గోదావరిలో ట్రైబ్యునల్ అవసరంలేదు!
ABN , Publish Date - Jul 26 , 2026 | 05:48 AM
గోదావరి నదీ జలాలకు సంబంధించి ట్రైబ్యునల్ అవసరం లేదని కేంద్ర జలశక్తి శాఖ పేర్కొంది. ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ చేసిన విజ్ఞప్తిని పునఃపరిశీలన చేసుకోవాలని కోరింది.
జల వివాదాలు కొలిక్కి వస్తున్న సమయమిది
ట్రైబ్యునల్ కావాలన్న విజ్ఞప్తిని పునఃపరిశీలన చేసుకోండి
ఏపీకి కేంద్ర జలశక్తి శాఖ సూచన
హైదరాబాద్, జూలై 25 (ఆంధ్రజ్యోతి): గోదావరి నదీ జలాలకు సంబంధించి ట్రైబ్యునల్ అవసరం లేదని కేంద్ర జలశక్తి శాఖ పేర్కొంది. ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ చేసిన విజ్ఞప్తిని పునఃపరిశీలన చేసుకోవాలని కోరింది. ఇప్పటికే తుంగభద్ర బేసిన్ అంశాలపై ఉన్నతస్థాయి కమిటీని వేయగా, గోదావరి, కృష్ణా బేసిన్ సమస్యలపై ప్రస్తుతం సంప్రదింపులు జరుగుతున్నాయి. ఈ తరుణంలో ట్రైబ్యునల్ ఏర్పాటు విజ్ఞప్తిపై పునరాలోచించుకోవాలని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి పాటిల్.. ఏపీకి సూచించినట్లు తెలిసింది. గోదావరి బేసిన్‌ను పంచుకునే ఇతర రాష్ట్రాలు మహారాష్ట్ర, ఛత్తీ్‌సగఢ్, ఒడిసా, మధ్యప్రదేశ్, కర్ణాటక నుంచి ట్రైబ్యునల్ ఏర్పాటు అంశంపై అభిప్రాయం కోరగా.. గోదావరిలో నీటి వివాదాలు తమకు లేవని, మొత్తం బేసిన్‌కు కలిపి ట్రైబ్యునల్ అవసరం లేదని ఆ రాష్ట్రాలు తెలిపాయి. తెలంగాణ, ఏపీ మధ్య వివాదాలుంటే.. ఆ రెండు రాష్ట్రాల కోసం ట్రైబ్యునల్ వేసుకుంటే తమకు అభ్యంతరం లేదని పేర్కొన్నాయి. మరోవైపు జల వివాదాలపై తెలుగు రాష్ట్రాల సీఎంలు నివేదించిన అంశాలపై చర్చించి, తగిన నిర్ణయం తీసుకునేందుకు ఏర్పాటైన కమిటీ కూడా మూడుసార్లు ఢిల్లీలో సమావేశమైంది. ఆ భేటీల్లో ప్రస్తావనకు వచ్చిన అంశాలన్నింటినీ మరింత ముందుకు తీసుకెళ్లేందుకుగాను మరో మూడు వారాల్లో వారితో మళ్లీ సమావేశం నిర్వహించాలని కేంద్ర జలశక్తిశాఖ ప్రయత్నాలు చేస్తోంది.