Share News

ఆస్పత్రుల్లో రోగులకు కష్టాలు..

ABN , Publish Date - Mar 12 , 2026 | 04:54 AM

తెలంగాణవ్యాప్తంగా అనేక ప్రభుత్వ ఆస్పత్రులను సైతం గ్యాస్‌ కొరత కష్టాలు వెంటాడుతున్నాయి. ఉదాహరణకు.. 330 పడకలున్న సిరిసిల్ల బోధనాస్పత్రిలో రోజూ కనీసం 150 మంది ఇన్‌పేషెంట్లు ఉంటారు.

ఆస్పత్రుల్లో రోగులకు కష్టాలు..

తెలంగాణవ్యాప్తంగా అనేక ప్రభుత్వ ఆస్పత్రులను సైతం గ్యాస్‌ కొరత కష్టాలు వెంటాడుతున్నాయి. ఉదాహరణకు.. 330 పడకలున్న సిరిసిల్ల బోధనాస్పత్రిలో రోజూ కనీసం 150 మంది ఇన్‌పేషెంట్లు ఉంటారు. నిత్యం వారికి మూడుపూటలా డైట్‌ ఇవ్వాలంటే రోజుకు కనీసం ఒక గ్యాస్‌ సిలిండర్‌ అవసరం. అయితే ఆ బోధనాస్పత్రి పేరిట ఇంతవరకు ఒక్క గ్యాస్‌ కనెక్షన్‌ కూడా లేదు. సంబంధిత డైట్‌ కాంట్రాక్టరే బహిరంగ మార్కెట్‌లో సిలిండర్‌ కొని కాలం గడుపుతున్నారు. ఇన్నాళ్లూ వాణిజ్య సిలిండర్లు దొరుకుతుండడంతో ఎటువంటి ఇబ్బందీ ఎదురుకాలేదు. కానీ, ఇప్పుడు పరిస్థితి మారడంతో సమస్య మొదలైంది. గ్యాస్‌ సిలిండర్స్‌ దొరక్కపోవడం, బ్లాక్‌లో కొందామన్నా భరించలేనంత అధిక ధరలు చెబుతుండడంతో.. ‘‘ఇలాగైతే రోగులకు డైట్‌ అందించలేం’’ అని సదరు కాంట్రాక్టర్‌ తెగేసి చెప్పినట్లు సమాచారం. సిరిసిల్లకు 15 కిలోమీటర్ల దూరంలో ఉండే వేములవాడ ప్రాంతీయ ఆస్పత్రిలోనూ అదే పరిస్థితి. అక్కడ కూడా ఆస్పత్రి పేరిట గ్యాస్‌ కనెక్షన్‌ మంజూరు కాలేదు. ఆ బాధలేవో డైట్‌ కాంట్రాక్టర్లే పడేవారు. ఇప్పుడు గ్యాస్‌ దొరక్కపోవడంతో వాళ్లు చేతులెత్తేస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఆస్పత్రుల పేరిట గ్యాస్‌ కనెక్షన్లు మంజూరు చేయించాలని సంబంధిత ఆస్పత్రుల సూపరింటెండెంట్స్‌పై ఒత్తిడి తీసుకువస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇటువంటి పరిస్థితే నెలకొంది. నిబంధనల మేరకు ప్రతి ప్రభుత్వ ఆస్పత్రికీ సంబంధిత సూపరింటెండెంట్‌ పేరిట గతంలోనే ప్రభుత్వం గ్యాస్‌ కనెక్షన్లు మంజూరు చేసింది. ఆయా ఆస్పత్రుల్లో పడకలు, రోగుల బెడ్‌ ఆక్యుపెన్సీ, రోజూవారీ వాడే గ్యాస్‌ ఆధారంగా సిలిండర్స్‌ను గ్యాస్‌ ఏజెన్సీలు సరఫరా చేస్తుంటాయి. గతంలో ఏర్పడ్డ మెడికల్‌ కాలేజీలు, వాటి అనుబంధ ఆస్పత్రులకు ఇలా గ్యాస్‌ కనెక్షన్స్‌ మంజూరయ్యాయి. అయితే తెలంగాణ వైద్యవిధాన పరిషత్‌ (టీవీవీపీ) పరిధిలో జిల్లా ఆస్పత్రులు, ప్రాంతీయ ఆస్పత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో చాలామటుకు గ్యాస్‌ కనెక్షన్స్‌ మంజూరు కాలేదని సమాచారం. టీవీవీపీ పరిధిలోని జిల్లా ఆస్పత్రులు, ఏరియా ఆస్పత్రుల్లో కొన్ని డీఎంఈకి బదిలీ అయ్యాయి. అలా బదిలీ అయిన వాటికి ఇప్పటికీ గ్యాస్‌ కనెక్షన్స్‌ తీసుకోలేదు. హస్పిటల్‌ సూపరింటెండెంట్లకు అవగాహన లేకపోవడం వల్లనే ఇప్పుడు సమస్య ఎదురవుతోందని ఓ జిల్లాల్లోని డైట్‌ కాంట్రాక్టర్‌ ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధికి తెలిపారు. కారణాలేవైనాగానీ.. ఆస్పత్రులకు నిరాటంకంగా గ్యాస్‌ సరఫరా అయ్యేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వ ఆస్పత్రుల డైట్‌ కాంట్రాక్టర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. కాగా.. ప్రభుత్వ ఆస్పత్రులు, హాస్టల్స్‌, ఇతర సర్కారీ కార్యాలయాలకు రోజూ ఎన్ని సిలిండర్లు అవసరం అవుతున్నాయో వివరాలివ్వాలని ప్రభుత్వ రంగ చమురు సంస్థలైన హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌ కోరాయి. ఈ మేరకు బుధవారం అన్ని ప్రభుత్వ ఆస్పత్రులకూ సమాచారం పంపాయి. రోజూవారీ అవసరం ఎంత ఉందో తెలియజేస్తే అంత గ్యాస్‌ను ఎటువంటి ఆటంకం లేకుండా సరఫరా చేస్తామని ఆ సంస్థలు పేర్కొన్నట్లు సమాచారం.

Updated Date - Mar 12 , 2026 | 04:54 AM