చచ్చేంత కష్టం ఏమొచ్చిందో?
ABN , Publish Date - Jul 04 , 2026 | 06:58 AM
వారు ఇద్దరు.. వారికి ఇద్దరు! సొంతిల్లు ఉంది! బియ్యం వ్యాపారంలో భర్త బిజీ! ఇంట్లోనే ఉంటూ ఇద్దరు కుమారులు, అత్తగారి బాగోగులను చూసుకోవడమే..
ఘట్‌కేసర్‌లో రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య
పెద్ద అంబర్‌పేట్‌లో సొంతిల్లు, బంగారంలాంటి ఇద్దరు పిల్లలు
బియ్యం వ్యాపారంలో భర్త బిజీ.. ఆర్థిక లావాదేవీలే కారణమా?
ఇతరులతో కలిసి రెడీ మిక్సర్ కొనుగోలు?.. రెండ్రోజులుగా డిప్రెషన్‌లో
ఘట్‌కేసర్ రూరల్, అబ్దుల్లాపూర్‌మెట్, చెన్నారావుపేట, జూలై 3 (ఆంధ్రజ్యోతి): వారు ఇద్దరు.. వారికి ఇద్దరు! సొంతిల్లు ఉంది! బియ్యం వ్యాపారంలో భర్త బిజీ! ఇంట్లోనే ఉంటూ ఇద్దరు కుమారులు, అత్తగారి బాగోగులను చూసుకోవడమే లోకంగా ఉంటున్న భార్య! మరి, ఏమైందో ఏమో తెలియదు.. ఆ దంపతులు ఉన్నపళంగా ఇంట్లోంచి బయటకు వెళ్లిపోయి.. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు! ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ విషాద ఘటన జరిగింది. మృతులను పెద్ద అంబర్‌పేట్ కుంట్లూర్‌లో నివాసం ఉంటున్న బుడిగె రవికుమార్ (40), శిరీష (37)గా గుర్తించారు. దంపతులు ఒకరినొకరు హత్తుకొని రైలు పట్టాలపై నిల్చున్నారని.. క్షణాల్లోనే ఘోరం జరిగిపోయిందని లోకోపైలెట్ చెప్పడం అందరి గుండెలనూ కదిలించి వేసింది!! రైల్వే పోలీసులు, కుంట్లూర్‌లోని స్థానికులు వెల్లడించిన వివరాల ప్రకారం రవి దంపతుల స్వస్థలం మహబూబాబాద్ జిల్లా చెన్నారావుపేట మండలం పాపాయిపేట గ్రామం. బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కొచ్చారు.
ఈ దంపతులకు కుమారులు సుశాంత్ (13), విద్వేన్ష్ (11) ఉన్నారు. కుంట్లూర్ గణేశ్‌నగర్ ఫేజ్-2లో రవి ఓ ఇల్లు కొనుక్కొని కుటుంబసభ్యులతో కలిసి ఆ ఇంట్లోనే ఉంటున్నాడు. రవి తల్లి కూడా వీరితో పాటే ఉంటోంది. ఆమెకు ఇటీవల పక్షవాతం వచ్చింది. సుశాంత్ తొమ్మిదో తరగతి, విద్వేన్ష్ ఎనిమిదో తరగతి చదువుతున్నారు. రవి చైతన్యపురిలో రైస్‌డిపో నిర్వహిస్తున్నాడు. రవి దంపతులకు హైదరాబాద్‌లో బంధువులు గానీ, సన్నిహితులు గానీ ఎవరూ లేరు. అయితే రెండ్రోజులుగా ఈ దంపతులు మానసికంగా తీవ్ర ఆవేదన చెందుతున్నట్లు తెలిసింది. సొంతిటిని ఖాళీ చేసి చైతన్యపురిలో అద్దె ఇంటికి మారాలని అనుకున్నారు. ఇందుకు ఇంట్లోని సామానంతా ప్యాక్ చేసి పెట్టుకున్నారు.
గురువారం ఉదయం ఇద్దరు పిల్లలను బడికి పంపారు. మధ్యాహ్నం వరకు ఇంట్లోనే ఉన్నారు. తర్వాత ఇద్దరూ కలిసి బైక్‌పై బయటకు వెళ్లారు. శిరీష తన ఫోన్‌ను ఇంట్లోనే పెట్టింది. సాయంత్రమైనా దంపతులు ఇంటికి రాలేదు. ఆరింటికి శిరీషకు ఆమె తండ్రి ఫోన్ చేయగా తాము బయట ఉన్నామని ఆయనకు వారు చెప్పారు. రాత్రి ఏడింటికి ఇంట్లో ఉంచిన తన ఫోన్‌కు భర్త ఫోన్ నుంచి శిరీష వీడియో కాల్ చేసింది. పెద్ద కుమారుడు సుశాంత్ లిఫ్ట్ చేసి మాట్లాడాడు. తమ్ముడిని బాగా చూసుకోవాలని, గొడవ పడొద్దంటూ ఆ బాబుకు రవి, శిరీష చెప్పి ఫోన్ కట్ చేశారు. ఆందోళనకు గురైన సుశాంత్ ఈ విషయాన్ని అమ్మమ్మ, తాత (శిరీష తల్లిదండ్రులు)కు ఫోన్ చేసి చెప్పాడు. రాత్రి 9 గంటలకు శిరీషకు ఆమె తల్లి ఫోన్ చేసింది. దంపతులు లిఫ్ట్ చేసి ఏడుస్తూ మాట్లాడుతూనే కాల్ కట్ చేశారు. ఆ వెంటనే శిరీష తండ్రి ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు.
అయితే బైక్‌పై ఘట్‌కేసర్ సమీపంలోని మాధవరెడ్డి ఫ్లై ఓవర్ బ్రిడ్జి సమీపానికి చేరుకున్న రవి, శిరీష దంపతులు అక్కడే వాహనాన్ని పార్క్ చేసి.. రైలు పట్టాల మీదకు వెళ్లారు. సికింద్రాబాద్‌వైపు వస్తున్న కృష్ణా ఎక్స్‌ప్రెస్ రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. లోకోపైలెట్ ఈ విషయాన్ని ఘట్‌కేసర్ స్టేషన్ మాస్టర్‌కు సమాచారమిచ్చాడు. మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ తల్లిదండ్రుల మృతదేహాలను చూసి కుమారులు కన్నీరుమున్నీరయ్యారు. కాగా రవి-శిరీష దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. కుంట్లూరులో ఐదేళ్లుగా నివాసం ఉంటున్నారు. ఇటివలే రవి కుమార్ ఇతరులతో కలిసి ఓ రెడీమిక్స్ ట్యాంకర్‌ను కొనుగోలు చేసినట్లు తెలిసింది. భాగస్వాములతోనే ట్యాంకర్‌కు సంబంధించిన లావాదేవీలపై గొడవ జరిగినట్లు తెలుస్తోంది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను సొంతూరు పాపాయిపేటకు తరలించారు.