గ్యాస్ ట్రబుల్..!
ABN , Publish Date - Mar 13 , 2026 | 04:33 AM
ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా యుద్ధ ప్రభావంతో మొదలైన గ్యాస్ కొరత రాష్ట్రంలో రోజురోజుకి పెరుగుతోంది. ముఖ్యంగా వాణిజ్య సిలిండర్ల సరఫరా చాలా చోట్ల నిలిచిపోయింది. డొమెస్టిక్ సిలిండర్ల సరఫరాపై ప్రస్తుతం ఎలాంటి ప్రభావం లేకున్నా..
కొనసాగుతున్న వాణిజ్య సిలిండర్ల కొరత
పలుచోట్ల బ్లాక్‌లో విక్రయం
హైదరాబాద్‌లో రూ.6వేలు పలికిన ధర
అధికమైన డొమెస్టిక్ సిలిండర్ల బుకింగ్‌లు
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్)
ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా యుద్ధ ప్రభావంతో మొదలైన గ్యాస్ కొరత రాష్ట్రంలో రోజురోజుకి పెరుగుతోంది. ముఖ్యంగా వాణిజ్య సిలిండర్ల సరఫరా చాలా చోట్ల నిలిచిపోయింది. డొమెస్టిక్ సిలిండర్ల సరఫరాపై ప్రస్తుతం ఎలాంటి ప్రభావం లేకున్నా.. ముందుజాగ్రత్తగా చాలా మంది సిలిండర్ బుక్ చేసుకుంటున్నారు. దీంతో బుకింగ్‌ల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. ఆన్‌లైన్, ఫోన్ లైన్‌లు సరిగా పని చేయకపోవడంతో జనం గ్యాస్ ఏజెన్సీల ముందు బారులు తీరుతున్నారు. దీంతో బుకింగ్‌కు సిలిండర్ డెలివరీకి మధ్య ఉండే వ్యవధిని ఏజెన్సీలు పెంచేశాయి. గ్యాస్ నిల్వలు నిండుకున్నాయని చెప్పగా.. వినియోగదారులు నిర్వాహకులతో ఘర్షణలకు దిగుతున్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని వనస్థలిపురం, బీఎన్‌రెడ్డినగర్ డివిజన్లలో వాణిజ్య సిలిండర్ల కొరత ఐదు రోజులుగా తీవ్రంగా ఉంది. చాలా చోట్ల సరఫరా ఆగిపోయింది. కొన్ని చోట్ల వాణిజ్య సిలిండర్‌ను రూ.6వేలుకు బ్లాక్‌లో విక్రయిస్తున్నారు. డొమెస్టిక్ సిలిండర్ల డెలివరీ ఆలస్యమవుతుండడంతో గ్యాస్ ఏజెన్సీల వద్ద గురువారం జనం బారులు తీరారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఏజెన్సీల వద్ద ఉదయం నుంచే జనం క్యూ కట్టారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో గ్యాస్ కొరత ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్నది వాణిజ్య సిలిండర్ల కోసం బుకింగ్ చేసిన వారం రోజుల తర్వాత రావొచ్చని ఏజెన్సీల ప్రతినిధులు తెలిపారు. మహబూబ్‌నగర్‌లో ఇండియన్ గ్యాస్ నుంచి వాణిజ్య గ్యాస్ సిలిండర్ల సరఫరా ఐదు రోజులుగా పూర్తిగా నిలిచిపోయింది. నాగర్‌కర్నూల్, నారాయణపేట, గద్వాల, వనపర్తి జిల్లాలతోపాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో వాణిజ్య సిలిండర్లకు సమస్య ఉంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలొ వాణిజ్య సిలిండర్లకు పెద్దగా ఇబ్బంది లేదు. కానీ, అక్కడక్కడ వంద నుంచి రెండు వందల రూపాయల వరకు అదనంగా వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో గ్యాస్ బ్లాక్‌లో విక్రయిస్తున్నారని గ్యాస్ ఏజెన్సీ ఎదుట బీఆర్‌ఎస్ నాయకులు నిరసనకు దిగారు. ఇక, ఖమ్మంలోని పలు హోటళ్లలో గురువారం దాడులు చేసిన జిల్లా పౌరసరఫరాల అధికారులు గృహ అవసరాలకు వినియోగించే 20సిలిండర్లను సీజ్ చేశారు. నల్లగొండ, యాదాద్రి జిల్లాలోని పలు హోటళ్లు, దాబాల్లో తనిఖీలు చేసిన పౌర సరఫరాల శాఖ టాస్క్‌ఫోర్స్ అధికారులు గృహ అవసరాలకు వినియోగించే 137 సిలిండర్లను గుర్తించి సీజ్ చేశారు. కాగా, కొరత సాకుతో గ్యాస్ ఏజెన్సీలు బ్లాక్ దందా చేసినా, సిలిండర్లను అధిక ధరలకు విక్రయించినా ఏజెన్సీలను రద్దు చేస్తామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. గృహ అవసరాలకు వాడే గ్యాస్ సిలిండర్ల కొరత లేదని, వాణిజ్య సిలిండర్ల విషయంలో కొంత సమస్య ఉందన్నారు. చమురు కంపెనీల ప్రతినిధులతో శుక్రవారం సమావేశమై డిమాండ్, సప్లయ్ గురించి ఆరా తీస్తామన్నారు.