kumaram bheem asifabad- పాతాళానికి గంగ
ABN , Publish Date - Nov 12 , 2026 | 10:19 PM
జిల్లాలో భూగర్భ జలమట్టం క్రమక్రమంగా తగ్గిపోతోంది. ఎల్‌నినో ప్రభావంతో ఈసారి కొన్ని మండలాల్లో సాధారణ వర్షపాతం లేకపోవడం, నీటి సంరక్షణ చర్యలు అంతంత మాత్రమే కావడం, నీటి నిల్వలు తగ్గడం.. వెరసి పాతాళ గంగ దిగజారుతోంది. సెప్టెంబరుతో పోలిస్తే.. అక్టోబరులో మీటరుకు పైగా తగ్గడం పరిస్థితికి అద్దం పడుతోంది. సెప్టెంబరులో జిల్లా సరాసరి భూగర్భ నీటిమట్టం 5.03 మీటర్లుగా ఉంది. కాగా అక్టోబరు నెలలో వచ్చే సరికి 6.09 మీటర్లకు దిగిపోయింది. ఒక్క నెలలోనే 1.06 మీటర్ల లోతుకు పడిపోయింది
- ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో తగ్గిన వర్షాలు
- ఎండుతున్న చెరువులు, కుంటలు
- వ్యవసాయం, తాగునీటి బోర్లపై ప్రభావం
ఆసిఫాబాద్, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో భూగర్భ జలమట్టం క్రమక్రమంగా తగ్గిపోతోంది. ఎల్‌నినో ప్రభావంతో ఈసారి కొన్ని మండలాల్లో సాధారణ వర్షపాతం లేకపోవడం, నీటి సంరక్షణ చర్యలు అంతంత మాత్రమే కావడం, నీటి నిల్వలు తగ్గడం.. వెరసి పాతాళ గంగ దిగజారుతోంది. సెప్టెంబరుతో పోలిస్తే.. అక్టోబరులో మీటరుకు పైగా తగ్గడం పరిస్థితికి అద్దం పడుతోంది. సెప్టెంబరులో జిల్లా సరాసరి భూగర్భ నీటిమట్టం 5.03 మీటర్లుగా ఉంది. కాగా అక్టోబరు నెలలో వచ్చే సరికి 6.09 మీటర్లకు దిగిపోయింది. ఒక్క నెలలోనే 1.06 మీటర్ల లోతుకు పడిపోయింది. గతేడాది జిల్లాలో సమృద్ధి వర్షాలతో అక్టోబరులో జిల్లా సరాసరి భూగర్భ నీటిమ ట్టం 4.5 మీటర్లుగా నమోదైంది. ఈ అక్టోబరుతో పోలిస్తే 1.58 మీటర్ల మేర నీటి మట్టం పడిపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుత యాసంగిలో బోర్ల కింద పంటలు సాగు చేయడంతో మరింత నీటిమట్టం పడిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న వేసవిలో తాగునీరు, సాగునీటి ఇబ్బందులు తప్పవనే ఆందోళన వ్యక్తమవుతోంది.
- వానాకాలంలో..
వానాకాలంలో జూలై చివర, ఆగస్టు మొదటి వారం లో కొద్ద మేర వర్షాలు కురవడంతో.. జలవనరుల్లో నీరు చేరింది. తరువాత వానలు ముఖం చాటేయడం, వాతావరణంలో మార్పులతో ఉష్ణోగ్రతలు పెరగడంతో.. భూగర్భ నెమ్మదిగా జలాలు పడిపోతు న్నాయి. ఎండల కారణంగా చెరువులు, కుంటల్లో నీటి నిల్వలు తగ్గుముఖం పడుతున్నాయి. ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ రెండు డివిజన్లలో వంద ఎకరాలలోపు, అంతకు మించి సాగునీటి ఆయకట్టు కలిగిన చెరువులు 516 ఉన్నాయి. జూలైలో ఉన్న నీటి నిల్వ పరిస్థితి అక్టోబరు వచ్చేసరికి చాలా చెరువుల్లో తగ్గిపోయింది. గతేడాది అక్టోబరులో ఆసిఫాబాద్ డివిజన్లోని తొమ్మిది, కాగజ్‌నగర్ డివిజన్లోని 131 చెరువుల్లో సర్ ప్లస్ (మత్తడి దూకే స్థాయి) నీరు ఉండగా.. ఈసారి ఒక్కదానిలోనూ ఆ పరిస్థితి కనిపిం చడం లేదు.గతేడాది అక్టోబరులో జిల్లాలోని 238 చెరువుల్లో 75-100 శాతం నీటి నిల్వలు ఉండగా.. ఈసారి ఆ సంఖ్య 103 కు పడిపోయింది.
- నీటి మట్టాలను..
జిల్లాలో భూగర్భ నీటిమట్టాలను కొలిచేందుకు 31 ఫీజోమీటర్లు ఏర్పాటు చేశారు. ఆసిఫాబాద్ మండలంలోని రెండు ప్రాంతాల్లో అక్టోబరులో సరాసరి నీటిమ ట్టం10-14. 70 మీటర్లు కాగా, ఒక ప్రాంతంలో 1.07మీటర్ల లోతులోనే నీటి జాడలు ఉన్నాయి. సిర్పూర్ (టి), రెబ్బెన మండలాల్లోని ఓ ప్రాంతంలో 0.02 మీటర్లు, లింగాపూర్ లొద్దిగూడలో 0.75 మీటర్ల మేర నీరు నీటిజాడలు కనిపిస్తోంది. 22ప్రాంతాల్లో 2-8 మీటర్ల పరిధిలో, ఏడు ప్రాంతాల్లో 9-17.51 మీటర్ల పరిధిలో ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.ప్రస్తుతం భూగర్భ జలమట్టాలు తగ్గుతున్న నేపథ్యంలో అధికా రులు ఇప్పటి నుంచే తగిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. వర్షపు నీటిని ఒడిసిపట్టేలా చెక్‌డ్యాంలు, ఇంకుడు గుంతలు, పాత చెరువుల పునరుద్ధరణకు ప్రాధాన్యం ఇవ్వాలి. గ్రామాల్లో నీటి సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించాలి. వ్యవసాయంలో అవసరానికి మించి నీటి ని వినియోగించకుండా రైతులకు సూచనలు చేయా లి. ముఖ్యంగా బోరుబావుల ద్వారా నీటిని విచ్చలవిడిగా తోడకుండా నియంత్రణ చర్యలు చేపట్టాలి.
- రానున్న రోజుల్లో..
జిల్లాలో రానున్న రోజుల్లో భూగర్భ జలమట్టాలు మరింత తగ్గితే వేసవిలో తాగునీటి సమస్య తీవ్రతరం అయ్యే అవకాశముంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో నీటి లభ్యతపై ఆందోళన వ్యక్తమవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి అవసరాలతో పాటు పంటల సాగుకు కూడా నీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో సంబంధిత శాఖ ల అధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ నీటి సంరక్షణకు కార్యా చరణ రూపొందించాలని ప్రజలు కోరుతున్నారు. భూగర్భ జలాలను కాపాడుకోవడం ప్రభుత్వంతో పాటు ప్రతీ ఒక్కరి బాధ్యతగా గుర్తించి నపుడే భవిష్యత్తులో నీటి ఎద్దడి నుంచి గట్టెక్కే అవకాశం ఉంటుంది.