9 నెలల్లో ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్
ABN , Publish Date - Feb 18 , 2026 | 05:17 AM
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీ సమగ్ర మాస్టర్ ప్లాన్ 9 నెలల్లో సిద్ధం కానుంది. ఇందుకు సంబంధించిన పక్రియను ప్రభుత్వం మొదలుపెట్టింది.
సమగ్ర మాస్టర్ ప్లాన్-2047 కోసం గ్లోబల్ టెండర్లు
మార్చి 16న టెండర్లు ఓపెన్
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి)
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీ సమగ్ర మాస్టర్ ప్లాన్ 9 నెలల్లో సిద్ధం కానుంది. ఇందుకు సంబంధించిన పక్రియను ప్రభుత్వం మొదలుపెట్టింది. హైదరాబాద్ నగర శివార్లలోని ఆమన్‌గల్, ఇబ్రహీంపట్నం, కందుకూరు, కడ్తాల్, మహేశ్వరం, మంచాల, యాచారం మండలాలల్లోని 74 గ్రామ పంచాయతీలు (56 రెవెన్యూ గ్రా మాలు) పరిధిలోని 765.28 చ.కి.మీ ప్రాంతంలో ఫ్యూచర్ సిటీ అఽథార్టీని ఏర్పాటు చేసింది.ఫ్యూచర్‌సిటీ పరిధిలో 1.80 లక్షల ఎకరాల విస్తీర్ణంలో భూములు ఉన్నాయి. ఇందులో దాదాపు 15వేల ఎకరాలను ప్రభుత్వం ఇప్పటికే సేకరించింది. మరో 15వేల ఎకరాల అటవీ ప్రాంతంలో నైట్‌సఫారీ ఇతర ఎకో టూరిజం, పార్కులు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఫ్యూచర్‌సిటీని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసేందుకు సరికొత్త మాస్టర్ ప్లాన్‌ను కూడా ప్రభుత్వం రూపొందిస్తోంది. కోర్ ప్రాంతంలో అంటే 30వేల ఎకరాల్లో ప్రాథమిక మాస్టర్ ప్లాన్‌ను, డీపీఆర్ తయారీ బాధ్యతలను సింగపూర్‌కు చెందిన ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ సుర్బానా జూరంగ్ సంస్థకు అప్పగించింది. ఇపుడు తాజాగా మొత్తం ఫ్యూచర్ సిటీ అథార్టీ పరిధి అంటే 74 గ్రామ పంచాయతీల్లోని 765.28 చదరపు కిలోమీటర్ల పరిధిలో మాస్టర్ ప్లాన్-2047ని రూపొందించేందుకు కసరత్తు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా అర్హత కలిగిన కంపెనీల నుంచి ప్రతిపాదనలు కోరుతూ ప్రభుత్వం గ్లోబల్ టెండర్లు పిలిచింది. భారత్ ఫ్యూచర్ సిటీ విజన్ అండ్ కాంప్రహెన్సీవ్ మాస్టర్ ప్లాన్-2047 కోసం రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్‌ఎ్‌ఫపీ) జారీ చేసింది. ఆసక్తిగల పార్టీలు తమ ప్రతిపాదనలతో ముందుకు రావాలని నోటిఫికేషన్‌లో కోరింది. ఈ మేరకు ఈనెల 25 వరకు డాక్యుమెంటేషన్ డౌన్‌లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. సాంకేతిక, ఆర్థిక బిడ్ల దాఖలుకు మార్చి 12న సాయంత్రం 5 గంటల వరకు గడువు విధించింది. బిడ్లు మార్చి 16న తెరుస్తామని నోటిఫికేషన్‌లో ప్రభుత్వం వెల్లడించింది. ఇదిలా ఉంటే మొత్తం ఈ పక్రియను 9నెలల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. నిర్ణీత కాలంలో మాస్టర్ ప్లాన్ అమల్లోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.