Share News

మద్యం తాగించి బాలికపై గ్యాంగ్‌రేప్‌!

ABN , Publish Date - Feb 20 , 2026 | 01:44 AM

పదహారేళ్ల బాలికకు ముగ్గురు మాయమాటలు చెప్పి తమ వెంట తీసుకెళ్లి ఆమె పట్ల దారుణానికి ఒడిగట్టారు. బలవంతంగా మద్యం తాగించి..

మద్యం తాగించి బాలికపై గ్యాంగ్‌రేప్‌!

  • ముగ్గురు నిందితులు.. వారిలో ఇద్దరు మైనర్లు.. చార్మినార్‌ నుంచి ఆటోలో ఎక్కించుకొని చెంగిచెర్లకు

  • అక్కడ ఖాళీగా ఉన్న డబుల్‌ బెడ్‌రూం ఇంట్లో అత్యాచారం

  • స్కూల్‌కు అని చెప్పి స్నేహితుడిని కలిసేందుకు వెళ్లిన బాలిక

  • అక్కడ ఆమెకు మరో ఇద్దరిని పరిచయం చేయించిన బాలుడు

  • ఇద్దరు నిందితులు అదుపులో.. మరో బాలుడు పరారీలో

నార్సింగ్‌/హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): పదహారేళ్ల బాలికకు ముగ్గురు మాయమాటలు చెప్పి తమ వెంట తీసుకెళ్లి ఆమె పట్ల దారుణానికి ఒడిగట్టారు. బలవంతంగా మద్యం తాగించి.. కత్తులతో బెదిరించి రాత్రంతా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలోని చెంగిచెర్లలో ఈ ఘోరం జరిగింది. ముగ్గురు నిందితుల్లో ఇద్దరు మైనర్లున్నారు. నార్సింగ్‌ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం నార్సింగ్‌ పరిధిలోని ఓ కాలనీలో వాచ్‌మన్‌ కుటుంబం నివాసం ఉంటోంది. వారి మనుమరాలు(16 ఏళ్లు) ఆ ఇంట్లోనే ఉంటూ తొమ్మిదో తరగతి చదువుతోంది. వాచ్‌మన్‌ కుటుంబం గతంలో తలాబ్‌కట్ట ప్రాంతంలో ఉండేది. ఈనెల 7న బాలిక షాపింగ్‌ కోసం తమ సంబంధీకుల వెంట నార్సింగ్‌ నుంచి చార్మినార్‌ మదీనాకు వెళ్లింది. అక్కడ తలాబ్‌కట్టలో ఉన్న రోజుల్లో పరిచయం ఉన్న బాలుడు (16) ఆమెకు కనిపించాడు. పాత స్నేహితులు కావడంతో ఇద్దరూ మాట్లాడుకున్నారు. ఫోన్‌ నంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు. సరిగ్గా వారం రోజులకు బాలుడి నుంచి ఆమెకు ఫోనొచ్చింది. 16న ఉదయం 8:30కు బడికి వెళుతున్నానని ఇంట్లో చెప్పిన ఆమె, ఆ బాలుడిని కలిసేందుకు చార్మినార్‌కు వెళ్లింది. అక్కడ అతడితో కలిసి షాపింగ్‌ చేసింది. ఈ క్రమంలో ఆ బాలుడు తన మరో ఇద్దరు స్నేహితులను ఆమెకు పరిచయం చేశాడు.


ఆ ఇద్దరిలో ఒకరు తలాబ్‌కట్టకు చెందిన 21ఏళ్ల ఇమ్రాన్‌ ఉన్నాడు. షాపింగ్‌ ముగిశాక బాలికకు బిర్యానీ తినిపించిన ఆ ముగ్గురు, మాయమాటలు చెప్పి ఓ ఆటోలో ఎక్కించుకొని చెంగిచెర్ల వెళ్లారు. అక్కడ ఇమ్రాన్‌ తల్లిదండ్రులకు ప్రభుత్వం కేటాయించిన డబుల్‌బెడ్‌రూం ఉంది. ప్రస్తుతం ఆ ఇంట్లో ఎవరూ ఉంకపోవడాన్ని ఆసరాగా చేసుకొని.. నేరుగా అక్కడికి తీసుకెళ్లారు. అక్కడ బాలికతో బలవంతంగా మద్యం తాగించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఉదయం స్కూలుకు అని వెళ్లిన బాలిక చీకటిపడ్డాక కూడా ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు చుట్టు పక్కల వెతికారు. చివరికి నార్సింగ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాంకేతిక ఆధారాలతో చెంగిచెర్ల పరిధిలో బాలిక ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రత్యేక బృందం అక్కడికి వెళ్లి.. బాలికను డబుల్‌ బెడ్‌రూం ఇంట్లో ఉన్నట్లు గుర్తించింది. పోలీసుల రాకను గమనించి ఓ బాలుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఇమ్రాన్‌ను, మరో బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇమ్రాన్‌ను రిమాండ్‌కు, బాలుడిని జువైనల్‌ హోమ్‌కు తరలించారు. బాలికను రక్షించి చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఆమె పూర్తిగా కోలుకున్న తర్వాత స్టేట్‌మెంట్‌ రికార్డు చేసి మరింత లోతుగా విచారణ జరిపి పూర్తి వివరాలు వెల్లడిస్తామని డీసీపీ శ్రీనివాస్‌ తెలిపారు. కాగా ముగ్గురు నిందితులూ తలాబ్‌కట్టకు చెందినవారేనని, చిన్న చిన్న దొంగతనాలకు పాల్పడేవారని తెలిసింది. నిందితుల్లో ఇమ్రాన్‌పై రెయిన్‌బజార్‌ స్టేషన్‌లో రౌడీషీట్‌ ఉన్నట్లు, ఇప్పటివరకు 8 కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

Updated Date - Feb 20 , 2026 | 01:44 AM