బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాలు డంప్ చేశారో.. అంతే!
ABN , Publish Date - Feb 25 , 2026 | 01:24 AM
నిర్మాణ రంగ వ్యర్థాల అక్రమ డంపింగ్‌పై కఠిన చర్యలకు జీహెచ్‌ఎంసీ కసరత్తు ప్రారంభించింది. రోడ్ల పక్కన, చెరువుల్లో, నాలాల వంటి బహిరంగ ప్రదేశాల్లో ...
రహదారుల పక్కన, చెరువులు, నాలాల్లో డంప్ చేస్తే
2లక్షల జరిమానా.. మళ్లీ అదే తప్పుచేస్తే వాహనం సీజ్
హైదరాబాద్ సిటీ, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): నిర్మాణ రంగ వ్యర్థాల అక్రమ డంపింగ్‌పై కఠిన చర్యలకు జీహెచ్‌ఎంసీ కసరత్తు ప్రారంభించింది. రోడ్ల పక్కన, చెరువుల్లో, నాలాల వంటి బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాలకు డంపింగ్ చేస్తే భారీగా జరిమానా విధించాలంటూ జీహెచ్‌ఎంసీ చేసిన ప్రతిపాదనను సోమవారం మంత్రివర్గం ఆమోదించింది. ఈ నేపథ్యంలో త్వరలో నూతన నిబంధనలు అమల్లోకి వస్తాయని ఓ అధికారి చెప్పారు. రోడ్లు, బహిరంగ ప్రదేశాలు, చెరువులు, నాలాల్లో నిర్మాణ రంగ వ్యర్థాలు డంప్ చేస్తే గతంలో కనీస జరిమానాగా రూ.25వేలు విధించేవారు. ఇప్పుడు దీన్ని రూ.లక్ష, రూ.2లక్షలకు పెంచాలని ప్రతిపాదించారు. ఈ మేరకు రోడ్లు, బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాలు డంప్ చేస్తే రూ.లక్ష... చెరువులు, నాలాల్లో డంప్ చేస్తే రూ.2 లక్షలు జరిమానా విధిస్తారు. రెండోసారి ఇదే ఉల్లంఘనకు పాల్పడితే వాహనాన్ని సీజ్ చేస్తారు. నిర్మాణ రంగ వ్యర్థాల సేకరణ, తరలింపు, నిర్వహణ బాధ్యతలను ప్రైవేట్ ఏజెన్సీలకు బల్దియా అప్పగించింది. టోల్ ఫ్రీ నంబరు ఏర్పాటు చేసి.. ఒక్క కాల్ చేస్తే వాహనాలు వచ్చి వ్యర్ధాలు తీసుకెళ్తాయని చెబుతున్నారు. ఇందుకుగాను మెట్రిక్ టన్నుకు రూ.450 నుంచి రూ.485 చెల్లించాల్సి ఉంటుంది. అయినా అక్రమ డంపింగ్ ఆగడం లేదు.