Share News

ఏసీబీ వలలో జీహెచ్‌ఎంసీ ఎస్‌ఈ

ABN , Publish Date - Feb 05 , 2026 | 04:01 AM

జీహెచ్‌ఎంసీలో మరో అవినీతి తిమింగలం ఏసీబీకి చిక్కింది. కూకట్‌పల్లి జోనల్‌ కమిషనర్‌ కార్యాలయంలో సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌....

ఏసీబీ వలలో జీహెచ్‌ఎంసీ ఎస్‌ఈ

  • రూ.15 లక్షల లంచం తీసుకుంటుండగా పట్టివేత.. రూ.1.40 కోట్ల బిల్లు క్లియరెన్స్‌కు 40 లక్షల డిమాండ్‌

  • 30 లక్షలకు ఒప్పందం

  • మొదటి విడతగా కంప్యూటర్‌ ఆపరేటర్‌ ద్వారా రూ.15 లక్షలు తీసుకుంటూ పట్టుబడిన వైనం

  • కేటీఆర్‌ వద్ద పనిచేసిన ఓ అధికారికి చిన్నారెడ్డి సన్నిహితుడు

  • గతంలో డీసీల బదిలీల్లో వసూళ్లు

  • వారంలో సీఈ అవుతారనగా కటకటాలు

హైదరాబాద్‌/హైదరాబాద్‌ సిటీ/కేపీహెచ్‌బీ కాల నీ, ఫిబ్రవరి 4(ఆంధ్రజ్యోతి): జీహెచ్‌ఎంసీలో మరో అవినీతి తిమింగలం ఏసీబీకి చిక్కింది. కూకట్‌పల్లి జోనల్‌ కమిషనర్‌ కార్యాలయంలో సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ (ఎస్‌ఈ) పొద్దుటూరి చిన్నారెడ్డి రూ.15 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. అల్వాల్‌, కూకట్‌పల్లి, మూసాపేట్‌ సర్కిళ్లలోని చెరువుల్లో గుర్రపుడెక్క తొలగింపు, ఏడాది పాటు చెరువుల నిర్వహణకు వేర్వేరుగా పిలిచిన 3 పనులను ఓ కాంట్రాక్టర్‌ దక్కించుకున్నారు. జోనల్‌ కమిషనర్‌ ఆమోదానికి పంపాల్సిన రూ.1.40 కోట్ల విలువైన బిల్లుకు సంబంధించిన ఫైల్‌ను క్లియర్‌ చేయాలంటే తనకు రూ.40 లక్షలు లంచమివ్వాలని చిన్నారెడ్డి డిమాండ్‌ చేశారు. అంత ఇవ్వలేనని కాంట్రాక్టర్‌ చెప్పడంతో రూ.30 లక్షలకు ఒప్పుకున్నారు. మొదటి విడతలో రూ.15 లక్షలు ఇవ్వాలని చెప్పారు. కాంట్రాక్టర్‌కు తరఫు మనుషుల నుంచి కార్యాలయంలో అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిపై కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్న ప్రవీణ్‌కుమార్‌ ఆ సొమ్ము తీసుకుని చిన్నారెడ్డికి ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. చిన్నారెడ్డి, ప్రవీణ్‌ కుమార్‌లను నాంపల్లి కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించామని ఏసీబీ డైరెక్టర్‌ జనరల్‌ చారుసిన్హా తెలిపారు. సుచిత్ర స్ర్పింగ్‌కాలనీలోని చిన్నారెడ్డి నివా సంలో అధికారులు సోదాలు నిర్వహించారు. పలు ప్రాంతాల్లో ఇళ్లు, ప్లాట్లు గుర్తించినట్లు తెలిసింది.

వర్క్‌ఇన్‌స్పెక్టర్‌ నుంచి..

వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌గా ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించిన చిన్నారెడ్డి ఎస్‌ఈ వరకు ఎదిగారు. పబ్లిక్‌ హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచి డిప్యూటేషన్‌పై జీహెచ్‌ఎంసీలో పనిచేస్తున్నారు. బోనాల సందర్భంగా చేయని పనులకు బిల్లులు చెల్లించారని, ఇందుకు 40 శాతానికిపైగా కమిషన్లు తీసుకున్నారని గతంలో ఫిర్యాదులు అందాయి. గత ప్రభుత్వ హయాంలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ వద్ద పనిచేసిన ఓ అధికారికి సన్నిహితుడిగా చిన్నారెడ్డికి పేరుంది. గతంలో జీహెచ్‌ఎంసీ పరిధిలో డిప్యూటీ మునిసిపల్‌ కమిషనర్ల బదిలీల సమయంలో చిన్నారెడ్డి భారీగా వసూలు చేసి సదరు అధికారికి కోట్లు ముట్టచెప్పారన్న ఆరోపణలున్నాయి. చిన్నారెడ్డి కూకట్‌పల్లి జోన్‌లో 2021 నవంబరు నుంచి పనిచేస్తున్నారు. ప్రస్తుతం జోనల్‌ ఎస్‌ఈగానే కాకుండా క్వాలిటీ కంట్రోల్‌, హౌసింగ్‌ విభాగం ఎస్‌ఈగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కూకట్‌పల్లికి ముందు శేరిలింగంపల్లిలో పనిచేశారు. ‘నేను అడిగింది ఇవ్వండి లేదంటే బిల్లులిచ్చేది లేద’ని తెగేసి చెప్పేవారన్న ఆరోపణలున్నాయి. వారం రోజుల్లో శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌ జోన్ల చీఫ్‌ ఇంజనీర్‌గా చిన్నారెడ్డికి బాధ్యతలు అప్పగించాలని ఉన్నతాధికారులు భావిస్తున్నట్లు సమాచారం. ఇంతలోనే ఏసీబీకి చిక్కారు.


టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు పరార్‌!

జోనల్‌ కమిషనర్‌ కార్యాలయంలో ఏసీబీ దాడితో కూకట్‌పల్లి, మూసాపేట్‌ సర్కిళ్లలోని టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు గుండెల్లో రైళ్లు పరిగెట్టాయి. ఆఫీసులో కుర్చీలు ఖాళీ చేసి.. తలుపులకు గడియ పెట్టి చడీచప్పుడు లేకుండా పారిపోయారు. వివిధ పనులపై వచ్చినవారు ఆఫీసుల్లో కంప్యూటర్‌ ఆపరేటర్‌ కూడా లేకపోవడంతో అవాక్కయ్యారు. కాగా, ఆన్‌లైన్‌లోనే అన్నీ అనుమతులు అని చెబుతున్నా అధికారులను కలిసి అడిగిన లంచం ఇచ్చుకుంటే తప్ప పని కావడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎక్కువగా టౌన్‌ ప్లానింగ్‌, రెవెన్యూ, ఇంజనీరింగ్‌, ఎంటమాలజీ విభాగాల్లో అవినీతి జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏళ్లు గడుస్తున్నా ఆపరేటర్లను కూడా అధికారులు బదిలీలు చేయలేకపోతున్నారంటే.. వారి ఆమ్యామ్యాల చిట్టా ఆపరేటర్లకు ఎంత బాగా తెలుసో అర్థం చేసుకోవచ్చన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

2.jpg

10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జూ.అసిస్టెంట్‌

లంచం డబ్బు తీసుకుని జేబులో పెట్టుకున్న ఓ జూనియర్‌ అసిస్టెంట్‌ను ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ జీ శ్రీధర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. బండ్లగూడ మండల కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న శివప్రసాద్‌ మండల పరిధిలోని ఓ ప్రైవేట్‌ పాఠశాల యాజమాన్యానికి ఫోన్‌ చేసి, మీ పాఠశాలలో పదో తరగతి పరీక్ష కేంద్రాన్ని తొలగిస్తున్నామని బెదిరించాడు. పరీక్ష కేంద్రం కొనసాగలంటే రూ.10 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఆ స్కూల్‌ యాజమాన్యం ఏసీబీని ఆశ్రయించింది. బుధవారం వారి నుంచి శివప్రసాద్‌ రూ.10 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి అతడిని పట్టుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా లంచం అడిగితే 1064కు ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వాలని ఏసీబీ సూచించింది.

Updated Date - Feb 05 , 2026 | 04:01 AM