జీహెచ్‌ఎంసీ విభజన చట్టవిరుద్ధం: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
ABN , Publish Date - Feb 12 , 2026 | 02:42 AM
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)ను మూడు కార్పొరేషన్లుగా విభజించడం ఎన్నికల కమిషన్ నియమాలను ఉల్లంఘించడమేనని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)ను మూడు కార్పొరేషన్లుగా విభజించడం ఎన్నికల కమిషన్ నియమాలను ఉల్లంఘించడమేనని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మునిసిపల్ ప్రధాన కార్యాలయానికి దూరంగా ఉన్న ప్రాంతాలను కూడా కార్పొరేషన్‌లో కలపటంతో ఉపాధి హామీ పథకం వర్తించక ఆయా గ్రామాల పేద ప్రజలకు అన్యాయం జరుగుతుందని తెలిపారు. బుధవారం ఆయన బీజేపీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సమగ్ర ప్రణాళిక లేకుండా, ఆర్థిక వనరుల సమీకరణ లేకుండా అనేక గ్రామాలను కొత్త కార్పొరేషన్లలో విలీనం చేసిందని విమర్శించారు. 2007లో ఏర్పడిన జీహెచ్‌ఎంసీ విస్తీర్ణం 650 చ.కి.మీ. కాగా, ఇప్పుడు మూడు కార్పొరేషన్లు కలిపి 2,053 చ.కి.మీ.కు పెంచినా, విస్తరణకు అనుగుణంగా మౌలిక వసతుల ప్రణాళిక లేదని మండిపడ్డారు. జీహెచ్‌ఎంసీ విభజనపై ఎవరి అభిప్రాయాలు తీసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. జనగణనకు సంబంధించి దేశవ్యాప్తంగా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రెవెన్యూ గ్రామాలు, వార్డుల విభజన చేయకూడదని తెలిపారు. నిబంధనలకు వ్యతిరేకంగా జీహెచ్‌ఎంసీ విభజన నోటిఫికేషన్ ఇచ్చారని విమర్శించారు. మునిసిపల్ ఎన్నికల్లో ఓటమి భయంతో కాంగ్రెస్ పార్టీ బెదిరింపులకు దిగటంతోనే మక్తల్‌లో బీజేపీ అభ్యర్థి మహదేవ ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. ఎన్నికల రోజే ఐఏఎ్‌సలను రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం బదిలీ చేయడం సరికాదని అన్నారు.