అక్రమ నిర్మాణాల తొలగింపు ఖర్చు..అక్రమార్కుల నుంచే తీసుకోవాలి: హైకోర్టు
ABN , Publish Date - Apr 10 , 2026 | 05:03 AM
అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు అయ్యే ఖర్చును సదరు అక్రమ నిర్మాణాలు చేపట్టిన అక్రమార్కుల నుంచే వసూలు చేయాలని ...
హైదరాబాద్, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు అయ్యే ఖర్చును సదరు అక్రమ నిర్మాణాలు చేపట్టిన అక్రమార్కుల నుంచే వసూలు చేయాలని జీహెచ్‌ఎంసీకి హైకోర్టు నిర్దేశించింది. తార్నాకలోని వీధి నెంబర్ 10 వద్ద రహదారిని ఆక్రమించి అక్రమంగా ఓ తోరణం నిర్మించారు. దీనిపై జీహెచ్‌ఎంసీ మొబైల్ యాప్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన లేకపోవడంతో దాచేపల్లి చంద్రబాబు అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది. టీజీబీపాస్ చట్టం- 2020 ప్రకారం అక్రమ నిర్మాణాలపై వచ్చే ఫిర్యాదులను వారం రోజుల్లో పరిష్కరించాలని, అలాగే అక్రమ నిర్మాణాల తొలగింపు ఖర్చులను అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారి నుంచే వసూలు చేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ తరఫు న్యాయవాది వాదిస్తూ.. ప్రస్తుతం వివాదంలో ఉన్న అక్రమ నిర్మాణం తొలగించాలని స్పష్టమైన స్పీకింగ్ ఆర్డర్ జారీ చేశామని.. నిర్వాహకులు తొలగించని పక్షంలో జీహెచ్‌ఎంసీ తొలగిస్తుందని, ఖర్చులు కూడా వారి నుంచే రికవరీ చేస్తుందని పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. అక్రమ నిర్మాణాలు అని తేలిన వాటిని కూల్చివేసేందుకు అయ్యే ఖర్చులను సదరు నిర్మాణాలు చేపట్టిన వారి నుంచే వసూలు చేయాలని.. దీనిని చట్టంలోనే నిర్దేశించారని పేర్కొంది. ఈ మేరకు ప్రస్తుత అంశంలో అక్రమ కట్టడంపై నాలుగు వారాల్లోగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేస్తూ విచారణను ముగించింది.