ప్రతి భవనానికీ క్యూఆర్ కోడ్!
ABN , Publish Date - Jan 22 , 2026 | 05:25 AM
హైదరాబాద్‌లో భవనాలకు సంబంధించి సమీకృత డేటా రూపకల్పనకు జీహెచ్‌ఎంసీ కసరత్తు ప్రారంభించింది. జియోస్పేషియల్ ప్లాట్‌ఫామ్ జియోగ్రాఫిక్ ఇన్‌ఫర్‌మేషన్ సిస్టం...
జీహెచ్‌ఎంసీ నిర్ణయం
హైదరాబాద్ సిటీ, జనవరి 21(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో భవనాలకు సంబంధించి సమీకృత డేటా రూపకల్పనకు జీహెచ్‌ఎంసీ కసరత్తు ప్రారంభించింది. జియోస్పేషియల్ ప్లాట్‌ఫామ్ జియోగ్రాఫిక్ ఇన్‌ఫర్‌మేషన్ సిస్టం(జీఐఎస్) ద్వారా అన్ని విభాగాల సమాచార క్రోడీకరణకు రంగం సిద్ధం చేస్తోంది. ప్రతి భవనానికి సంబంధించి ప్రాపర్టీ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్, ట్రేడ్ లైసెన్స్, తాగునీటి సరఫరా కనెక్షన్ నెంబర్, విద్యుత్ కనెక్షన్ తదితర వివరాలతో సాంకేతిక సమీకృత డేటా రూపొందిస్తోంది. ఇందుకోసం ప్రతి భవనానికి ప్రత్యేకంగా క్యూ-ఆర్ కోడ్ కేటాయిస్తారు. మొబైల్ యాప్‌లో క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేస్తే భవనానికి సంబంధించిన వివరాలు అందుబాటులోకి వస్తాయి. ఇందుకోసం జీఐఎస్‌ఆధారిత మొబైల్ యాప్ రూపకల్పనకు జీహెచ్‌ఎంసీ నిర్ణయం తీసుకుంది. పౌరులే యాప్ ద్వారా తమ భవన సమాచారం తెలుసుకునే వెసులుబాటు ఉంటుంది. అన్ని విభాగాల డేటా ఒక్క క్లిక్‌తో అందుబాటులో ఉండడం ద్వారా కేటగిరీలో వ్యత్యాసాలు, ఆస్తిపన్నులో తేడా తదితర సమాచారం సులువుగా తెలిసిపోతుంది. తద్వారా పన్ను సవరణ కేటగిరీ మార్పు వంటివి చేయవచ్చని అధికారులు చెబుతున్నారు. యాప్ రూపకల్పనకు ప్రతిపాదనలు సమర్పించాలని కోరుతూ త్వరలో జీహెచ్‌ఎంసీ టెండర్ నోటిఫికేషన్ ప్రకటించనుంది. గురువారం జరిగే స్టాండింగ్ కమిటీ సమావేశంలో దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటుంది.