Share News

ప్రధాని కాలేదన్న వెలితి పటేల్‌కు లేదు

ABN , Publish Date - Jan 26 , 2026 | 03:30 AM

దేశ ప్రత్యేకతంతా ఈ నేల బహుళత్వంలోనే ఇమిడి ఉందని మహాత్మాగాంధీ మనుమడు, పశ్చిమ బెంగాల్‌ మాజీ గవర్నర్‌ గోపాలకృష్ణ గాంధీ అన్నారు.

ప్రధాని కాలేదన్న వెలితి పటేల్‌కు లేదు

  • నెహ్రూ, పటేల్‌ మధ్య వైషమ్యాలు అబద్ధం

  • హైదరాబాద్‌ సాహితీ మహోత్సవంలో గోపాలకృష్ణ గాంధీ వెల్లడి

హైదరాబాద్‌ సిటీ, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): దేశ ప్రత్యేకతంతా ఈ నేల బహుళత్వంలోనే ఇమిడి ఉందని మహాత్మాగాంధీ మనుమడు, పశ్చిమ బెంగాల్‌ మాజీ గవర్నర్‌ గోపాలకృష్ణ గాంధీ అన్నారు. ప్రపంచంలో అత్యంత బహుళత్వం, ప్రత్యేకతలతో పాటు పరస్పర విరుద్ధతలు కలిగిన సమాజం కూడా మనదే అని పేర్కొన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో సత్వా నాలెడ్జ్‌ సిటీలోని హైదరాబాద్‌ సాహితీ మహోత్సవం వేదికగా తాను రాసిన ‘ఇండియా అండ్‌ హర్‌ ఫ్యూచర్‌’ పుస్తకంపై గోపాల కృష్ణ గాంధీ సంభాషించారు. ‘‘తాను ప్రధాని కాలేదన్న వెలితి పటేల్‌కు ఎప్పుడూ లేదు. ఆయన మరణశయ్య మీద ఉన్న సమయంలో కేబినేట్‌లో పటేల్‌కు సహచరుడైన విష్ణు గాడ్గిల్‌ చేయిపట్టుకుని మరీ ‘ఎలాంటి పరిస్థితుల్లోనూ నెహ్రూను వీడొద్దు’ అని చెప్పారు. అంతటి స్నేహభావం కలిగిన నెహ్రూ, పటేల్‌ మధ్య వైషమ్యాలున్నట్లు ప్రచారం కావడం మన దేశ దౌర్భాగ్యం. పటేల్‌ ముమ్మాటికీ లౌకికవాది. హిందుస్థానీ, ఉర్దూ గీతాలు చాలా ఇష్టం. ఆయనను లౌకికవాది కాదు అనడానికి మించిన మూర్ఖత్వం మరొకటి లేదు. పటేల్‌ను ఒక వాదానికి పరిమితం చేయడం పూర్తి అవగాహనాలోపమే’’ అని గోపాల కృష్ణ ఉద్ఘాటించారు. ఉపాధి హామీ పథకానికి గాంధీ పేరు తొలగించడంపై ‘ఆంధ్రజ్యోతి’ అడిగిన ప్రశ్నకు గోపాలకృష్ణ గాంధీ స్పందిస్తూ.. ‘గాంధీజీ పేరు, ప్రఖ్యాతలను ఎన్నడూ కోరుకోలేదు. వాటికోసం ఆయన ఎప్పుడూ ఆందోళన చెందలేదు. తాను నమ్మిన విలువలను ఆచరించారు. మనం గాంధీజీని మరచిపోయినా ఫర్వాలేదు. కానీ ఆయన చూపించిన మార్గాన్ని అనుసరిస్తే చాలు. ఇక గాంధీజీపై దుష్ప్రచారాలు కొత్త కాదు’ అన్నారు.

Updated Date - Jan 26 , 2026 | 03:30 AM