ధాన్యం కొనుగోళ్లకు సమాయత్తం
ABN , Publish Date - Sep 22 , 2026 | 12:01 AM
2026-27 ఖరీఫ్ (వానాకాలం) సీజన్‌లో రైతులు పం డించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు జిల్లా యం త్రాంగం సన్నద్ధం అవుతోంది. జిల్లాలో వరి కోతలు నవంబరు చివరి వారం నుంచి ప్రారంభమయ్యే అవ కాశాలు ఉన్నాయి.
-4 లక్షల పై చిలుకు మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా
-117 సెంటర్ల ప్రారంభానికి సన్నాహాలు
-కేంద్రాల వద్ద రైతులకు మౌలిక సదుపాయాలు
-ఖరీఫ్‌లోనూ సన్నాలకు రూ. 500 బోనస్
-మద్దతు ధరలపైనే రైతుల పెదవి విరుపు
మంచిర్యాల, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): 2026-27 ఖరీఫ్ (వానాకాలం) సీజన్‌లో రైతులు పం డించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు జిల్లా యం త్రాంగం సన్నద్ధం అవుతోంది. జిల్లాలో వరి కోతలు నవంబరు చివరి వారం నుంచి ప్రారంభమయ్యే అవ కాశాలు ఉన్నాయి. ఇంకా పూర్తిస్థాయిలో వరి కోతలు ప్రారంభం కాకముందే సెంటర్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. గతంలో కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ఆ లస్యం కావడంతో వర్షాలు పడి రైతులకు తీరని నష్టం వాటిల్లింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని అఽధికారులు ముందస్తుగా చర్యలు చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
మూడు లక్షల ఎకరాల్లో సాగు...
2026 సంవత్సరానికి సంబంధించి జిల్లాలో వానాకాలం సీజన్‌లో 3 లక్షల 33వేల 430 ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అంచనా వేయగా, వానాకాలం సాగులో ప్రధానంగా వరి, పత్తి, కంది, మొక్కజొన్న పంటలను పండించారు. వరి లక్షా 57వేల ఎకరాల్లో సాగు అవుతుందని వ్యవసాయశాఖ అంచనా వేయగా 4 లక్షల 71వేల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. అలాగే పత్తి లక్షా 72వేల 499 ఎకరాలు, మొక్కజొన్న 153 ఎకరాలు, కందులు 1559 ఎకరాల్లో సాగయ్యాయి.
సన్నరకం వైపే మొగ్గు....
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సన్నరకం వరి ధాన్యం సాగును ప్రోత్సహించేందుకు రైతులకు అధనంగా క్వింటాలుకు రూ. 500 బోనస్ ప్రకటించింది. 2023-24 సీజన్ నుంచి ప్రారంభమైన బోనస్ చెల్లింపులు ఈ రభీ సీజన్‌లోనూ కొనసాగించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఈ ఖరీఫ్ సీజన్‌లో అధిక శాతం రైతాంగం సన్నరకం వరిసాగుకు మొగ్గు చూపింది. రాష్ట్ర ప్రభుత్వం సన్నరకాలకు బోనస్ రూ. 500 చెల్లించనుండటంతో క్వింటాకు రూ. 2961 ధర గిట్టుబాటు కానుంది. గత ఏడాది మద్దతు క్వింటాకు రూ. 2300 ఉండగా, ఈ ఏడాది సగటున రూ. 60 వరకు అధనంగా ధర లభించనుంది.
117 కేంద్రాల ఏర్పాటుకు...
ఖరీఫ్ సీజన్‌లో వరి ధాన్యం కొనుగోలుకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా డీఆర్‌డీఏ, పీఏసీఎస్, మెప్మా ఆధ్వర్యంలో 117 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు అధికారులు సమాయత్తం అవుతున్నారు. డీఆర్‌డీఏ, పీఏసీఎస్, మెప్మా ఆధ్వర్యంలో కేంధ్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఆయా కేంద్రాల్లో ఆన్‌లైన్ విధానంలో ధాన్యం కొనుగోళ్లు చేయనున్నారు. ఈ మేరకు సెంటర్ నిర్వాహకులకు అవసరమైన శిక్షణ పూర్తి చేశారు. అలాగే లక్ష్యం మేరకు దాన్యం కొనుగోలు కోసం మొత్తం 55 లక్షల గన్నీ సంచులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల కోసం మౌళిక సదుపాయాలు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఇతర ప్రాంతాల నుంచి తరలిపునకు చెక్...
జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాలకు ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి దాన్యం తరలింపు జరుగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టనున్నారు. కేవలం జిల్లా రైతులు పండించిన దాన్యాన్నే కొనుగోలు కేంద్రాలకు తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా రెవెన్యూ, పోలీసు, వ్యవసాయ శాఖల సిబ్బంది సమన్వయంతో జిల్లాలోకి వచ్చే అంతరాష్ట్ర సరిహద్దుల వద్ద వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేయనున్నారు. చెక్ పోస్టుల వద్ద 24 గంటల పర్యవేక్షణ చేపట్టాలనే ఆదేశాలు జారీ అయ్యాయి. ఇదిలా ఉండగా కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా అవసరమైన చర్యలు చేపట్టే యోచనలో అధికార యంత్రాం ఉంది.
మద్దతు ధరలపై రైతుల పెదవి విరుపు....
కాగా కేంధ్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా రబీ సీజన్‌లో వరి ధాన్యం మద్దతు ధరలపై రైతులు పెదవి విరుస్తున్నారు. కేంధ్రం ప్రకటించిన మేరకు వరి పంటకు మద్దతు ధర క్వింటాకు గ్రేడ్-ఏ రకం రూ. 2461 ఉండగా, కామన్ వెరైటీ ధర రూ. 2441 ఉంది. గత ఏడాది క్వింటాలుపై సగటున రూ. 117 చొప్పున ధరలు పెరిగాయి. ప్రస్తుతం సగటున రూ. 60 పెంచడం పట్ల రైతులు అయిష్టతను ప్రదర్శిస్తున్నారు. అయితే వరిసాగు చేసేందుకు ఎకరాకు సుమారు రూ. 25వేల వరకు ఖర్చు వస్తుందని, సాగు ఖర్చులకు అనుగుణంగా మరికొంత మద్దతు ధర పెంచాల్సిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దిగుబడిలో తాలు, తప్ప, ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగే నష్టంపోనూ పెద్దగా చేతికి వచ్చేది ఏమీలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దొడ్డు రకానికి రూ. 3500, సన్నరకానికి రూ. 4వేల వరకు ధర చెల్లిస్తే కొంతలో కొంత గిట్టుబాటయ్యేదని రైతులు చెబుతున్నారు.