క్యూర్‌లో వీధి దీపాల నిర్వహణ.. పదేళ్లు ఒకే సంస్థకు!
ABN , Publish Date - Jul 15 , 2026 | 05:54 AM
జీహెచ్‌ఎంసీ పరిధిలో వీధి దీపాల నిర్వహణను ఇప్పుడు చిన్న చిన్న ఏజెన్సీలు చేపడుతున్నాయి! ప్రాంతాలవారీగా ఆయా కాంట్రాక్టు సంస్థలు నిర్వహిస్తున్నాయి!
రూ.1,341 కోట్ల మెగా టెండర్లో సర్కారు కీలక మార్పులు
ఓఆర్‌ఆర్ లోపల 7.60 లక్షల ఎల్‌ఈడీ వీధి దీపాల నిర్వహణ
టెండర్లలో పాల్గొనే సంస్థల అర్హత నిబంధనల్లోనూ మార్పులు
హైదరాబాద్/సిటీ, జూలై 14 (ఆంధ్రజ్యోతి): జీహెచ్‌ఎంసీ పరిధిలో వీధి దీపాల నిర్వహణను ఇప్పుడు చిన్న చిన్న ఏజెన్సీలు చేపడుతున్నాయి! ప్రాంతాలవారీగా ఆయా కాంట్రాక్టు సంస్థలు నిర్వహిస్తున్నాయి! మూడు కార్పొరేషన్లుగా మారిన క్యూర్ (హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ల) పరిధిలో ఈ విధానం సమూలంగా మారనుంది. పదేళ్లపాటు వీధి దీపాల నిర్వహణను ఒకే సంస్థకు అప్పగించనున్నారు! ఇందుకు రూ.1,341.60 కోట్లతో మెగా ప్రాజెక్టు చేపట్టనున్నారు. సంబంధిత టెండర్ నిబంధనల్లో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఈ మేరకు పురపాలక శాఖ మంగళవారం జీవో 196 జారీ చేసింది. గతంలో విడుదల చేసిన జీవో 91లో కొన్ని నిబంధనలపై కాంట్రాక్టర్లు, పరిశ్రమ ప్రతినిధులు, ఇతర భాగస్వాముల నుంచి వచ్చిన అభ్యంతరాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుని తాజా జీవో జారీ చేసింది. ఈ ప్రాజెక్టు కింద 7,60,591 ఎల్‌ఈడీ దీపాలు, సీఎంఎంఎస్ (సెంట్రలైజ్డ్ కంట్రోల్ అండ్ మానిటరింగ్ సిస్టమ్) ప్యానెళ్లు, అనుబంధ మౌలిక సదుపాయాల సమగ్ర నిర్వహణను పదేళ్లపాటు ఒకే సంస్థకు అప్పగించనున్నారు. వీధి దీపాలు నిరంతరం వెలిగేలా చూడటం, పనిచేయని దీపాలను తక్షణం మార్చడం, ఆస్తుల జీవితకాల నిర్వహణ, పనితీరు ఆధారిత పర్యవేక్షణ, నిర్వహణ ఖర్చును తగ్గించడం ప్రాజెక్టు ప్రధాన లక్ష్యాలుగా ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటి వరకు ఉన్న నిబంధనల ప్రకారం ఏటా 15 వేల అదనపు వీధి దీపాలను ఐదేళ్లపాటు మాత్రమే సరఫరా చేయాల్సి ఉండేది. తాజా సవరణతో ఈ బాధ్యతను పదేళ్ల కాలానికి పొడిగించింది. కోట్ చేసిన ధరకే ఏటా వీటిని సరఫరా చేయాలి. తొలుత జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. ఆరు నెలల్లోనే అన్ని ఎల్‌ఈడీ వీధి దీపాలు, సీఎంఎంఎస్ బాక్సులను పూర్తిగా మార్చాలి. అయితే, ఇది ఆచరణ సాధ్యం కాదని కమిటీ అభిప్రాయపడటంతో ప్రభుత్వం తాజా ఉత్తర్వుల్లో గడువును సవరించింది.
ప్రస్తుత జీవో ప్రకారం.. సీఎంఎంఎస్ ప్యానెళ్ల మార్పు ఆరు నెలల్లో పూర్తి చేయాలని, 7.60 లక్షల ఎల్‌ఈడీ వీధి దీపాల మార్పుకు రెండేళ్ల గడువు పెంచింది. టెండర్లలో పాల్గొనే సంస్థల అర్హతల్లోనూ సవరణలు చేసింది. పదేళ్లలో ఏదైనా ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.30 కోట్ల విలువైన వీధి దీపాల సరఫరా, నిర్వహణ పనులు చేసి ఉండాలనే నిబంధన గతంలో ఉండేది. ఇప్పుడు దాన్ని సవరించింది. గత ఏడేళ్లలో ఒకే ఒప్పందంలో రూ.30 కోట్ల పని లేదా రూ.20 కోట్ల చొప్పున రెండు పనులు లేదా రూ.15 కోట్ల చొప్పున మూడు పనులు పూర్తి చేసి ఉండాలనే షరతు విధించింది. కనీసం రెండేళ్లపాటు నిర్వహణ అనుభవం ఉండాలనే నిబంధనను తప్పనిసరి చేసింది. అలాగే, టెండర్లలో పాల్గొనే సంస్థలకు గతంలో రూ.180 కోట్ల సాల్వెన్సీ సర్టిఫికెట్ తప్పనిసరి. దీనిపై కూడా అభ్యంతరాలు రావడంతో.. ఇకపై మొత్తం ఒప్పందంలో 10 శాతం మేరకు అంటే రూ.134.16 కోట్ల సాల్వెన్సీ సర్టిఫికెట్ సమర్పిస్తే సరిపోతుందని సవరించింది. టెండరు ప్రక్రియలో మరో కీలక సవరణ చేసింది. ఈఎండీ, బ్యాంకు గ్యారెంటీకి ప్రత్యామ్నాయంగా బీమా ష్యూరిటీ బాండ్లు కూడా తీసుకోవాలని ప్రభుత్వం తాజా జీవోలో పేర్కొంది. ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన సాధారణ పరిపాలనా శాఖ మార్గదర్శకాల ప్రకారం ఈ వెసులబాటును కల్పిస్తూ ఆ నిబంధనలను ఆర్‌ఎ్‌ఫపీలో చేర్చాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. దీనివల్ల కాంట్రాక్టర్లపై ఆర్థిక భారం కొంత తగ్గే అవకాశం ఉంటుంది. క్యూర్ పరిధిలో టెండర్ నిర్వహణ బాధ్యతలను జీహెచ్‌ఎంసీకి అప్పగించింది. ప్రాజెక్టు అమలుకు జీహెచ్‌ఎంసీనే నోడల్ ఏజెన్సీగా ఉంటుంది.