Share News

11న జీహెచ్‌ఎంసీ విభజన..?

ABN , Publish Date - Feb 09 , 2026 | 02:50 AM

సమీప మునిసిపాలిటీల విలీనంతో దేశంలోనే అతిపెద్ద మునిసిపల్‌ కార్పొరేషన్‌గా అవతరించిన గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌...

11న జీహెచ్‌ఎంసీ విభజన..?

  • మంగళవారంతో ముగుస్తున్న పాలకమండలి గడువు

  • ఆ తర్వాత ఏ క్షణమైనా విభజనపై ఉత్తర్వులు!

  • జీహెచ్‌ఎంసీ, జీసీఎంసీ, జీఎంఎంసీలుగా ఏర్పాటు

హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): సమీప మునిసిపాలిటీల విలీనంతో దేశంలోనే అతిపెద్ద మునిసిపల్‌ కార్పొరేషన్‌గా అవతరించిన గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ)ను ఒకటిగానే ఉంచుతారా? మూడు ముక్కలు చేస్తారా? అన్నది ఒకటిరెండు రోజుల్లో తేలనుంది. 2,053 చరదపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న జీహెచ్‌ఎంసీని 12 జోన్లు, 60 సర్కిళ్ల్లు, 300 వార్డులుగా విభజించిన విషయం తెలిసిందే. దీనిని పరిపాలనా సౌలభ్యం కోసం మూడు కార్పొరేషన్లుగా విభజించనున్నట్లు కొన్నిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన మ్యాపింగ్‌ పూర్తయ్యిందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇందుకనుగుణంగానే సైబరాబాద్‌ పరిధిలోని మూడు జోన్లకు సృజన, మల్కాజిగిరి వైపు మూడు జోన్లకు వినయ్‌కృష్ణారెడ్డిని ప్రత్యేక అదనపు కమిషనర్లుగా నియమించారని అంటున్నారు. జీహెచ్‌ఎంసీ ప్రస్తుత పాలక మండలి గడువు మంగళవారం (10వ తేదీ)తో ముగుస్తుంది. పాలకమండలి ఉన్న సమయంలో విభజిస్తే సాంకేతిక, చట్టపరమైన ఇబ్బందులు వచ్చే అవకాశముంది. అందుకే 10వ తేదీ తర్వాత విభజనపై అధికారికంగా నిర్ణయం తీసుకోవాలని సర్కారు నిర్ణయించినట్టు సమాచారం.


భారీ కార్పొరేషన్‌.. భారీ జనాభా

తెలంగాణ కోర్‌ అర్బన్‌ రీజియన్‌ (టీసీయూఆర్‌) పరిధిలోని 7 కార్పొరేషన్లు, 20 మునిసిపాలిటీలను విలీనం చేస్తూ గత ఏడాది డిసెంబరు 3న ప్రభుత్వం మెగా జీహెచ్‌ఎంసీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇందులోని దాదాపు 1.34 కోట్ల జనాభాకు మెరుగైన పౌర సేవలందించేందుకు కార్పొరేషన్‌ను విభజించాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా మొత్తం ఏరియాను పునర్వ్యవస్థీకరించారు. ఈ క్రమంలో వార్డులు, సర్కిళ్లు, జోన్ల సరిహద్దులు మారాయి. 150 డివిజన్లు ఉన్న పూర్వ జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రస్తుతం 248 డివిజన్లు ఏర్పాటుకాగా.. జనసాంద్రత తక్కువగా ఉన్న విలీన మునిసిపాలిటీలను 52 డివిజన్లుగా విభజించారు. కోర్‌ ఏరియాతోపాటు పాతబస్తీ, శంషాబాద్‌ వైపు ప్రాంతాలున్న ఆరు జోన్లతో ఏర్పాటు చేసే కార్పొరేషన్‌కు జీహెచ్‌ఎంసీ పేరే ఉంటుందని చెబుతున్నారు. ఇక్కడ జనాభా 68 లక్షల వరకు ఉంటుందని అంచనా. పశ్చిమం వైపు మూడు జోన్లతో సైబరాబాద్‌, తూర్పు వైపు మూడు జోన్లతో మల్కాజిగిరి కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తారని ప్రచారం జరుగుతోంది. సైబరాబాద్‌లో సుమారు 35 లక్షలు, మల్కాజిగిరిలో 31 లక్షల జనాభా ఉండే అవకాశముందని అధికార వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉంటే చారిత్రక నేపథ్యమున్న సికింద్రాబాద్‌ పేరు ఓ కార్పొరేషన్‌కు పెట్టాలన్న డిమాండ్లు తెరపైకి వచ్చాయి. దీనిపై సర్కారు ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఈ అన్ని అంశాలపై 11వ తేదీన స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. పాలకమండలి గడువు ముగిసే 10వ తేదీన కూడా కార్పొరేషన్‌ విభజనకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడే అవకాశం లేకపోలేదని ఓ అధికారి చెప్పారు.

పదేళ్ల తర్వాత ప్రత్యేకాధికారి..

ఈ నెల 11వ తేదీ నుంచి జీహెచ్‌ఎంసీలో ప్రత్యేకాధికారుల పాలన రాబోతోంది. దాదాపు పదేళ్ల తర్వాత ప్రత్యేకాధికారుల పాలన రానుంది. 2009 నుంచి 2014 మార్చి వరకు పాలకమండలి ఉండగా.. ఆ తర్వాత నుంచి 2016 ఫిబ్రవరి 11వ తేదీన కొత్త పాలకమండలి కొలువుదీరే వరకు జీహెచ్‌ఎంసీలో ప్రత్యేకాధికారి పాలన సాగింది. గత పదేళ్లలో ఒక్క రోజు కూడా ప్రత్యేకాధికారి లేరు. ఇప్పుడు మూడు కార్పొరేషన్లుగా విభజించిన పక్షంలో జీహెచ్‌ఎంసీ ప్రత్యేకాధికారిగా కర్ణన్‌, సైబరాబాద్‌ కార్పొరేషన్‌లో సృజన, మల్కాజిగిరిలో వినయ్‌కృష్ణారెడ్డి ప్రత్యేక అధికారులుగా ఉంటారని సమాచారం. బుధవారం నుంచి తదుపరి ఎన్నికలు జరిగే వరకు స్పెషలాఫీసర్ల పాలన ఉంటుంది. మునిసిపల్‌ ఎన్నికల ఫలితాలను బట్టి జీహెచ్‌ఎంసీ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం ముందుకు వెళ్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Updated Date - Feb 09 , 2026 | 02:50 AM