Minister Ponnam Prabhakar: ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలులోప్రభుత్వ ఉద్యోగులకు 20 శాతంరాయితీ
ABN , Publish Date - Jan 07 , 2026 | 04:18 AM
రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసే ప్రభుత్వ ఉద్యోగులకు ధరలో 20 శాతం రాయితీ ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
ఈవీ కంపెనీలతో సంప్రదింపులు జరుపుతున్నాం .. ఎమ్మెల్యేలు విధిగా ఎలక్ట్రిక్ వాహనాలు వాడాలి
ఔటర్ లోపల అన్నీ ఈవీ బస్సులే
బస్టాండ్లు, కలెక్టరేట్లలో చార్జింగ్ కేంద్రాలు
15 ఏళ్లు దాటిన బస్సులు స్ర్కాప్‌కే
ఆర్టీసీ కార్మికులకు కోటి బీమా అమలు
సభలో మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి
హైదరాబాద్, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసే ప్రభుత్వ ఉద్యోగులకు ధరలో 20 శాతం రాయితీ ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇందుకోసం ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీలతో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. హైదరాబాద్‌లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఏక్యూఐ) పెరుగుతోందని, దీనిని తగ్గించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇందుకోసం ఔటర్ రింగు రోడ్డు లోపల అన్నీ ఈవీ బస్సులే నడపాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. ఆర్టీసీ బస్టాండ్లతోపాటు పలు చోట్ల ఈవీ చార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. శాసనసభలో ఎలక్ట్రిక్ వాహనాలు, వాయు కాలుష్యంపై అడిగిన ప్రశ్నలకు మంత్రి పొన్నం సమాధానమిచ్చారు. జీవో నెం.41తో ఈవీ పాలసీ తెచ్చామని, దీనివల్ల లక్ష వాహనాలు వినియోగంలోకి వచ్చాయని వెల్లడించారు. ఈవీ పాలసీతో రూ.900 కోట్ల మేర ప్రభుత్వం ఆదాయం కోల్పోయినప్పటికీ పర్యావరణ పరిరక్ష ణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఢిల్లీని చూసిన తర్వాత కాలుష్యం తగ్గింపు కోసం చర్యలు తీసుకోవాల్సిందేననే నిర్ణయానికి వచ్చామని తెలిపారు. ప్రస్తుతం ఆర్టీసీలో 570 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయని, త్వరలో 2వేల బస్సులు రాష్ట్రానికి రానున్నాయని అన్నారు. ఇందులో 100 బస్సులను వరంగల్‌కు,50 బస్సులను నిజామాబాద్ కు ఇవ్వనున్నామని చెప్పారు. ఎలక్ట్రిక్ వాహనాలకు రాయితీలు అమలవుతున్నాయని పేర్కొన్నారు. 15 ఏళ్లు దాటిన ఆర్టీసీ బస్సులను స్ర్కాప్‌కు తరలిస్తున్నట్లు ప్రకటించారు.
డ్రైవింగ్ వస్తేనే లైసెన్సులు..
రాష్ట్రంలో వాహన కాలుష్యం పరీక్షలు చేయడానికిగాను 550 కాలుష్య పరీక్షా కేంద్రాలు ఉన్నాయని, ఆటోమేటిక్ టెస్టింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్టింగ్ కేంద్రాలు కూడా పెడుతున్నామని, డ్రైవింగ్ కచ్చితంగా వ స్తేనే లైసెన్సులు ఇచ్చేలా ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. వాటర్ బోర్డు ట్యాంకర్లుగా ఫిట్‌నెస్ లేని, 15 ఏళ్లు దాటిన వాహనాలను కూడా నడుపుతున్నారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రస్తావించగా.. త్వరలో వాటర్‌బోర్డుకు ఈ అంశంపై నోటీసులు ఇస్తామని మంత్రి చెప్పారు. ఇక ప్రతి ఎమ్మెల్యే విధిగా ఎలక్ట్రిక్ వాహనాన్ని వినియోగించాలని మంత్రి పొన్నం ప్రస్తావించగా.. వాటిని ప్రభుత్వమే సమకూర్చాలని కొందరు సభ్యులు కోరారు. కాగా, ప్రభుత్వానికి అవసరమయ్యే వాహనాలను కూడా ఈవీలనేకొనుగోలు చేయాలనే నిబంధన అమలు చేయాలని పొన్నం సూచించారు. రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్‌లు, పర్యాటక కేంద్రాల వద్ద ఎలక్ట్రిక్ చార్జింగ్ కేంద్రాలు పెడతామన్నారు. ప్లాంటేషన్‌తోపాటు కాలుష్య నివారణకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ పాత్ర అత్యంత కీలకమని, ఆర్టీసీ కార్మికులకు రూ.కోటి బీమా సౌకర్యం కల్పిస్తున్నామని ప్రకటించారు. వారి ఇతర సమస్యలపై ముఖ్యమంత్రితో చర్చించి తగిన నిర్ణయాలు తీసుకుంటామన్నారు.
ఏటా 16-17 లక్షల మంది మృతి..
హైదరాబాద్‌లో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిలో పెరుగుతోందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. కాలుష్యంతో దేశంలో ఏటా 16-17 లక్షల మంది చనిపోతున్నారని, వాహన కాలుష్యాన్ని నేరపూరిత చర్యగా పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు. డీజిల్ బస్సులను సీఎన్‌జీ బస్సులుగా మార్చాలని, సాంకేతికతను మార్చుకోకపోతే సమస్యలు వస్తాయని పేర్కొన్నారు. బీజేపీ సభ్యుడు కాటిపల్లి వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో నడిచే లక్ష వాహనాల్లో 60 శాతం హైదరాబాద్‌లోనే ఉన్నాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగాలని అభిప్రాయపడ్డారు. గ్రామాల్లో ఎలక్ట్రిక్ చార్జింగ్ కేంద్రాలు లేనందువల్లే వీటి వినియోగం తక్కువగా ఉందని, ఆ ప్రాంతాల్లో చార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని అన్నారు. అయితే 2014తో పోల్చితే ఎలక్ట్రిక్ వాహన వినియోగం గణనీయంగా పెరిగిందన్నారు. స్వయంగా తాను కూడా ఎలక్ట్రిక్ వాహనం వినియోగించాలంటే చార్జింగ్ కేంద్రాల సమస్య ఉందని గుర్తు చేశారు. మహారాష్ట్రలో సమృద్ధి ఎక్స్‌ప్రె్‌సవేపై ఎలక్ట్రిక్ వాహనాలకు టోల్ ట్యాక్స్ నుంచి మినహాయిపు ఉందని, ఢిల్లీ ప్రభుత్వం కూడా పలు రాయితీలు ఇస్తోందని వివరించారు. కాగా, ఫాస్ట్ చార్జింగ్ కేంద్రాలను ప్రోత్సహించాలని కాగజ్‌నగర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు అన్నారు. యాదగిరిగుట్టలో ఎలక్ట్రిక్ బస్సులు నడపాలని ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య కోరారు.
ఆర్టీసీ డిపోలను ప్రైవేటుకు అప్పగిస్తారా?: కూనంనేని
విద్యుత్ బస్సుల వాడకం పెంచి.. గ్రేటర్ హైదరాబాద్‌లోని ఆర్టీసీ డిపోలను ప్రైవేటు వారికి అప్పగించే ఆలోచన ఏమైనా చేస్తున్నారా? అని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికుల్లో దీనిపై అనుమానాలున్నాయని తెలిపారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం ప్రక్రియ ఏ దశలో ఉందని ప్రశ్నించారు. ఆర్టీసీలో యూనియన్లు లేకపోవడం అన్యాయమని, కనీస వేతనాల సాధన కోసం యూనియన్లు అవసరమని అన్నారు. ఆర్టీసీ ఎండీలుగా పోలీసులను పెట్టడం వల్ల వారి వ్యవహార శైలిలో పోలీసు దర్పం కనిపిస్తోందన్నారు.