అంతర్రాష్ట్రాల నుంచి నల్లగొండకు గంజాయి
ABN , Publish Date - May 02 , 2026 | 11:54 PM
ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల సరిహద్దుల నుంచి నల్లగొండ జిల్లాకు గంజాయి చేరవేసి, విక్రయిస్తున్న ముఠాను నల్లగొండ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు.
ఐదుగురు అరెస్ట్, మరో ఆరుగురు పరారీ
రూ.లక్ష విలువైన ఐదు కిలోల గంజాయి స్వాధీనం
నల్లగొండ క్రైం, మే 2 (ఆంధ్రజ్యోతి) : ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల సరిహద్దుల నుంచి నల్లగొండ జిల్లాకు గంజాయి చేరవేసి, విక్రయిస్తున్న ముఠాను నల్లగొండ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి రూ.లక్ష విలువైన ఐదు కిలోల గంజాయితో పాటు రెండు మోటార్‌సైకిళ్లు, ఐదు సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. శనివారం నల్లగొండ జిల్లా ఏఎస్పీ రమేష్ జిల్లాకేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. నల్లగొండ టూటౌన్ పోలీసులు హైదరాబాద్ రోడ్డులోని ఉడిపి హోటల్ పరిసరాల్లో వాహనాలు తనిఖీలు చేస్తున్న సమయంలో మధ్యాహ్నం రెండు బైకులపై వచ్చిన ఐదుగురిని ప్రశ్నించడంతో సదరు వ్యక్తులు పారిపోయేందుకు ప్రయత్నించారు. వెంటనే వారిని పట్టుకొని విచారించగా తాము కోరేపల్లి అభివన్(గంజాయిని అభినవ్) అనే వ్యక్తి నుంచి గంజాయి కొనుగోలు చేసి వెళ్తున్నట్లు తెలిపారు. అభినవ్ నల్లగొండ పట్టణంలో ఉంటూ చిన్నతనం నుంచే స్నేహితుల ద్వారా గంజాయి, మద్యం అలవాటు చేసుకున్నాడు. అతడి స్నేహితులైన గంటెకపు మధుకుమార్, కస్పరాజు నాగరాజు, మిగతా స్నేహితులతో కలిసి వ్యసనాలకు బానిసయ్యారు. తమ జల్సాల కోసం నల్లగొండ టూటౌన్ పోలీ్‌సస్టేషన్ పరిధితో పాటు నార్కట్‌పల్లి, త్రిపురారం పోలీ్‌సస్టేషన్ పరిధిలో బైకు దొంగతనాలు, పెట్రోల్ దొంగతనాలకు పాల్పడేవారు.
వారం రోజుల కిందట
వారం రోజుల కిందట గంటెకపు మధుకుమార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ రూరల్ ఫరిధిలోని ఇబ్రహీంపట్నం పోలీ్‌సస్టేషన్ పరిధిలో బైకు దొంగతనం చేశాడు. అదేబైక్‌పై నల్లగొండకు చెందిన అభినవ్‌తో కలిసి ఏవోబీ(ఆంధ్ర-ఒడిశా సరిహద్దు)లోని సీలేరు ప్రాంతాలకు వెళ్లి రూ.3వేలకు ఒక కిలో చొప్పున గంజాయిని కొనుగోలు చేసి తిరిగి నల్లగొండ పట్టణానికి చేరుకున్నారు. అనంతరం నల్లగొండలోని ఫైఓవర్ కింద కస్పరాజు నాగరాజుకు కిలో గంజాయి, జూలకంటి విష్ణువర్దన్‌కు కిలో గంజాయి, సంపత్ ఒక కిలో గంజాయి, మరో వ్యక్తి సుశాంత్‌కు ఒక కిలో విక్రయించారు. మిగిలిన మూడు కిలోల గంజాయి గంటెకపు మధుసూదన్ తన వద్ద ఉంచుకున్నాడు. శనివారం మధ్యాహ్నం అభినవ్, సింగపంగ రాకే్‌షలు కలిసి నల్లగొండ పట్టణంలోని ఉడిపి హోటల్ వద్ద ఒకరికి కిలో గంజాయి విక్రయించేందుకు రాగా పోలీసులు పట్టుకొని వారి నుంచి ఐదు కిలోల గంజాయితో పాటు ఐదు సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకొని నేరస్తులను రిమాండ్‌కు పంపారు. ఇదే కేసుకు సంబంధించిన భద్రాద్రికొత్తగూడెం జిల్లాకు చెందిన మల్లే మోహనకృష్ణ, ధరావత్ రాజేష్, నల్లగొండ జిల్లా కేంద్రానికిచెందిన బత్తుల శివసాయి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసులో కస్పరాజు నాగరాజు, గంటెకపు మధుకుమార్, జూలకంటి విష్ణువర్ధన్, సంపత్ కుమార్, సుశాంత్, మనుకర్ పరారీలో ఉన్నారని తెలిపారు. కేసును చేధించిన టూటౌన్ సీఐ రాఘవరావు, ఎస్‌ఐ సైదులుతో పాటు సిబ్బందిని ఎస్పీ శరత్ చంద్రపవార్ అభినందించారు.