Share News

ప్రభుత్వ ఉద్యోగులకు ఈవీలపై రాయితీ

ABN , Publish Date - Mar 30 , 2026 | 05:25 AM

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు విద్యుత్‌ వాహనాల(ఈవీ) కొనుగోలుపై రాయితీలు ఇచ్చేందుకు ఈవీ కంపెనీలు ముందుకొచ్చాయి. విద్యుత్‌ వాహనాల కొనుగోలుపై కొంత సబ్సిడీ ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం .....

ప్రభుత్వ ఉద్యోగులకు ఈవీలపై రాయితీ

  • 10-20 శాతం దాకా డిస్కౌంట్‌ ఇచ్చేందుకు సంస్థలు రెడీ

  • ఓలా ఈ-బైక్‌పై 20 శాతం, అథెర్‌ బైక్‌లపై 11 శాతం తగ్గింపు

  • టాటా టియాగోపై 10 శాతం, పంచ్‌పై 20 శాతం దాకా రాయితీ

  • మహీంద్రా ఎక్స్‌యూవీ 400పై రూ.3.49లక్షల వరకు తగ్గింపు

  • ప్రభుత్వానికి టాటా, మహీంద్రా, ఓలా, అథెర్‌ కంపెనీల లేఖ

  • నెలకు ఇన్ని వాహనాలు మాత్రమే అని కోటా.. ఇతర వర్గాలకూ రాయితీ లభించేలా చర్యలు తీసుకుంటామన్న మంత్రి పొన్నం

హైదరాబాద్‌, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు విద్యుత్‌ వాహనాల(ఈవీ) కొనుగోలుపై రాయితీలు ఇచ్చేందుకు ఈవీ కంపెనీలు ముందుకొచ్చాయి. విద్యుత్‌ వాహనాల కొనుగోలుపై కొంత సబ్సిడీ ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ రాసిన లేఖలకు వాహన తయారీ కంపెనీలు సానుకూలంగా స్పందించాయి. వాహన మోడల్‌ను బట్టి డిస్కౌంట్‌ ఇస్తామని వెల్లడించాయి. 10 నుంచి 20 శాతం వరకు రాయితీలు ప్రకటించిన కంపెనీలు.. నెలకు ఇన్ని వాహనాలకు మాత్రమే అంటూ కోటా పెట్టాయి. ఈ మేరకు కార్లకు సంబంధించి టాటా, మహీంద్ర సంస్థల నుంచి ఈబైక్‌ల అంశంలో ఓలా, ఏథర్‌ కంపెనీల నుంచి మంత్రి పొన్నంకు లేఖలు అందాయి. ఏ మోడళ్లపై ఎంత రాయితీ ఇస్తామనే అంశాన్ని ఆయా కంపెనీలు లేఖల్లో పేర్కొన్నాయి.


ముందుకొచ్చిన టాటా, మహీంద్రా..

టాటా టియోగో మోడల్‌కు 10శాతం, టాటా పంచ్‌లో 20శాతం రాయితీ ఇస్తామని టాటా కంపెనీ పేర్కొంది. అలాగే, కర్వ్‌ ఈవీ మోడల్స్‌లో 20శాతం వరకు రాయితీ ఇస్తామని పేర్కొంది. ఒక్కో వాహనానికి ఈ మోడల్‌లో రూ.3.4లక్షల నుంచి రూ.4లక్షల వరకు ధర తగ్గనుంది. పంచ్‌లో ఉన్న వేరియంట్‌లకు కూడా 20శాతం చొప్పున... అంటే వాటి ధరలను బట్టి రూ.2.75లక్షల నుంచి రూ.2.80లక్షల వరకు తగ్గింపు లభించనుంది. నెలకు 50 వాహనాలను మాత్రమే రాయితీపై అందిస్తామని టాటా చెప్పింది. ఇక, మహీంద్రా కంపెనీ తమ ఎక్స్‌యూవీ-400 ఈఎల్‌ ప్రో వాహనం ఎక్స్‌ షోరూమ్‌ ధర రూ.17,49,000లు ఉండగా దానిని రూ.13,99,000కే ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తామంది. అంటే సుమారు రూ.3.49లక్షలు తగ్గిస్తామంది. ఎక్స్‌యూవీ-400సిరీస్‌లోనే ఇంకొన్ని వేరియంట్స్‌ ధరలో రూ.2.6.5లక్షల వరకు తగ్గిస్తామని చెప్పింది. తమ కంపెనీకే చెందిన బీఈ 6 ఈవీ వాహనం ధరలో రూ.1.20లక్షల వరకు, ఎక్స్‌ఈవీ 9ఈ వాహనంపై రూ.2.05లక్షల వరకు తగ్గిస్తామని తెలిపింది. మరికొన్ని వాహనాల విషయంలో డెలివరీ విషయంలో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపింది. ఓలా, అతెర్‌ కంపెనీలు కూడా తమ ఈ బైక్‌లపై ప్రత్యేక తగ్గింపు ఇచ్చేందుకు సిద్ధమన్నాయి. ఓలా కంపెనీ ఈవీ బైక్‌లలో కొన్ని మోడళ్లకు 20శాతం రాయితీ ఇస్తామని తెలిపింది. ఓలా కంపెనీ తమ ఈ బైక్‌లలో ఎస్‌1 ఎక్స్‌ రేంజ్‌ వేరియంట్‌ కొనుగోలుపై 17,600 నుంచి రూ.27,539 వరకు తగ్గింపును ఇస్తామంది. ఎస్‌1 ప్రో రేంజ్‌ వేరియంట్‌పై రూ.29వేల నుంచి రూ.40వేల వరకు రాయితీపై అందించనుంది. రోడ్‌స్టర్‌ బైక్‌ వేరియంట్‌కు రూ.31,415నుంచి రూ.63,539వరకు తగ్గింపు ఇచ్చింది. ఇక, అతెర్‌ తమ బైక్‌లపై 11శాతం రాయితీ ఇస్తామని పేర్కొంది. అయితే, నెలకు 450 ద్విచక్ర వాహనాలను మాత్రమే ఇలా తగ్గింపు ధరకు అందిస్తామని, వాహనాల ఎక్స్‌ షోరూమ్‌ ధరలపైనే తగ్గింపు ఉంటుందని సంస్థలు వెల్లడించాయి.

పర్యావరణ పరిరక్షణే లక్ష్యం : పొన్నం

పర్యావరణ పరిక్షణ కోసం విద్యుత్‌ వాహనాల వినియోగం పెరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, దానికి అనుగుణంగానే తొలుత ప్రభుత్వ ఉద్యోగుల్లో వాటి వినియోగం పెంచేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‘ఆంధ్రజ్యోతి’తో ఆదివారం అన్నారు. అందులో భాగంగానే ప్రభుత్వ ఉద్యోగులకు రాయితీలు ఇవ్వాలని పలు కంపెనీలకు లేఖలు రాశామన్నారు. కొన్ని కంపెనీలు రాయితీలు ఇచ్చేందుకు ముందుకొచ్చాయని, మరికొన్ని కంపెనీలు కూడా ముందుకొస్తాయని తెలిపారు. తొలి దశలో ప్రభుత్వ ఉద్యోగుల్లో వీటి వినియోగం పెరిగాక... ఆ తర్వాత మిగతా వర్గాల వారికీ ఈ రాయితీ వర్తించేలా ప్రయత్నం చేస్తామని పేర్కొన్నారు. అత్యధికంగా 21శాతం వరకు రాయితీ ఇస్తామని కంపెనీలు తెలిపాయన్నారు. వాహనాలు కొనుగోలు చేసే ఉద్యోగుల వివరాలను తయారుచేసి ఆయా కంపెనీల షోరూమ్‌లతో సమన్వయం చేయాలని అధికారులను ఆదేశించామన్నారు.

Updated Date - Mar 30 , 2026 | 05:25 AM