Share News

7 లారీల చికెన్‌ వ్యర్థాలు

ABN , Publish Date - Jun 09 , 2026 | 05:09 AM

హైదరాబాద్‌ నగరవ్యాప్తంగా చికెన్‌ దుకాణాల్లో మిగిలిపోతున్న వ్యర్థాలు అవి. వాటిని ‘రెండరింగ్‌’ ప్లాంట్లకు తరలించాలి. నేరుగా ఏ విధంగా వినియోగించినా బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులు...

7 లారీల చికెన్‌ వ్యర్థాలు

  • హైదరాబాద్‌నుంచి ఏపీకి రవాణా

  • ముఠాను పట్టుకున్న జీహెచ్‌ఎంసీ

హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 8 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ నగరవ్యాప్తంగా చికెన్‌ దుకాణాల్లో మిగిలిపోతున్న వ్యర్థాలు అవి. వాటిని ‘రెండరింగ్‌’ ప్లాంట్లకు తరలించాలి. నేరుగా ఏ విధంగా వినియోగించినా బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులు పెరిగిపోయి, విషపూరిత పదార్థాలు ఉత్పత్తయి.. వివిధ రకాల వ్యాధులకు, అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి. కానీ హైదరాబాద్‌ నగరం నుంచి చికెన్‌ వ్యర్థాలు ( కోళ్ల తలలు, పేగులు, కాళ్లు, చర్మం, ఈకలు) వంటివన్నీ ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ఉన్న చేపల చెరువులకు సరఫరా అవుతున్నాయి. చేపల చెరువుల యజమానులు ఈ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వేస్తున్నారు. ఇలా హైదరాబాద్‌ నుంచి ఏపీకి తరలిస్తున్న చికెన్‌ వ్యర్థాలను జీహెచ్‌ఎంసీ, హెచ్‌ ఫాస్టు పట్టుకున్నారు. సోమవారం తెల్లవారుజామున అంబర్‌పేట్‌, కుల్సుంపురా, అత్తాపూర్‌, రాజేంద్రనగర్‌ పరిధిలోని చికెన్‌ వ్యర్థాల రవాణా గోదాములపై ఏకకాలంలో దాడులు చేశారు. సుమారు 90 టన్నుల చికెన్‌ వ్యర్థాలను బస్తాల్లో నింపి అక్రమంగా తరలించేందుకు సిద్ధమైన ఏడు వ్యాన్లను అడ్డుకుని, స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌ నగరవ్యాప్తంగా ఉన్న చికెన్‌ దుకాణాల నుంచి వ్యర్థాలను సేకరించి.. వాటిని ఆంధ్రప్రదేశ్‌లోని చేపల చెరువుల నిర్వాహకులకు విక్రయిస్తున్నట్టు గుర్తించారు.

కుళ్లిపోయి.. దుర్గంధం వెదజల్లుతూ..

నిబంధనల ప్రకారం హైదరాబాద్‌ నగరంలోని చికెన్‌ వ్యర్థాలను చెంగిచెర్లలోని రెండరింగ్‌ పాయింట్‌కు తరలించాల్సి ఉంటుంది. అక్కడ చికెన్‌ వ్యర్థాల్లోంచి ప్లాస్టిక్‌, ఈకలు వంటి వాటిని వేరు చేసి, నీటితో శుద్ధి చేసి.. అధిక ఉష్ణోగ్రతల వద్ద వేడి చేస్తారు. ఈ ప్రక్రియలో సూక్ష్మజీవులు, ప్రమాదకర విషపదార్థాలు తొలగిపోతాయి. తర్వాత దాని నుంచి ‘పౌల్ట్రీ మీల్‌’ తయారు చేస్తారు. దానిని జంతువులు, చేపలకు ఆహారంగా వాడుతారు. కానీ హైదరాబాద్‌ నుంచి ఏపీలోని భీమవరం, ఏలూరు, భీమడోలు, ఉండి (పశ్చిమ గోదావరి జిల్లా) ప్రాంతాలకు, నల్గొండలోని మాల్‌ టౌన్‌కు నేరుగా చికెన్‌ వ్యర్థాలను తరలిస్తున్నారని.. అవన్నీ కుళ్లిపోయి, దుర్గంధం వెదలజల్లుతున్న పరిస్థితిలో ఉన్నాయని అధికారులు తెలిపారు. పచ్చి చికెన్‌ వ్యర్థాలను సేకరించడం, నిల్వ చేయడం, నేరుగా చేపల చెరువుల్లో ఆహారంగా వేయడంపై నిషేధం ఉందని వెల్లడించారు. అలా చేయడం వల్ల ప్రమాదకర సూక్ష్మజీవులు, విష పదార్థాలు చేపల్లోకి చేరి, తద్వారా మనుషుల్లోకి ప్రవేశిస్తాయని హెచ్చరించారు. అలాంటి వ్యర్థాలను తిని పెరిగిన చేపలను మనుషులు తినడం వల్ల క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు స్పష్టం చేస్తున్నారని వివరించారు.

Updated Date - Jun 09 , 2026 | 05:09 AM