3 టీఎంసీలకు గట్టు సామర్థ్యం పెంపు
ABN , Publish Date - Oct 02 , 2026 | 06:14 AM
గట్టు (నల సోమనాద్రి) రిజర్వాయర్ సామర్థ్యం 1.23 టీఎంసీల నుంచి మూడు టీఎంసీలకు పెంచాలని సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది.
హైదరాబాద్, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): గట్టు (నల సోమనాద్రి) రిజర్వాయర్ సామర్థ్యం 1.23 టీఎంసీల నుంచి మూడు టీఎంసీలకు పెంచాలని సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఇందుకోసం రూ.1,781 కోట్లతో పనులు చేపట్టాలని తీర్మానించింది. దీంతోపాటు రూ.1,017 కోట్ల అంచనాతో చిన్న కాళేశ్వరం (ముక్తేశ్వర్) ఎత్తిపోతల పథకంలో 8 చెరువుల నిర్మాణం, వరద కాలువ, మైనర్లు, ఫీల్డ్ ఛానెల్స్, సీసీ లైనింగ్, స్టేజ్-1 హెడ్ రెగ్యులేటర్, గైడ్‌వాల్, పంప్‌హౌస్ సౌకర్యాల కల్పన పనులు చేపట్టడానికి పరిపాలన అనుమతి ఇవ్వడానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇక శ్రీరాం సాగర్ ప్రాజెక్టు (ఎస్‌ఆర్‌ఎస్పీ) ఇందిరమ్మ వరద కాలువ ప్యాకేజీ-3లో పట్టణీకరణతో 4009 ఎకరాల ఆయకట్టును తొలగించాలన్న హైపవర్ కమిటీ ఆమోదానికి క్యాబినెట్ క్లియరెన్స్‌నిచ్చింది. ఇక మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో బాచారం హైలెవల్ కెనాల్ కింద 5,990 ఎకరాలకు, ముక్కిడిగుండం కెనాల్ కింద 1,600 ఎకరాలకు సాగునీరందించడానికి వీలుగా రూ.164 కోట్లతో పనులు చేపట్టడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.