Share News

State Medical Board: వైద్య మండలిపై పట్టు కోసం...వైద్యులు వర్సెస్‌ ప్రభుత్వం

ABN , Publish Date - Jan 05 , 2026 | 03:04 AM

రాష్ట్ర వైద్య మండలిపై పట్టు కోసం వైద్య సంఘాలు విశ్వప్రయ త్నం చేస్తుండగా.. స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థపై ప్రైవేటు వైద్యుల పెత్తనం ఏంటంటూ వారికి చెక్‌ పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది....

State Medical Board: వైద్య మండలిపై పట్టు కోసం...వైద్యులు వర్సెస్‌ ప్రభుత్వం

  • ఎక్స్‌-అఫీషియో సభ్యులను పెంచిన సర్కారు.. వ్యతిరేకిస్తున్న మెడికల్‌ కౌన్సిల్‌ పాలకవర్గం

  • ప్రైవేటు డాక్టర్ల పెత్తనంపై ప్రభుత్వం గుర్రు

  • నిధుల దుర్వినియోగంపై ఫిర్యాదులు

  • ఇప్పటికే ఆడిట్‌కు ఆదేశించిన ప్రభుత్వం

హైదరాబాద్‌, జనవరి 4(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వైద్య మండలిపై పట్టు కోసం వైద్య సంఘాలు విశ్వప్రయ త్నం చేస్తుండగా.. స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థపై ప్రైవేటు వైద్యుల పెత్తనం ఏంటంటూ వారికి చెక్‌ పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వైద్య మండలి నిధులు కోట్లాది రూపాయలు దుర్వినియోగం అయ్యాయన్న ఫిర్యాదులపై ప్రభుత్వం ఆడిటింగ్‌కు ఆదేశించడం, తాజాగా ఎక్స్‌-అఫీషియో సభ్యుల సంఖ్యను 4 నుంచి 8కి పెంచడం వెనక మర్మం ఇదేనని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2016 జనవరిలో రాష్ట్ర వైద్య మండలి ఏర్పాటైంది. నాటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నామినేటెడ్‌ సభ్యులతో నెట్టుకొచ్చింది. దీనిపై కొంద రు హైకోర్టుకు వెళ్లగా.. 2023 తొలినాళ్లలో తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. దాంతో కొత్త పాలక వర్గం ఏర్పాటైంది. నిబంధనల మేరకు వైద్య మండలిలో మొత్తం 25 మంది సభ్యులుండాలి. ఇందులో 13 మంది ఎన్నికైన వారు ఉంటారు. మరో ఆరుగురిని ప్రభుత్వం నామినేట్‌ చేస్తుంది. వైద్య విద్య సంచాలకులు, డీహెచ్‌, టీవీవీపీ కమిషనర్‌ హోదాలో ఉన్న ఇంకో నలుగురిని ఎక్స్‌ అఫీషియో సభ్యులుగా ప్రభుత్వమే నియమిస్తుంది. మరో ఇద్దరు సభ్యులు కాళోజీ హెల్త్‌ వర్సిటీ నుంచి ఉంటారు. తాజాగా ప్రభుత్వం ఎక్స్‌ అఫీషియో సభ్యుల సంఖ్యను 8కి పెంచడంతో మొత్తం సభ్యుల సంఖ్య 29కి పెరుగుతుంది. వైద్య మండలిలో ప్రభుత్వం నియమించిన నామినేటెడ్‌ సభ్యులే ఎక్కు వ ఉండటంతో ప్రభుత్వం అనుకున్న వారే చైర్మన్‌ అవుతారు. ఈ పరిణామాన్ని ఊహించిన ప్రస్తుత పాలకవర్గం రెండు రోజుల కిందటే చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికలు నిర్వహించి మళ్లీ తమ చేతుల్లోనే వైద్య మండలి ఉండేలా జాగ్రత్తపడింది. ఎక్స్‌ అఫీషియో సభ్యుల సంఖ్య పెంపును సవాల్‌ చేస్తూ పాలకవర్గం హైకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలుస్తోంది.


నిధుల ఖర్చు లెక్కలు రహస్యం!

వైద్య మండలిలో నిబంధనలకు విరుద్ధంగా కొందరు సభ్యులు వేతనాలు డ్రా చేసుకుంటున్నారు. నిబంధనల ప్రకారం వైద్య మండలిలో ఎవరికీ వేతనాలు ఉండవని, కేవలం సమావేశాలు జరిగినప్పుడు సిట్టి గ్‌ ఫీజు మాత్రమే చెల్లిస్తారని ఉన్నతాధికారులు చెబుతున్నారు. స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ అన్న పేరుతో ప్రస్తుత పాలకవర్గం నిధుల వ్యయం లో ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని అధికారులు చెబుతుండగా.. కోట్లాది రూపాయలకు సంబంధించిన లెక్కలను సమాచార హక్కు చట్టం కింద అడిగినా కూడా ఇవ్వడం లేదని ఆర్టీఐ కార్యకర్తలు పేర్కొంటున్నారు. దీంతో నిధులు సక్రమంగా వినియోగించడం లేదన్న అనుమానంతో కొందరు వైద్యులు, ఆర్టీఐ కార్యకర్తలు ఫిర్యాదు చేయగా ప్రభుత్వం ఆడిటింగ్‌కు ఆదేశించింది. ప్రస్తుతం ఆడిటింగ్‌ అధికారులు వైద్య మండలి నిధుల లెక్కలు తేల్చే పనిలో ఉన్నారు.

వైద్య మండలిలో కోట్ల నిధులు

రాష్ట్రంలో ప్రాక్టిస్‌ చేసే వైద్యులు తప్పనిసరిగా వైద్య మండలి వద్ద రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. కొత్తగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలంటే రూ.1000 చెల్లించాలి. ఇతర దేశాల్లో వైద్య విద్య చదివిన వారైతే రూ.3 వేలు చెల్లించాలి. సూపర్‌ స్పెషాలిటీ అయితే రూ.5 వేలు, పేరు మార్పు కోసం రూ.2 వేలు, పీజీ డిగ్రీ రిజిస్ట్రేషన్‌ కోసం రూ.3 వేలు.. ఇలా మొత్తం 15 కేటగిరీలకు ఫీజులు, రెన్యువల్‌ ఫీజులు ఉన్నాయి. వైద్య ఆరోగ్య శాఖ గణాంకాల మేరకు వైద్య మండలిలో సుమారు 55 వేల మంది వైద్యులు రిజిస్టర్‌ అయ్యారు. ఇందులో కొత్తగా అయ్యేవారితో పాటు, రెన్యువల్‌ అయ్యేవారు నిత్యం ఉంటూనే ఉంటారు. ఒక్క రిజిస్ట్రేషన్‌, రెన్యువల్స్‌ రూపంలోనే వైద్య మండలికి ఏటా కోట్ల రూపాయలు వస్తున్నాయి. ఇవి కాకుండా రాష్ట్రం ఏర్పడే నాటికే ఉమ్మడి ఏపీ నుంచి కొన్ని కోట్ల రూపాయలు వైద్య మండలికి వచ్చాయి. అయితే ఈ నిధుల లెక్కలను సర్కారుకు ఇవ్వడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.

Updated Date - Jan 05 , 2026 | 03:04 AM