జనం సొమ్ముతో గోదావరి బోర్డు సోకులు
ABN , Publish Date - Feb 10 , 2026 | 03:48 AM
నిధుల వ్యయం విషయంలో గోదావరి నది యాజమాన్య బోర్డు(జీఆర్‌ఎంబీ) ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందనే విమర్శలు వస్తున్నాయి.
పైసా పని లేకున్నా భారీగా నిధుల ఖర్చు.. ఈ-ఆఫీస్ కోసమే రూ.కోటి దాకా వ్యయం.. అద్దె కార్లకు అదనంగా చెల్లింపులు
హైదరాబాద్, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): నిధుల వ్యయం విషయంలో గోదావరి నది యాజమాన్య బోర్డు(జీఆర్‌ఎంబీ) ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందనే విమర్శలు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలు ఇచ్చే నిధులను పొదుపుగా ఖర్చు చేయాల్సి ఉండగా, అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టం ప్రకారం గోదావరి, కృష్ణా నదీ యాజమాన్య బోర్డులను కేంద్రం ఏర్పాటు చేసింది. వాస్తవానికి తెలుగు రాష్ట్రాల సమ్మతి, సమన్వయంతో నదీ యాజమాన్య బోర్డులు పనిచేయాలి. బోర్డులు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా తెలుగు రాష్ట్రాలతో సంప్రదింపులు జరపాలి. కానీ, నిధుల వ్యయం విషయంలో గోదావరి బోర్డు ఇలాంటివేవీ పాటించడం లేదు. ఒకవైపు కృష్ణా బోర్డు కేంద్రం సహకారంతో ఉచితంగా ఈ- ఆఫీ్‌స(ఎలకా్ట్రనిక్ కార్యకలాపాల అమలు)ను వినియోగించుకుంటుండగా, ఇందుకోసం గోదావరి బోర్డు రూ.కోటి దాకా వెచ్చించింది. అద్దె వాహనాలకు తెలుగు రాష్ట్రాలు రూ.34వేలు చెల్లిస్తుండగా.. గోదావరి బోర్డు మాత్రం రూ.45వేలు చెల్లిస్తోంది. ఇదేంటని అధికారులు ప్రశ్నిస్తే.. కేంద్రం మాదిరిగానే తామూ చెల్లిస్తున్నామని బదులిచ్చింది. వారానికి ఆరు రోజుల పనిదినాలు ఉంటేనే తాము రూ.34వేలు చెల్లిస్తుంటే.. ఐదు రోజుల పనిదినాలకే రూ.45వేలు చెల్లించడంపై అధికారులు మండిపడుతున్నారు. జలసౌధ భవనం మొత్తానికి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుల వ్యవస్థ ఉండగా.. బోర్డు కార్యాలయం వరకే ప్రత్యేకంగా సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవడంపైనా విమర్శలు ఉన్నాయి. వాస్తవానికి కృష్ణా బేసిన్‌లో శ్రీశైలం, నాగార్జునసాగర్ ఉమ్మడి జలాశయాలు కావడంతో ఏటా తెలుగు రాష్ట్రాల మధ్య లెక్కలేనన్నీ ఫిర్యాదులు అందుతుంటాయి. వీటిని సమన్వయం చేసుకొని, రాష్ట్రాలకు లేఖలు పంపించడం, కేంద్రంతో సంప్రదింపులు జరపడం వంటి పనులతో కృష్ణాబోర్డు నిత్యం బిజీగా ఉంటుంది. గోదావరి బేసిన్‌లో తెలుగు రాష్ట్రాల మధ్య తగాదాలు లేవు. పెద్దవాగు ప్రాజెక్టు ఒక్కటే ఉమ్మడిగా ఉంది. ఈ క్రమంలో గోదావరి బోర్డుకు పెద్దగా పని లేకున్నా.. ఇష్టారాజ్యంగా నిధులు ఖర్చు చేస్తుండడంపై విమర్శలు వస్తున్నాయి.