ఆర్టిజన్ల సమ్మె తీవ్రతరం
ABN , Publish Date - Apr 10 , 2026 | 05:34 AM
తమ డిమాండ్ల సాధనే లక్ష్యంగా విద్యుత్ ఆర్టిజన్లు చేస్తున్న సమ్మె రెండోరోజు పూర్తి చేసుకుంది. సమ్మెపై ఆగ్రహం వ్యక్తం చేసిన జెన్‌కో కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధపడింది.
24 గంటల్లోపు చేరకుంటే విధులనుంచి తొలగిస్తాం: జెన్‌కో
హైదరాబాద్, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): తమ డిమాండ్ల సాధనే లక్ష్యంగా విద్యుత్ ఆర్టిజన్లు చేస్తున్న సమ్మె రెండోరోజు పూర్తి చేసుకుంది. సమ్మెపై ఆగ్రహం వ్యక్తం చేసిన జెన్‌కో కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధపడింది. సమ్మెలో పాల్గొన్న ఆర్టిజన్లు, వారిపై ఆధారపడిన వారెవరికీ కూడా మెడికల్ క్రెడిట్ కార్డులు, వైద్యానికి సంబంధించిన బిల్లులు రీయింబర్స్‌మెంట్ చేయకూడదని జెన్‌కో డైరెక్టర్ (హెచ్‌ఆర్) ఎస్.వి.కుమార్‌రాజు గురువారం మెమో జారీ చేశారు. సమ్మెలో లేనివారికి ఆ సేవలు కొనసాగించాలని సూచించారు. ఎస్మా చట్టం అమలులో ఉన్న సమయంలో సమ్మె చేస్తున్నందున ఆర్టిజన్లను విధుల నుంచి శాశ్వతంగా తొలగించాలని కూడా విద్యుత్ సంస్థలు నిర్ణయించాయి. ఈ నేపథ్యంలోనే సమ్మెలో పాల్గొన్న ఆర్జిజన్లకు జెన్‌కో గురువారం నోటీసులు జారీచేసింది. నోటీసులు అందుకున్న 24 గంటల్లోపు విధుల్లో చేరకుంటే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని హెచ్చరించింది.
ఆర్టీసీ కార్మికులతో కార్మికశాఖ అధికారుల భేటీ
కార్మికుల సమస్యలు పరిష్కరించాలని లేదంటే సమ్మె చేపడతామని ఆర్టీసీ యాజమాన్యానికి కార్మిక సంఘాలు నోటీసులు అందజేశాయి. ఈ నేపథ్యంలో నోటీసులు ఇచ్చిన ఆరు కార్మిక సంఘాల నాయకులతో కార్మికశాఖ అధికారులు గురువారం భేటీ అయ్యారు. ఈ సమావేశానికి ఆర్టీసీ అధికారులు రావాల్సి ఉండగా గౌర్హాజరయ్యారు. దీంతో తదుపరి చర్చలను కార్మిక శాఖ అధికారులు సోమవారానికి వాయిదా వేశారు.