Share News

బంగారం కొనుగోళ్లు 20శాతం డౌన్‌!

ABN , Publish Date - Jun 30 , 2026 | 05:26 AM

ఇవన్నీ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని బంగారం మార్కెట్‌ పరిస్థితికి ప్రతిబింబాలు. విదేశీ మారకద్రవ్య నిల్వలను కాపాడాలనే లక్ష్యంతో ఏడాది పాటు బంగారం....

బంగారం కొనుగోళ్లు 20శాతం డౌన్‌!

  • ధర కూడా కిందకు.. మోదీ పిలుపు ప్రభావంతోనే.. తగ్గిన ఆర్డర్లు.. పాత బంగారంతోనే పెళ్లి ఆభరణాలు

  • ఆ నగలూ పరిమితంగానే చేయిస్తున్న వైనం

  • ఏపీ, తెలంగాణలో మరికొన్నాళ్లు ఇదే పరిస్థితి

  • జీవన భృతిపై ప్రభావం పడిందంటున్న స్వర్ణకారులు

  • ప్రధాని మోదీ ప్రకటన ముందు వరకు రోజుకు సగటున కిలోన్నర బంగారు ఆభరణాలు అమ్మేవాళ్లం.. ఇప్పుడు 1.20 కిలోలకు మించట్లేదు.

- హైదరాబాద్‌లోని షోరూమ్‌ నిర్వాహకుడు

  • మే నెల రెండోవారం వరకు మా జ్యువెల్లరి స్టోర్‌లో ప్రతిరోజు ఒక కిలో బంగారు ఆభరణాలు అమ్ముడయ్యేవి. పెళ్లిళ్ల సీజన్‌లో ఇది ఇంకాస్త ఎక్కువే ఉండేది. జూన్‌లో 25శాతం అమ్మకాలు తగ్గిపోయాయి. బహుశా ఇంకో 6 నెలల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని అనుకుంటున్నాం.

- విజయవాడలో నగల షాపు యజమాని

  • మునుపు రోజుకు 15 నుంచి 20 తులాల మేర నగల తయారీకి ఆర్డర్లు వచ్చేవి. ఇప్పుడు 3-4 తులాల మేర కూడా ఆర్డర్లు రావడం లేదు.

- నల్లగొండలోని ఓ స్వర్ణకారుడి ఆవేదన

ఇవన్నీ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని బంగారం మార్కెట్‌ పరిస్థితికి ప్రతిబింబాలు. విదేశీ మారకద్రవ్య నిల్వలను కాపాడాలనే లక్ష్యంతో ఏడాది పాటు బంగారం కొనుగోళ్లు తగ్గించాలంటూ మోదీ ఇచ్చిన పిలుపు తర్వాత మార్కెట్‌లో గణనీయమైన మార్పు కనిపిస్తోంది. జ్యువెలరీ వ్యాపారులు, స్వర్ణకారులు, హోల్‌సేల్‌ వ్యాపారులు, బులియన్‌ డీలర్ల అంచనాల ప్రకార బంగారం. కొనుగోళ్లు సుమారు 20శాతం మేర తగ్గాయి. ఫలితంగా ధరలూ కొంత దిగొచ్చాయి. కొత్త బంగారం కొనుగోలు చేయకుండా పాత నగలను కరిగించి కొత్త డిజైన్లుగా మార్పించుకునే వారి సంఖ్య పెరిగింది. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, చమురు ధరల పెరుగుదల, విదేశీ మారకద్రవ్యంపై పెరుగుతున్న ఒత్తిడి నేపథ్యంలో భారత్‌ భారీగా బంగారం దిగుమతులు చేసుకోవాల్సి వస్తోంది. దేశం ఏటా వందల టన్నుల బంగారాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఇందుకు బిలియన్ల డాలర్ల విదేశీ మారకద్రవ్యం ఖర్చవుతోంది.


ఈ పరిస్థితుల్లో మే 10న హైదరాబాద్‌లో జరిగిన సభలో ప్రధాని మోదీ, ఏడాది పాటు బంగారం కొనుగోలు చేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దేశ ఆర్థిక ప్రయోజనాల కోసం ఈ నిర్ణయానికి సహకరించాలని కోరారు. ఆదివారం జరిగిన ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో కూడా ప్రజలు తన పిలుపును గౌరవించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల పసిడి మార్కెట్‌లో మునుపెన్నడూ లేని ఒక సరికొత్త ట్రెండ్‌ కనిపిస్తోంది. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్‌, కరీంనగర్‌, నల్లగొండ, ఖమ్మం, తిరుపతి, రాజమండ్రి తదితర ప్రాంతాల్లో కొనుగోళ్లు సగటున 20-25శాతం అమ్మకాలు తగ్గినట్లు వ్యాపారులు చెబుతున్నారు. సాధారణంగా ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో భూములు అమ్మిన సొమ్మును ఎక్కుడగా బంగారంలో పెట్టుబడిగా పెడుతుంటారు. మోదీ ప్రకటన తర్వాత పెట్టుబడి రూపంలో కొనే (గోల్డ్‌ బిస్కెట్లు, కాయిన్స్‌) కొనుగోళ్లు భారీగా నిలిచిపోయాయని వైజాగ్‌కు చెందిన ఓ ప్రముఖ బులియన్‌ వ్యాపారి తెలిపారు. గతంలో రోజుకు సగటున 100 మంది కొనుగోలుదారులు వస్తే.. ఇప్పుడు 70 నుంచి 75 మంది మాత్రమే వస్తున్నారని జ్యువెలర్లు చెబుతున్నారు. పెట్టుబడి పెట్టాలనుకునే వారు డిజిటల్‌ బంగారం, ప్రభుత్వ గోల్డ్‌ బాండ్లవైపు మళ్లుతున్నారు. దీని వల్ల అటు 2.5శాతం వడ్డీ రావడంతో పాటు విదేశాల నుంచి బంగారం దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి తప్పిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. బంగారం వ్యాపారం పడిపోవడంతో పెద్దపెద్ద కార్పొరేట్‌ షోరూమ్‌లు కస్టమర్లను ఆకర్షించడానికి ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. పాత బంగారం మార్పిడిపై గతంలో ఉన్న తరుగును పూర్తిగా రద్దు చేస్తున్నట్లు బోర్డులు పెట్టాయి.


తక్కువ బరువులోనే భారీగా కనిపించే లైట్‌ వెయిట్‌ యాంటిక్‌ కలెక్షన్లను మార్కెట్లోకి తెచ్చి కష్టమర్లను ఊరడిస్తున్నాయి. దేశీయంగా డిమాండ్‌ పడిపోవడంతో పాటు అంతర్జాతీయంగా కొద్దిగా సానకూల పవనాలు వీచడంతో పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. మోదీ పిలుపు సమయంలో తులం (24క్యారెట్లు) సుమారు రూ.1.52లక్షలు పలికిన రేటు, ప్రస్తుతం రూ.1.43లక్షలకు తగ్గింది. రూ.1.40లక్షల ధర ఉన్న 22 క్యారెట్ల తులం బంగారం.. ప్రస్తుతం రూ.1.31లక్షల మేరకు పడిపోయింది. ధర మరింత తగ్గుతుందేమోనన్న అంచనాతో సామాన్యులు వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నారు. ప్రధాని ఇచ్చిన పిలుపు తెలుగు రాష్ట్రాల్లోని పసిడి మార్కెట్‌పై ఊహించని దెబ్బ కొట్టింది. వ్యాపారాలు తగ్గి వ్యాపారులు, గోల్డ్‌స్మిత్‌లు ఢీలా పడినా.. ధరలు తగ్గడం, దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు జరగడం పట్లు నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరో కొన్ని నెలల పాటు ఇదే పరిస్థితి కొనసాగేలా కనిపిస్తోంది.

హాల్‌ మార్కింగ్‌ కేంద్రాల వద్ద రద్దీ

పాత బంగారాన్ని కరిగించి కొత్త నగలు చేసే క్రమంలో ప్రజలు మోసపోకుండా ఉండేందుకు హాల్‌మార్కింగ్‌ కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. విజయవాడ, వరంగల్‌ నగరాల్లోని హాల్‌ మార్కింగ్‌ టెస్టింగ్‌ కేంద్రాల వద్ద గత మూడు వారాలుగా రద్దీ విపరీతంగా పెరిగింది. పాత బంగారాన్ని కరిగించే ముందు దాని క్వాలిటీ (క్యారెట్‌ స్వచ్ఛత) ఎంత ఉందో తెలుసుకునేందుకు కస్టమర్లు ఇక్కడికి వస్తున్నారు. గతంలో రోజుకు 50 నుంచి 60 నగల పరీక్షలు జరిగే కేంద్రాల్లో ఇప్పుడు రోజుకు 200పైగా టెస్టులు జరుగుతున్నట్లు వరంగల్‌కు చెందిన ల్యాబ్‌ నిర్వాహకుడు చెప్పారు.

- ఆంధ్రజ్యోతి, హైదరాబాద్‌

80 శాతం ఆర్డర్లు తగ్గాయి

బంగారం ధరలు పెరుగుతున్నా.. తులం రూ.2లక్షలకు చేరుతుందనే ఆశతో ఎక్కువమంది దీనిపై పెట్టుబడి పెట్టేవాళ్లు. మోదీ ప్రకటనతో ధర దిగిరావడం, బంగారం అమ్మకాలు తగ్గిపోవడమే కాకుండా స్వర్ణకారులపై కూడా తీవ్ర ప్రభావం పడింది. గతంలో ఒక సామాన్య కుటుంబంలో అమ్మాయి పెళ్లి చేయాలంటే తక్కువలో తక్కువ 10 తులాల నగలైనా చేయించేవారు. కానీ.. ఇప్పుడు 5 తులాలతోనే సరిపెడుతున్నారు. గతంలో హైదరాబాద్‌ నుంచి కూడా విపరీతంగా నగల తయారీ ఆర్డర్లు వచ్చేవి. ఈ సారి మాత్రం స్థానిక గోల్డ్‌షాపుల నుంచి కూడా ఆర్డర్లు తగ్గాయి. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా 80శాతం మేరకు ఆర్డర్లు తగ్గాయి. ఇది స్వర్ణకారుల జీవన భృతి కొంతమేరకు ప్రభావం పడింది. ప్రతి స్వర్ణకారుడు నగల తయారీకీ ఎంతో కొంత బంగారం కొని పెట్టుకుంటాడు. ప్రస్తుతం ఆర్డర్లు తగ్గడంతో అలా కొన్న బంగారం నిల్వ ఉండటం, ధర తగ్గడం వల్ల ఇబ్బందుల్లో ఉన్నాం.

- గిరి, స్వర్ణకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు

Updated Date - Jun 30 , 2026 | 05:26 AM