Share News

పోయి రావయ్యా.. గణపయ్యా

ABN , Publish Date - Sep 24 , 2026 | 01:27 AM

జిల్లా వ్యాప్తంగా గణనాథుడి నిమజ్జనోత్సవం బుధవారం వైభవంగా సాగింది. తొమ్మిది రోజులపాటు విశేష పూజలు అందుకున్న వినాయక విగ్రహాలను భక్తులు ఊరేగింపుగా తరలించి నిమజ్జనం చేశారు. ’పోయిరావయ్యా గణపయ్యా.. మళ్లీ రావయ్యా‘ అంటూ

పోయి రావయ్యా.. గణపయ్యా

పెద్దపల్లి, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా గణనాథుడి నిమజ్జనోత్సవం బుధవారం వైభవంగా సాగింది. తొమ్మిది రోజులపాటు విశేష పూజలు అందుకున్న వినాయక విగ్రహాలను భక్తులు ఊరేగింపుగా తరలించి నిమజ్జనం చేశారు. ’పోయిరావయ్యా గణపయ్యా.. మళ్లీ రావయ్యా‘ అంటూ భక్తులు గణనాథుడికి ఘనంగా వీడ్కోలు పలికారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు ఏర్పాట్లు చేయడంతో నిమజ్జనోత్సవం ప్రశాంతంగా ముగిసింది. నిమజ్జన శోభాయాత్రల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గణనాథుడి వాహనాల ముందు కోలాటాలు ఆడుతూ సందడి చేశారు. భజనలు, భక్తిగీతాలు ఆలపిస్తూ గణపయ్యపై భక్తిని చాటుకున్నారు. మహిళల కోలాటాలు, భక్తిగీతాలు శోభాయాత్రలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. యువత ప్రత్యేక డ్రెస్‌కోడ్‌తో శోభాయాత్రల్లో పాల్గొంది. తలలకు కాషాయ బ్యాండ్లు ధరించి, నుదుట తిలకాలు దిద్దుకుని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. చప్పుళ్ల హోరుతో యువత చేసిన నృత్యాలు అలరించాయి. చిన్నారులు, మహిళలు, వృద్ధులు సైతం శోభాయాత్రలను వీక్షిస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రధాన రహదారులు, గ్రామాల్లోని గల్లీలు గణపతి నామస్మరణతో మార్మోగాయి.

ఫ లడ్డూ ప్రసాదానికి పోటాపోటీ వేలం

జిల్లాలోని పలు మండల కేంద్రాల్లో వినాయక మండపాల వద్ద తొమ్మిది రోజులపాటు ప్రత్యేక పూజలు అందుకున్న స్వామివారి లడ్డూ వేలం పాటలు నిర్వహించారు. భక్తులు పోటీపడి వేలంలో పాల్గొన్నారు. మరికొన్ని మండపాల వద్ద లాటరీ పద్ధతిలో విజేతలను ఎంపిక చేశారు. విజేతలకు ప్రముఖుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. వినాయక మండపాల వద్ద ఉత్సవాల ముగింపును పురస్కరించుకుని బుదవారం మధ్యాహ్నం నిర్వాహకులు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. తొమ్మిది రోజులపాటు పూజలు, భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలతో మండపాలు సందడిగా మారాయి. నిమజ్జనం కోసం తరలిస్తున్న వినాయకుల వాహనాలకు ప్రజలు మహిళలు మంగళహరతులతో స్వాగతం పలుకుతూ బై బై చెప్పారు.

ఫ మినీ ట్యాంక్‌బండ్‌ వద్ద ప్రత్యేక ఏర్పాట్లు

పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్‌బండ్‌, గుండమ్మ, ఎల్లమ్మ చెరువుల వద్ద నిమజ్జనోత్సవాల కోసం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. విగ్రహాల నిమజ్జనానికి అనువుగా సింగరేణి సంస్థ నుంచి క్రేన్లు తెప్పించారు. చెరువు చుట్టూ విద్యుత్‌ దీపాలు, అలంకరణలు, బారికేడ్లు, పారిశుధ్య ఏర్పాట్లు చేపట్టారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మున్సిపల్‌ కమిషనర్‌ ఆకుల వెంకటేశ్‌ ఆధ్వర్యంలో పలు శాఖల అధికారులు నిరంతరం పర్యవేక్షించారు.

ఫ జిల్లాలో 36 చోట్ల నిమజ్జన ఏర్పాట్లు

జిల్లా వ్యాప్తంగా 36 కేంద్రాల్లో నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు. దాదాపు 2 వేల 659 వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించినట్లు అధికారులు తెలిపారు. నిమజ్జనోత్సవాన్ని ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్‌శాఖ ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసింది. 220 మందికి పైగా ఎస్సైలు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు, ట్రాఫిక్‌ సిబ్బందికి విధుల్లో పాల్గొంటున్నారు. ర్యాలీలు ఊరేగింపులు సజావుగా సాగేందుకు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. నిమజ్జన కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. రామగుండం పోలీస్‌ కమీషనర్‌ అంబర్‌ కిషోర్‌ఝా ఆధ్వర్యంలో పోలీసులు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించారు. పోలీస్‌, మున్సిపల్‌, పంచాయతీరాజ్‌, విద్యుత్‌, అగ్నిమాపక, రెవెన్యూ తదితర శాఖల అధికారులు విశేషంగా శ్రమించారు. నిమజ్జన ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా, పారిశుధ్యం, తాగునీరు, ట్రాఫిక్‌ నియంత్రణ, భద్రత, అత్యవసర సేవలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేపట్టారు.

Updated Date - Sep 24 , 2026 | 01:27 AM