మెడిసిన్‌లో అమ్మాయిల హవా
ABN , Publish Date - Mar 08 , 2026 | 03:55 AM
రెండుమూడు దశాబ్దాల క్రితం వరకు ఇంటికే పరిమితమైన మహిళలు.. నేడు అన్ని రంగాల్లోనూ పురుషులతో సమానంగా దూసుకుపోతున్నారు. తాము ఎందులోనూ తక్కువ కాదు అని నిరూపిస్తున్నారు.
65 శాతం సీట్లు వారివే
యూజీ, పీజీ, డెంటల్‌లో స్పష్టమైన ఆధిక్యం
నీట్ రాసేవారు, టాపర్స్ లోనూ వారే ఎక్కువ
రాష్ట్రంలో నాలుగేళ్లలో మెడిసిన్‌లో 30,826 మంది అమ్మాయిలు
హైదరాబాద్, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): రెండుమూడు దశాబ్దాల క్రితం వరకు ఇంటికే పరిమితమైన మహిళలు.. నేడు అన్ని రంగాల్లోనూ పురుషులతో సమానంగా దూసుకుపోతున్నారు. తాము ఎందులోనూ తక్కువ కాదు అని నిరూపిస్తున్నారు. వైద్య వృత్తిలోనూ వారి సంఖ్య వేగంగా పెరుగుతోంది. క్లిష్టమైన వైద్య విద్యలో అమ్మాయిలు దూసుకుపోతున్నారు. రాష్ట్రంలో ఈ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తం వైద్యవిద్య సీట్లలో దాదాపు 65 శాతం అమ్మాయిలే సొంతం చేసుకుంటున్నారు. దంత వైద్యంలో అయితే ఏకంగా 80 శాతం సీట్లలో అమ్మాయిలు పాగా వేశారు. రాష్ట్రంలో గత నాలుగేళ్లలో మెడిసిన్ కోర్సుల్లో 30,826 మంది అమ్మాయిలు చేరారు. ఇదే సమయంలో ఈ కోర్సుల్లో చేరిన అబ్బాయిల సంఖ్య 16,424 మాత్రమే. రాష్ట్రంలోని ప్రభు త్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో గత నాలుగేళ్ల గణాంకాలను పరిశీలిస్తే ఏటా ఎంబీబీఎస్ ప్రవేశాల్లో 62-66 శాతం అమ్మాయిలే ఉన్నారు. 2022-23 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో 6,714 ఎంబీబీఎస్ సీట్లుంటే.. వాటిలో 4,156 (61.90 శాతం) సీట్లు అమ్మాయిలు సొంతం చేసుకున్నారు. 2023-24 ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 8,265కు చే రగా, అందులో 5,085 (61.52 శాతం) సీట్లు అమ్మాయిలు ఎగరేసుకుపోయారు. 2024-25లో సీట్ల సంఖ్య 8,414కు పెరిగితే.. అమ్మాయిలు 5,216 (62 శాతం) సీట్లు దక్కించుకున్నారు. 2025-26లో ఎంబీబీఎస్ సీట్లు 8,180 ఉండగా, 5,407 (66 శాతం) సీట్లలో అమ్మాయిలు చేరారు. ఇక పీజీ మెడికల్ సీట్ల విషయానికి వస్తే.. 2022-23లో 65.20శాతం, 2023-24లో 63.56 శాతం, 2024-25లో 63.13శాతం, 2025-26లో 63.66 శాతం సీట్లు అమ్మాయిలే దక్కించుకున్నారు. డెంటల్ కోర్సుల్లో గత నాలుగేళ్లలో వరుసగా 83.82, 79.88, 78.94, 77.44 శాతం సీట్లలో అమ్మాయిలే చేరారు.
మెడిసినే ఎందుకంటే..
ప్రస్తుతం సమాజంలో వైద్య వృత్తికి ఎక్కువ గౌరవం ఉంది. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు మెడిసిన్ చదువుతున్నారు అని చెప్పుకోవడాన్ని గర్వంగా భావిస్తున్నారు. దీనికితోడు మెడిసిన్ పూర్తిచేసి, వృత్తిలో ప్రావీణ్యంసంపాదిస్తే జీవితాంతం ఆర్థిక భరోసా ఉంటుందన్న నమ్మకం ఉంది. గతంలో అమ్మాయిలను సాఫ్ట్‌వేర్, టీచింగ్ వైపు పంపేవారు. ఇప్పుడు తల్లిదండ్రులు తమ కూతుళ్లను వైద్యులుగా చూడాలని కోరుకుంటున్నారు. తెలంగాణలో గత నాలుగేళ్లలో ప్రభుత్వ వైద్య కళాశాల సంఖ్య 35కు పెరిగింది. ఎంబీబీఎస్, పీజీ మెడిసిన్ సీట్లు పెరగటంతోపాటు స్థానిక రిజర్వేషన్ల వంటివి కూడా అమ్మాయిలు మెడిసిన్ వైపు మళ్లేందుకు కారణమయ్యాయి. మెడిసిన్ చదివేందుకు కావాల్సిన ఓపిక, ఏకాగ్రత అబ్బాయిలతో పోలిేస్త అమ్మాయిల్లో ఎక్కువగా ఉంటోందని నిపుణులు అంటున్నారు. అందుకే జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష నీట్ రాసే వారిలో అమ్మాయిలే ఎక్కువగా ఉంటున్నారని చెబుతున్నారు. తెలంగాణలోనే కాకుండా కేరళ, తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ర్టాల్లో కూడా ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. గత కొన్నేళ్లుగా నీట్ ఉత్తీర్ణత శాతంలోనూ, టాప్ ర్యాంకర్లలోనూ అమ్మాయిల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం దేశంలో రిజిస్టర్డ్ డాక్టర్లలో మహిళల సంఖ్య వేగంగా పెరుగుతోంది.
భద్రత, గౌరవం
వైద్యవృత్తిలో పని వాతావరణం బాగుంటుంది. నిర్ణీత పనిగంటలు ఉంటాయి. భద్రత ఉంటుంది. అందరూ కలసి పనిచేసే వాతావరణం ఉంటుంది. వీటితోపాటు సమాజంలో గౌరవం ఉంటుంది. అలాగే ఓపిక కూడా అమ్మాయిలకు కాస్త ఎక్కువే. ఈ కారణాలతోనే అమ్మాయిలు ఎక్కువగా మెడిసిన్‌లో చేరుతున్నారు. అయితే, ఈ వృత్తిలో ఆర్థికంగా స్థిరపడాలంటే చాలా సమయం పడుతుంది. అందుకే అబ్బాయిలు ఇటువైపు రావడం లేదన్న అభిప్రాయాలున్నాయి.
- డాక్టర్ రాజారావు, అడిషనల్ డీఎంఈ, ప్రిన్సిపాల్, ఉస్మానియా మెడికల్ కాలేజీ, హైదరాబాద్