజిస్ట్రేషన్లు, పట్టా మార్పిడులు చేసినట్లు విచారణలో బయట పడింది. సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేసి విచారణ నిర్వహించిన అనంతరం వారి పట్టాదారు హక్కులు చెల్లవని నిర్ధారిస్తూ కార్యావర్తనములు నెం. ఈ3/434/2026, గత నెల 27వ తేదీన సమాచారం అందజేసి, 72.03 ఎకరాల భూమిని ప్రభుత్వ ఖాతాకు బదిలీ చేసినట్లు కలెక్టర్ కోయ శ్రీహర్ష ఒక ప్రకటనలో తెలిపారు. భూమిని ధర్మారం తహసీల్దార్ ఆధ్వర్యంలో గురువారం స్వాధీనం చేసుకుని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వ భూమి ఆక్రమణ చట్టరీత్యా శిక్షార్హమని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ భూమి విషయంలో చట్టవిరుద్ధంగా రిజిస్ట్రేషన్ చేస్తూ పట్టాలు మార్పిడి చేస్తూ లావాదేవీలు జరుగుతున్నట్టుగా కొంతకాలంగా కొందరు అధికారు లకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయం ధర్మపురి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ దృష్టికి వెళ్లడంతో పైన సంబంధిత మంత్రికి ఫిర్యాదు చేయడంతో అక్రమ బాగోతం బయటపడింది. ఈ భూమి ధర్మారం నుంచి కరీంనగర్ వెళ్లే ప్రధాన రహదారికి ఆనుకొని ఉంది. ఇళ్ల స్థలాల కోసం ఈ భూమిని విక్రయించేందుకు అవకా శంగా ఉంది. అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూమి తిరిగి ప్రభుత్వ స్వాధీనంలోకి వచ్చేందుకు కృషి చేసిన మంత్రి లక్ష్మణ్ కుమార్, కలెక్టర్ కోయ శ్రీహర్ష, రెవెన్యూ అధి కారులకు మండల వాసులు కృతజ్ఞతలు తెలిపారు.
ఆక్రమించిన భూములను స్వచ్ఛందంగా తిరిగి ఇవ్వాలి
కలెక్టర్ కోయ శ్రీహర్ష
జిల్లాలో ఎవరైనా ప్రభుత్వ భూములను అక్రమంగా ఆక్రమింనా, అక్రమ రిజిస్ట్రేషన్లు లేదా పట్టా మార్పిడులు చేసుకున్నా, ఫోర్జరీ పత్రాలతో ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకున్నా స్వచ్ఛందంగా తహసీల్దార్ల ద్వారా ప్రభుత్వానికి అప్పగించాలని కలెక్టర్ సూచించారు. లేనిపక్షంలో గుర్తించిన వెంటనే అక్రమ పట్టాలను రద్దు చేసి భూములను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవడంతో పాటు సంబంధిత వ్యక్తులపై క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.