Share News

గ్యాస్‌ కోసం తిప్పలు.. రోడ్ల పైనే కునుకు!

ABN , Publish Date - May 04 , 2026 | 04:15 AM

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో నెలకొన్న గ్యాస్‌ సిలిండర్ల కొరత లబ్ధిదారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. పనులన్నీ మానుకుని ఏజెన్సీల వైపు పరుగులు తీయిస్తోంది.

గ్యాస్‌ కోసం తిప్పలు.. రోడ్ల పైనే కునుకు!

  • అర్ధరాత్రి నుంచే ఏజెన్సీ వద్ద లబ్ధిదారుల పడిగాపులు

  • మహబూబాబాద్‌లో రోడ్డుపై బైఠాయింపు

దంతాలపల్లి, మే 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో నెలకొన్న గ్యాస్‌ సిలిండర్ల కొరత లబ్ధిదారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. పనులన్నీ మానుకుని ఏజెన్సీల వైపు పరుగులు తీయిస్తోంది. మహబూబాబాద్‌ జిల్లా ఉమ్మడి నర్సింహులపేట మండల కేంద్రంలోని భారత్‌ గ్యాస్‌ ఏజెన్సీ ఎదుట గ్యాస్‌ సిలిండర్ల కోసం జనం ఎగబడ్డారు. శనివారం అర్ధరాత్రి నుంచే మహిళలు సైతం రోడ్డు పైనే పడుకుని, తెల్లవారు జామున క్యూ లైన్లలో వేచిచూశారు. ఆదివారం ఏజెన్సీకి వచ్చిన సుమారు 320 సిలిండర్లను పోలీసుల ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. అయితే, వచ్చిన స్టాక్‌ అయిపోవడం, అంతకంటే ఎక్కువమంది లబ్ధిదారులు క్యూలైన్లలో ఉండడంతో మిగిలినవారికి నిరాశే ఎదురైంది. దీంతో ఆగ్రహించిన లబ్ధిదారులు ఖమ్మం-వరంగల్‌ జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. పోలీసులు జోక్యం చేసుకుని, అందరికీ గ్యాస్‌ అందేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు. కేంద్రం తగినన్ని సిలిండర్లను సరఫరా చేస్తోందని, ప్రజలు కొరత ఉందన్న సమాచారాన్ని నమ్మి అదనంగా సిలిండర్లను ఇంట్లో నిల్వ చేసుకోవద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఫోన్‌ద్వారా బుక్‌ చేసుకున్న వారికి 2 రోజుల్లో నేరుగా ఇంటి వద్దకే వచ్చి పంపిణీ చేస్తామని, ప్రజలు సహకరించాలని కోరారు.

Updated Date - May 04 , 2026 | 04:15 AM