అమ్మా.. బయలెల్లినాదో!
ABN , Publish Date - Jul 17 , 2026 | 06:07 AM
తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలచే ఆషాడ మాస బోనాల ఉత్సవాలు గురువారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.
గోల్కొండ కోటలో బోనాలు షురూ
జగదాంబిక అమ్మవారికి బంగారు బోనం సమర్పణ
పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రులు
కార్వాన్/నార్సింగ్/కవాడిగూడ/రాంగోపాల్‌పేట్, జూలై 16 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలచే ఆషాడ మాస బోనాల ఉత్సవాలు గురువారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల ప్రారంభానికి సూచికగా గోల్కొండ కోటలో కొలువైన శ్రీ గోల్కొండ ఎల్లమ్మ (జగదాంబిక మహంకాళి) అమ్మ వారికి బంగారు బోనం సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు వి.హన్మంతరావు.. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. శివసత్తులు, పోతరాజుల నృత్యాలు, డప్పు చప్పుళ్ల మధ్య చోటా బజార్‌లో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి ఆలయ పూజారి అనంతచారి సమక్షంలో ప్రత్యేక పూజలు చేశారు. లంగరహౌజ్ నుంచి భారీ తొట్టెలు, చోటా బజార్ నుంచి అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని గోల్కొండ కోటపై గల అమ్మవారి ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఆనవాయితీ ప్రకారం బంజారా దర్వాజ నుంచి పటేల్ లక్ష్మమ్మ కుటుంబం తరఫున శ్రీనాగేశ్వరస్వామి ఆలయం నుంచి మొదటి బోనాన్ని దేవాలయం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించారు. గోల్కొండ కోటలో మొదటి పూజను కనులారా తిలకించేందుకు హైదరాబాద్ నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు, సందర్శకులు తరలివచ్చారు. గోల్కొండ కోటపై ఉన్న శ్రీజగదాంభిక అమ్మవారి ఆలయం వద్ద దర్శనం కోసం బారులుదీరారు. కోటలోని దర్బార్‌హాల్, రాణీమహాల్, అక్కన్న మాదన్న కార్యాలయ భవనం, రామదాసు బందిఖానా, నగీనాభాగ్ తదతర ప్రాంతాల్లో జనం నిండిపోయారు. గురువారం ఒక్కరోజే మూడు లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ11 లక్షలు చెక్కును శ్రీగోల్కొండ జగదాంబిక ఆలయ ఈవో వసంత, ట్రస్టు బోర్డు చైర్మన్ ఆకుల చంద్రశేఖర్‌కు మంత్రులు సురేఖ, పొన్నం అందజేశారు. అలాగే, కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో లోయర్ ట్యాంక్‌బండ్‌లోని శ్రీకనకాల కట్టమైసమ్మ అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. బోనాలు, తొట్టెల ఉరేగింపుతో డప్పు వాయిద్యాలకు అనుగుణంగా వేలాది మంది నృత్యాలు చేస్తూ ఆలయానికి చేరుకొని బోనాలు సమర్పించారు. మంత్రి కొండా సురేఖ, మంత్రి పొన్నం ప్రభాకర్.. తొలి బోనం ఎత్తుకొని మహిళలకు అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రులు మాట్లాడుతూ బోనాల పండుగలో తెలంగాణ వైభవాన్ని చూపిస్తామని వెల్లడించారు. పండుగ నిర్వహణకు ఈ సారి రూ.20కోట్ల బడ్జెట్‌ను విడుదల చేసినట్లు తెలిపారు. గోల్కొండ జగదాంబిక అమ్మవారి కృసా కటాక్షాలతో ప్రజలందరూ చల్లగా ఉండాలని ఆకాంక్షించారు. కాగా, వచ్చే నెల 2వ తేదీన నిర్వహించనున్న సికింద్రాబాద్ శ్రీఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జాతరకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆలయ ఈవో, అధికారులు ఆహ్వానించారు. ఈ మేరకు మంత్రి కొండా సురేఖ, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, సహాయ కమిషనర్, ఈవో గుత్తా మనోహర్ రెడ్డి తదితరులు సీఎంకు ఆహాన పత్రిక అందజేశారు.