ట్యాంక్‌బండ్‌పై నుంచే నిమజ్జనాలు చేయాలి
ABN , Publish Date - Sep 22 , 2026 | 05:50 AM
హైదరాబాద్‌లో అనేక సంవత్సరాలుగా వినాయక నిమజ్జనాలను హుస్సేన్‌సాగర్(వినాయకసాగర్)లో ట్యాంక్‌బండ్ పైనుంచి చేస్తుండగా.. ఈసారి ఆ మార్గంలో నిషేధించటం దుర్మార్గమని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ఆగ్రహం వ్యక్తంచేసింది.
భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి డిమాండ్.. బారికేడ్లు తొలగించి పోలీసులతో వాగ్వాదం..
కవాడిగూడ, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో అనేక సంవత్సరాలుగా వినాయక నిమజ్జనాలను హుస్సేన్‌సాగర్(వినాయకసాగర్)లో ట్యాంక్‌బండ్ పైనుంచి చేస్తుండగా.. ఈసారి ఆ మార్గంలో నిషేధించటం దుర్మార్గమని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ఆగ్రహం వ్యక్తంచేసింది. జీహెచ్‌సీఎం అధికారులు, పోలీసులు హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని సమితి ప్రధాన కార్యదర్శి రవినూతల శశిధర్, సెంట్రల్ కమిటీ సభ్యుడు ఆలెభాస్కర్‌లు ఆరోపించారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ట్యాంక్‌బండ్ పై నుంచే గణేశ్ నిమజ్జనాలు చేసితీరతామని స్పష్టం చేశారు. జీహెచ్‌ఎంసీ నిర్ణయాన్ని నిరసిస్తూ సోమవారం లోయర్ ట్యాంక్‌బండ్‌లోని అంబేడ్కర్ విగ్రహం నుంచి ట్యాంక్‌బండ్‌పైకి భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. హుస్సేన్‌సాగర్ వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లు తొలగించి, పోస్టర్లు చించి వేశారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా ఇరువర్గాల మధ్య తోపులాట జరగడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఓ దశలో ఆందోళనకారులు రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.