ఈవీల కొనుగోలుపై ప్రభుత్వ ఉద్యోగులకు రాయితీ
ABN , Publish Date - Mar 25 , 2026 | 04:27 AM
ఈవీ(ఎలక్ట్రిక్ వెహికల్) వాహనాల కొనుగోలుపై తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక రాయితీ లభిస్తుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు...
10-20 శాతం డిస్కౌంట్ ఇచ్చేందుకు ముందుకొచ్చిన సంస్థలు
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
ఎలక్ట్రిక్ వాహనం కొనుగోలు చేసిన సీఎస్ రామకృష్ణారావు
హైదరాబాద్, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): ఈవీ(ఎలక్ట్రిక్ వెహికల్) వాహనాల కొనుగోలుపై తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక రాయితీ లభిస్తుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులకు 10-20 శాతం రాయితీ ఇచ్చేందుకు మహేంద్ర ఎలెక్ర్టిక్స్, ఆథర్ ఎనర్జీ, గ్రావిటన్ మోటార్స్, ఓలాతో పాటు పలు కంపెనీలు ముందుకు వస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు సచివాలయంలో ఆవరణలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో వివిధ సంస్థల ఈవీలను సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ శివధర్‌రెడ్డి, రవాణాశాఖ కమిషనర్ ఇలంబర్తి, సమాచార శాఖ కమిషనర్ ప్రియాంక తదితరులతో కలిసి మంత్రి పొన్నం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. ఈవీల కొనుగోలుపై ప్రభుత్వ ఉద్యోగులకు ప్రోత్సాహం ఇవ్వాలని ఇటీవల నిర్వహించిన రవాణా శాఖ సమీక్షా సమావేశంలో వాహన తయారీదారులను కోరినట్లు తెలిపారు. కంపెనీదారులు ప్రభుత్వ ఉద్యోగులకు 10-20 శాతం డిస్కౌంట్ ఇస్తారని చెప్పారు. హైదరాబాద్ నగరం ఢిల్లీ తరహాలో కాలుష్య కోరల్లో చిక్కుకోకూడదనే ఈవీలను ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. రెడ్కో ద్వారా ఈవీ ఛార్జింగ్ స్టషన్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రజాప్రతినిధులు ఈవీ వాహనాలకు లోన్ తీసుకునేలా చేయాలని ఆర్థికశాఖ మంత్రిని కోరామన్నారు. 15 సంవత్సరాలు దాటిన వాహనాలను స్ర్కాపేజీకి పంపిస్తున్నామని, రవాణాశాఖలో అనేక సంస్కరణలు తీసుకొస్తున్నామని చెప్పారు. ‘వాహన్’ పోర్టల్‌లో తెలంగాణ చేరిందని, వాహనం కొనుగోలు చేసినప్పుడు షోరూమ్ లోనే రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించినట్టు చెప్పారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఈ సందర్భంగా ఓ ఈవీని కొనుగోలు చేశారు. దీంతో ఆయనను మంత్రి అభినందించారు. అనంతరం సీఎస్ మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని కాలుష్య రహితంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతోనే ఈవీ పాలసీ తీసుకొచ్చినట్టు వెల్లడించారు.