ధాన్యం కొనుగోలు కేంద్రంలో గోల్‌మాల్
ABN , Publish Date - Jul 10 , 2026 | 12:12 AM
యాదాద్రి-భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలం పెద్దరావులపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రంలో అక్రమాలు జరిగాయి.
పెద్దరావులపల్లి కొనుగోలు కేంద్రంలో అక్రమాలు
జూలూరు పీఏసీఎస్ సీఈవో సస్పెన్షన్
తప్పుడు రికార్డులతో కౌలు రైతుల సొమ్ము స్వాహా
భూదాన్‌పోచంపల్లి, జూలై 9(ఆంధ్రజ్యోతి): యాదాద్రి-భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలం పెద్దరావులపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రంలో అక్రమాలు జరిగాయి. డబ్బులు పక్కదారి పట్టించిన జూలూరు పీఏసీఎస్ సీఈవోను సస్పెండ్ చేస్తూ జిల్లా సహకార అధికారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వ్యవహారంలో సంబంధం ఉన్న అధికారులపై విచారణ కొనసాగుతోంది. జూలూరు పీఏసీఎస్ పరిధిలోని పెద్దరావుపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం పనితీరుపై గ్రామ రైతులు ఈ నెల 6న కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి స్పందించి విచారణకు ఆదేశించారు. ప్రాథమిక విచారణలో పలు అక్రమాలు బయటపడ్డాయి. పీఏసీఎస్ సీఈవో రెబ్బాస్ నర్సింహ, కొనుగోలు కేంద్రం ఇన్‌చార్జి, ట్యాబ్ ఆపరేటర్‌తో కుమ్మక్కై కొనుగోలు రికార్డులు తారుమారు చేశారని తేలింది. రైతులు తెచ్చిన ధాన్యాన్ని గ్రామ సర్పంచ్‌కు చెందిన భూమిలో పండిన పంటగా రికార్డుల్లో తప్పుడు వివరాలు నమోదు చేశారు. ఈ మోసం ద్వారా ధాన్యం కొనుగోలుకు పౌరసరఫరాల సంస్థ నుంచి రావాల్సిన రూ.9,09,696లను ఈ ఏడాది జూన్ 27న అనధికారికంగా సర్పంచ్ బ్యాంక్ ఖాతాలోకి మళ్లించారు. అధికారుల విచారణలో బయటపడింది. ఆర్థిక అక్రమాలు, రికార్డుల ఫోర్జరీకి పాల్పడినట్లు విచారణలో తేలడంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చర్యలు చేపట్టారు. పీఏసీఎస్ సీఈవో రెబ్బాస్ నర్సింహను సస్పెండ్ చేశారు. జూలూరు తాత్కాలిక సెక్రటరీగా కిరణ్‌కు బాధ్యతలు అప్పగించారు. వ్యవసాయ శాఖ ఏఈవోకు సైతం షోకాజ్ నోటీసు ఇచ్చారు.